ఆర్థిక మంత్రిత్వ శాఖ

“స‌మ‌ష్టిగా కోలుకుందాం.. బ‌లంగా కోలుకుందాం”పై జి-20 స‌ద‌స్సులో పాల్గొన్న‌ ఆర్థిక‌ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

Posted On: 09 DEC 2021 2:29PM by PIB Hyderabad

   జి-20 కూటమి అధ్యక్ష దేశం హోదాలో ఇండోనేషియా ప్రభుత్వం బాలి దీవిలో నిర్వహించిన జి-20 అంతర్జాతీయ సదస్సులో కేంద్ర ఆర్థిక-కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ నుంచి వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా పాల్గొన్నారు.

జి-20 అధ్యక్ష దేశం ఇండోనేషియా బాలి దీవిలో నిర్వహించిన జి-20 అంతర్జాతీయ సదస్సులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ నుంచి వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ప్రసంగిస్తున్న దృశ్యం

   ప్రస్తుత ఏడాదిలో జి-20 ఇతివృత్తం “స‌మ‌ష్టిగా కోలుకుందాం.. బ‌లంగా కోలుకుందాం”పై ఆర్థిక మంత్రి ప్రసంగించారు. అన్ని దేశాలూ సమష్టిగా పురోగతి సాధించడమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ శక్తిమంతంగా, సుస్థిరంగా, సమతుల-సార్వజనీన పునరుద్ధరణకు అత్యవసరమని ఈ సందర్భంగా ఆమె నొక్కిచెప్పారు. ఈ లక్ష్య సాధనలో బహుపాక్షికత, సామూహిక కార్యాచరణలదే కీలక పాత్ర కాగలదని పేర్కొన్నారు. అంతర్జాతీయ పునరుద్ధరణలో సార్వజనీనత, పెట్టుబడులు, ఆవిష్కరణలు, వ్యవస్థల మద్దతుకుగల ప్రాధాన్యాన్నికూడా శ్రీమతి సీతారామన్ సుస్పష్టం చేశారు.

   ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణలో కనిపిస్తున్న అసమతౌల్యాన్ని తగ్గించడంలో టీకాలు, చికిత్స విధానాల సరళ, సమాన లభ్యతకు భరోసా కల్పించాల్సిన ప్రాముఖ్యాన్ని ఆర్థికమంత్రి నొక్కిచెప్పారు. తదనుగుణంగా భారత్‌ ఇప్పటిదాకా 1.25 బిలియన్ మోతాదుల టీకాలిచ్చే ప్రక్రియను పూర్తిచేసిందని, అంతేకాకుండా 90 దేశాలకు 72 మిలియన్లకుపైగా టీకా మోతాదులను సరఫరా చేసిందని శ్రీమతి నిర్మలా సీతారామన్‌ ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందులో భాగంగా పూర్తి సహాయం కింద కూడా టీకాలు అందించామని, సమన్వయంతో కూడిన ప్రపంచ కార్యాచరణపై భారత్‌ నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

   వృద్ధి పథంలో తిరిగి వేగంగా, స్థిరంగా ముందడుగు వేయాలంటే మౌలిక సదుపాయాలలో  పెట్టుబడులు మరింత మెరుగుపడాల్సిన అవసరాన్ని ఆర్థిక మంత్రి నొక్కిచెప్పారు. ప్రభుత్వాలు చేపడుతున్న పునర్నిర్మాణ కృషిలో హరిత పెట్టుబడులదే కీలకపాత్ర అని శ్రీమతి సీతారామన్ స్పష్టం చేశారు. ఆ మేరకు హరిత వృద్ధి దిశగా అభివృద్ధి చెందుతున్న దేశాల కృషికి తోడ్పడేందుకు వాతావరణ ఆర్థిక సాయం, హరిత సాంకేతికతలను ఏ విధంగా అందుబాటులో ఉంచాలనే అంశంపై జి-20 కూటమి చర్చించాలని ఆమె పిలుపునిచ్చారు.

 

***



(Release ID: 1779990) Visitor Counter : 109