ప్రధాన మంత్రి కార్యాలయం
దేశీయ టీకా తయారీదారుల తో సంభాషించిన - ప్రధానమంత్రి
భారతదేశం వంద కోట్ల టీకా మైలు రాయిని దాటడానికి దారి తీసిన టీకా తయారీదారుల ప్రయత్నాలను ప్రశంసించిన - ప్రధానమంత్రి
గత ఒకటిన్నర సంవత్సరాలలో నేర్చుకున్న అత్యుత్తమ అభ్యాసాలను దేశం సంస్థాగతీకరించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చిన - ప్రధాన మంత్రి
ప్రధానమంత్రి దార్శనికతను, క్రియాశీల నాయకత్వాన్ని ప్రశంసించిన - టీకా తయారీదారులు
ప్రభుత్వం, పరిశ్రమల మధ్య ఎన్నడూ చూడని సహకారాన్ని అభినందించిన - టీకా తయారీదారులు
Posted On:
23 OCT 2021 7:41PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లోక్ కళ్యాణ్ మార్గ్ లో దేశీయ టీకా తయారీదారులతో సంభాషించారు.
భారతదేశం వంద కోట్ల టీకా మైలు రాయిని దాటడానికి టీకా తయారీదారులు చేసిన ప్రయత్నాలను ప్రధానమంత్రి ప్రశంసిస్తూ, భారతదేశ విజయగాథ లో వారు కీలక పాత్ర పోషించారని, పేర్కొన్నారు. మహమ్మారి సమయంలో వారి కృషి, విశ్వాసాన్ని ఆయన ప్రశంసించారు.
గత ఒకటిన్నర సంవత్సరాలలో నేర్చుకున్న అత్యుత్తమ పద్ధతులను దేశం సంస్థాగతీకరించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి ఉద్బోధిస్తూ, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మన పద్ధతులను సవరించుకోడానికి ఇది ఒక చక్కటి అవకాశమని, పేర్కొన్నారు. టీకాలు వేసే కార్యక్రమం విజయవంతమైన నేపథ్యంలో ప్రపంచం మొత్తం భారతదేశాన్ని గమనిస్తోంది, ఆయన అన్నారు. భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకు టీకా తయారీదారులు నిరంతరం కలిసి పనిచేయాలని కూడా ఆయన అన్నారు.
టీకాల అభివృద్ధికి నిరంతర మార్గదర్శకత్వం, మద్దతు అందించడంలో ప్రధానమంత్రి దార్శనికత, క్రియాశీల నాయకత్వాన్ని దేశీయ టీకా తయారీదారులు ప్రశంసించారు. ప్రభుత్వం, పరిశ్రమల మధ్య మునుపెన్నడూ లేని సహకారాన్ని వారు ప్రశంసించారు. అదేవిధంగా, ఈ మొత్తం ప్రయత్నంలో మొదటి నుంచి అమలు చేసిన నియంత్రణ సంస్కరణలు, సరళీకృత విధానాలు, సకాలంలో ఆమోదాలతో పాటు ప్రభుత్వానికి చెందిన భవిష్యత్ ప్రణాళికలు, సహాయక స్వభావాల పట్ల కూడా వారు సంతోషం వ్యక్తం చేశారు. దేశం పాత నిబంధనలు అనుసరించి నట్లయితే, గణనీయమైన ఆలస్యం జరిగేదనీ, ఫలితంగా, ఇప్పటి వరకు సాధించిన టీకా స్థాయికి చేరుకోలేకపోయే వారమనీ, వారు పేర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన నియంత్రణ సంస్కరణలను శ్రీ అదర్ పూనావాలా ప్రశంసించారు. మహమ్మారి సమయంలో ప్రధానమంత్రి నాయకత్వాన్ని శ్రీ సైరస్ పూనవాలా ప్రశంసించారు. కోవాక్సిన్ టీకాను తీసుకున్నందుకు, దాని అభివృద్ధి సమయంలో నిరంతర మద్దతు, ప్రేరణ ఇచ్చినందుకు, డాక్టర్ కృష్ణ ఎల్ల ప్రధానమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ లో డి.ఎన్.ఏ. ఆధారిత టీకా గురించి మాట్లాడినందుకు శ్రీ పంకజ్ పటేల్ ప్రధానమంత్రి కి ధన్యవాదాలు తెలియజేశారు. దేశం టీకా మైలురాయిని చేరుకోవడానికి సహాయపడిన ప్రధానమంత్రి దార్శనికతను, శ్రీమతి మహిమా దాట్ల, ప్రశంసించారు. డాక్టర్ సంజయ్ సింగ్ మాట్లాడుతూ, టీకా అభివృద్ధి రంగంలో ఆవిష్కరణ ప్రాముఖ్యత గురించి, దాని వెనుక సమైక్యత గురించి పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రయత్నంలో ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సహకారాన్ని శ్రీ సతీష్ రెడ్డి ప్రశంసించారు. మహమ్మారి సమయంలో ప్రభుత్వ నిరంతర కమ్యూనికేషన్ వ్యవస్థను డాక్టర్ రాజేష్ జైన్ ప్రశంసించారు.
ఈ సంభాషణ కార్యక్రమంలో - సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన శ్రీ సైరస్ పూనవల్ల, శ్రీ అదార్ పూనవల్ల; భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థకు చెందిన డా. కృష్ణ ఎల్ల, శ్రీమతి సుచిత్ర ఎల్ల; జైడస్ కాడిలా సంస్థకు చెందిన శ్రీ పంకజ్ పటేల్, డాక్టర్ షెర్విల్ పటేల్; బయోలాజికల్ ఇ. లిమిటెడ్ సంస్థకు చెందిన శ్రీమతి మహిమా దాట్ల, శ్రీ నరేందర్ మంటెలా; జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన డాక్టర్ సంజయ్ సింగ్, శ్రీ సతీష్ రామన్ లాల్ మెహతా; డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కు చెందిన శ్రీ సతీష్ రెడ్డి, శ్రీ దీపక్ సప్ర; పనేసియా బయోటెక్ లిమిటెడ్ కు చెందిన డాక్టర్ రాజేష్ జైన్, శ్రీ హర్షిత్ జైన్ తో పాటు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి, కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి ప్రభృతులు కూడా పాల్గొన్నారు.
*****
(Release ID: 1766040)
Visitor Counter : 203
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam