ప్రధాన మంత్రి కార్యాలయం

ఔషధ రంగ తొలి ప్రపంచ ఆవిష్కరణ సదస్సును ప్రారంభించిన ప్రధానమంత్రి


“భారత ఆరోగ్య సంరక్షణ రంగం సముపార్జించిన ప్రపంచవ్యాప్త విశ్వాసమే
ఇటీవలి కాలంలో భారతదేశానికి ‘ప్రపంచ ఔషధ కేంద్రం’గా పేరు తెచ్చింది”

“మొత్తం మానవాళి శ్రేయస్సు మాకు ముఖ్యం… కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి సమయంలో ఈ స్ఫూర్తిని మేం ప్రపంచ మొత్తానికీ స్పష్టం చేశాం”

“భారత్లో పరిశ్రమను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లే సమర్థులైన
శాస్త్రవేత్తలు.. సాంకేతిక నిపుణులు మా దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ఈ సామర్థ్యాన్ని ‘డిస్కవర్ అండ్ మేక్ ఇన్ ఇండియా’ కోసం వాడుకోవాలి”

“టీకాలు.. మందుల కోసం కీలకమైన పదార్థాల దేశీయ తయారీ పెంపు
గురించి మనం ఆలోచించాలి.. ఇది భారత్‌ అధిగమించాల్సిన ఒక హద్దు”

“భారత్‌లో ఆలోచనకు రూపమివ్వండి.. భారత్‌లో ఆవిష్కరించండి..
‘మేక్ ఇన్ ఇండియా.. మేక్ ఫర్ ది వరల్డ్’ దిశగా మీ అందరికీ ఇదే
మా ఆహ్వానం; మీ సిసలైన శక్తిని కనుగొని ప్రపంచానికి సేవ చేయండి”

Posted On: 18 NOV 2021 4:45PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఔషధ రంగానికి సంబంధించిన తొలి ‘ప్రపంచ ఆవిష్కరణ సదస్సు’ను ప్రారంభించారు. కేంద్ర మంత్రి డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- ఈ మహమ్మారి ఔషధ రంగంపై నిశిత దృష్టి సారించేలా చేసింది. జీవనశైలి అయినా… మందులైనా… వైద్య సాంకేతికత అయినా.. టీకా అయినా.. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రతి అంశం గడచిన రెండేళ్లుగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో భార‌త ఔష‌ధ ప‌రిశ్ర‌మ కూడా సదరు స‌వాలుకు దీటుగా ఎదిగిందని ప్రధానమంత్రి అన్నారు. ఆ మేరకు “భారత ఆరోగ్య సంరక్షణ రంగం సముపార్జించిన  ప్రపంచవ్యాప్త విశ్వాసమే ఇటీవలి కాలంలో భారతదేశానికి ‘ప్రపంచ ఔషధ కేంద్రం’గా పేరు తెచ్చింది” అని శ్రీ మోదీ అన్నారు.

   “ఆరోగ్యం అనే పదానికి మా నిర్వచనంలో ఎలాంటి హద్దులూ లేవు. మొత్తం మానవాళి శ్రేయస్సు మాకు ముఖ్యం… కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి సమయంలో ఈ స్ఫూర్తిని మేం ప్రపంచ మొత్తానికీ స్పష్టం చేశాం” అని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. మహమ్మారి సమయాన “మహమ్మారి తొలిదశలో 150 దేశాలకు ప్రాణరక్షక మందులతోపాటు వైద్య పరికరాలను మేం ఎగుమతి చేశాం. అలాగే ఈ ఏడాదిలో దాదాపు 100 దేశాలకు 65 మిలియన్లకుపైగా కోవిడ్ టీకాలను కూడా ఎగుమతి చేశాం” అని ప్రధాని గుర్తుచేశారు. ఔషధాన్వేషణ, వినూత్న వైద్య పరికరాల రూపకల్పనలో భారతదేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దగల ఆవిష్కరణల కోసం ఒక పర్యావరణ వ్యవస్థను సృష్టించగలమని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దిశగా భాగస్వాములందరితోనూ విస్తృత సంప్రదింపుల ఆధారంగా విధానపరమైన చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. భారత్‌లో ఔషధ పరిశ్రమను మరింత ఉన్నతస్థాయికి చేర్చగల సమర్థులైన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో ఉన్నారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. “ఈ సామర్థ్యాన్ని ‘డిస్కవర్ అండ్ మేక్ ఇన్ ఇండియా’ కోసం వాడుకోవాలి” అని ఆయన  సూచించారు.

   దేశీయంగా సామర్థ్యాలను విస్తరించుకోవడాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. “నేడు భారతదేశాన్ని స్వయం సమృద్ధంగా రూపుదిద్దే బాధ్యతను 130 కోట్ల మంది ప్రజలు స్వీకరించిన నేపథ్యంలో టీకాలు, మందుల కోసం కీలక పదార్థాల దేశీయ తయారీ పెంపు గురించి మనం యోచించాలి. ఇది భారత్‌ అధిగమించాల్సిన ఒక హద్దు” అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. చివరగా- భారత్‌లో ఆలోచనకు రూపమివ్వండి.. భారత్‌లో ఆవిష్కరించండి. ‘మేక్ ఇన్ ఇండియా.. మేక్ ఫర్ ది వరల్డ్’ దిశగా మీ అందరికీ ఇదే మా ఆహ్వానం; మీ సిసలైన శక్తిని కనుగొని ప్రపంచానికి సేవ చేయండని పిలుపునిస్తూ ప్రధాని ఆహ్వానం పలికారు.

 

***

DS/AK



(Release ID: 1773087) Visitor Counter : 167