ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
హర్ ఘర్ దస్తక్ పురోగతిపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఆరోగ్యమంత్రిత్వశాఖ సమీక్ష
నవంబర్ 30 వరకు 11.7% పెరిగిన రెండో డోస్ టీకాలు
ప్రభుత్వం ప్రైవేటు కేంద్రాల్లో టీకా మందు గడువు దాటకూడదు, అందుబాటులో ఉన్న టీకాలు సకాలంలో వాడాలి
టీకాల వృధా సున్నా స్థాయిలో ఉంచాలని రాష్ట్రాలకు సూచన
Posted On:
02 DEC 2021 1:52PM by PIB Hyderabad
కోవిడ్ టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు చేపట్టిన హర ఘర్ దస్తక్ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. నవంబర్ 30 వరకు మొదటి డోస్ టీకాలలో 5.9% పెరుగుదల నమోదు కాగా, రెండో డోస్ టీకాలు 11.7% పెరిగాయి. ఈ కార్యక్రమంలో పురోగతి మీద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులు, నేషనల్ హెల్త్ మిషన్ ఎండీలతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపిన కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్ ఈ మేరకు వెల్లడించారు.
మొదటి డోస్ టీకాకు అర్హులైనవారిలోనూ, రెండో డోస్ వేయించుకోవాల్సినవారిలోనూ అవగాహన పెంచి వారిని టీకా కేంద్రాలకు రప్పించేలా చేయాలన్న లక్ష్యంతో 2021 నవంబర్ 3 న హర్ ఘర్ దస్తక్ టీకా ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టారు. దీనిద్వారా అన్నీ రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో ఇంటింటికీ వెళ్ళి టీకాలు వేసే కార్యక్రమం ఊపందుకుంటోంది.
ఈ ప్రచారోద్యమంలో పాలుపంచుకొని సత్ఫలితాలు సాధించిన రాష్టఱయలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఈ సందర్భంగా ఆరోగ్య కార్యదర్శి అభినందించారు. ఈ కార్యక్రమం వలన టీకాలు బాగా వేగం పుంజుకున్నప్పటికీ దేశ వ్యాప్తంగా రెండో డోస్ తీసుకోవాల్సినవారి సంఖ్య దాదాపు 12 కోట్లు ఉందని గుర్తు చేశారు. హర ఘర్ దస్తక్ ప్రచారోద్యమమలో మొదటి, రెండో డోస్ పురోగతిని ఈ క్రింది చిత్రపటంలో చూడవచ్చు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 125 కోట్ల టీకా డోసుల పంపిణీ పూర్తయింది. ఇందులో 79.13 కోట్ల మంది లబ్ధిదారులు (84.3%) మొదటి డోస్ తీసుకోగా 45.82 కోట్లమంది (49%) రెండో డోస్ తీసుకున్నట్టు తాత్కాలిక సమాచారం తెలియజేస్తోంది.
రాష్ట్రాలకు ఇచ్చిన సూచనలు ఇలా ఉన్నాయి:
1. అర్హులైన లబ్ధిదారులందరికీ మొదటి డోస్ పూర్తి చేయాలి.
2. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మొదటి డోస్ తీసుకున్నవారందరికీ రెండో డోస్ పూర్తయ్యేలా కార్యాచరణ ప్రణాళికా రూపొందించుకోవటం ద్వారా వేగవంతం చేయటం
3. అందుబాటులో ఉన్న టీ కామందును సకాలంలో వాడటం; ప్రభుత్వ, ప్రైవేట్ టీకాకేంద్రాలన్నీటిలోనూ కాలపరిమితి మించకుండా చూసుకోవటం
4. జైకోవ్-డి ముందుగా వినియోగించే ఏడు రాష్ట్రాల ( బీహార, జార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్) లో మొదటి దశ టీకాలు వేసుకోనివాళ్ళు ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించి కొత్త టీకా వాడకానికి సిద్ధం చేయటం
5. జైకోవ్ –డి విషయంలో జాతీయ స్థాయి శిక్షణ పూర్తయింది. ఫార్మాజెట్ ఇంజెక్టర్ ఆధారంగా ఆయా రాష్ట్రాలు శిబిరాలను నిర్ణయించాలి. టీకాలిచ్చేవారికి శిక్షణ యివ్వాలి.
మారుమూల ప్రాంతాలకు సైతం టీకా కార్యక్రమాన్ని బవిస్తరించటంలో తమ అనుభవాలను రాష్ట్రాలు ఈ సందర్భంగా కేంద్ర కార్యదర్శితో పంచుకున్నాయి. స్థానికంగా పేరున్న పెద్దల సహకారం తీసుకుంటూ ప్రజలలో అవగాహన పెంచటం ద్వారా టీకాలు తీసుకోవటానికి ముందుకు వచ్చేట్లు చేయాలని కేంద్ర కార్యదర్శి సూచించారు.
****
(Release ID: 1777353)
Visitor Counter : 221