ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

యునిసెఫ్ ప్రపంచ పిల్లల నివేదికను విడుదల చేసిన - శ్రీ మన్సుఖ్ మాండవీయ


యువత, పిల్లల మానసిక ఆరోగ్యంపై కోవిడ్-19 ప్రభావాన్ని తెలియజేసిన - యునిసెఫ్ నివేదిక

"శారీరిక, మానసిక ఆరోగ్యాలు భారతీయ వైద్య సంప్రదాయాలలో విడదీయరానివి, ఇవి సంపూర్ణ ఆరోగ్యాన్ని నొక్కి చెబుతాయి"

ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టించడానికి మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం చాలా అవసరం : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

"పరీక్షల ఒత్తిడి నుండి విద్యార్థులు ఉపశమనం పొందడానికి ప్రధానమంత్రి వ్యక్తిగత ప్రయత్నం చేశారు" : ‘పరీక్షా-పే-చర్చ’ పై శ్రీ మాండవీయ

Posted On: 05 OCT 2021 4:06PM by PIB Hyderabad

"ప్రపంచ పిల్లల స్థితి-2021 ; నా దృష్టిలో : పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, రక్షించడం మరియు చూసుకోవడం" అనే శీర్షికతో, యునిసెఫ్ రూపొందించిన ప్రపంచ స్థాయి ప్రముఖ ప్రచురణ ను, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, శ్రీ మన్సుఖ్ మాండవీయ, ఈ రోజు ఇక్కడ విడుదల చేశారు. పిల్లల మానసిక ఆరోగ్యంపై కోవిడ్-19 మహమ్మారి చూపిన గణనీయమైన ప్రభావాన్ని ఈ నివేదికలో వివరించడం జరిగింది.

ఈ నివేదిక ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది.  మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించే ఈ నివేదిక యొక్క ప్రాముఖ్యతను శ్రీ మాండవీయ వివరిస్తూ,  "మానసిక ఆరోగ్యం అనేది పాత సమస్య మరియు అభివృద్ధి చెందుతున్న సమస్య.  మన సంప్రదాయ వైద్య వ్యవస్థలు సంపూర్ణ ఆరోగ్యం మరియు పూర్తి శ్రేయస్సు పై ఎక్కువ గా దృష్టి కేంద్రీకరించి నప్పటికీ, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతూనే వున్నాయి." అని పేర్కొన్నారు.   గ్రామీణ-వ్యవసాయ నేపథ్యం నుండి తమ సొంత ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన ఒక ఉదాహరణను ఆయన ఉటంకిస్తూ,   ఇటువంటి వాతావరణంలో పిల్లలు మరియు కౌమారదశలో ఉన్నవారు తమ కుటుంబం లోని ఇతర సభ్యులతో పరస్పరం సంభాషించే అవకాశాన్ని పొందుతారనీ, తమ భావోద్వేగాలను వారితో పంచుకోగలుగుతారనీ, తద్వారా కొన్నిసార్లు తల్లిదండ్రులు శ్రద్ధ చూపని విషయాలపై మార్గదర్శకత్వం  పొందగలరని ఆయన వివరించారు.  కాగా, దీనికి భిన్నంగా, ప్రస్తుతం, చిన్న కుటుంబాల సంస్కృతి పరాధీనత, ఒంటరితనం పెరగడానికి దారితీస్తోందని, తత్ఫలితంగా మానసిక క్షోభకు కారణమవుతోందని, ఆయన ఈ సందర్భంగా, తమ ఆవేదన వ్యక్తం చేశారు. 

కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, “కోవిడ్-19 మొత్తం సమాజాన్ని మానసిక ఒత్తిడికి గురి చేసింది." అని నొక్కి చెప్పారు.  కోవిడ్-19 రెండో దశ సమయంలో ఔషధ శాఖ మంత్రి గా తమ వ్యక్తిగత అనుభవాన్ని ఆయన వివరిస్తూ,  "ఔషధాల ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించాలి. కొత్త ప్లాంట్లను స్థాపించడానికి అధికారిక ప్రక్రియ వేగవంతం కావాలి.  అప్పటి మానవ విషాదం మధ్య ఆ విధంగా పని చేయడం చాలా ఒత్తిడి తో కూడుకున్నది." అని పేర్కొన్నారు.   ఆ సమయంలో ఒత్తిడిని అధిగమించడానికి, యోగా, దీర్ఘ శ్వాస, సైకిల్ తొక్కడం వంటివి తనకు ఎంతో బాగా సహాయ పడ్డాయని, ఆయన చెప్పారు. 

ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టించడానికి మానసిక ఆరోగ్యాన్ని ఒక ముఖ్యమైన అంశంగా పరిష్కరించడం చాలా అవసరమని, కేంద్ర మంత్రి అంగీకరించారు.  విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి తల్లిదండ్రులు, కుటుంబంతో పాటు ఉపాధ్యాయులు కూడా చాలా ముఖ్యమైన భాగస్వాములని, ఆయన పేర్కొన్నారు.  కుటుంబం, ఉపాధ్యాయులు పరస్పర విశ్వాసం, గౌరవాలతో, పిల్లలతో బహిరంగంగా సంప్రదింపులు జరపాలని కూడా, ఆయన సూచించారు.

ఈ సమస్యను విస్తృత స్థాయిలో పరిష్కరించడానికి ప్రభుత్వ నిబద్ధత గురించి, శ్రీ మాండవీయ, మాట్లాడుతూ,  కౌమారదశలో ఉన్న వారి జీవితంలో ప్రధాన పరీక్షలకు హాజరయ్యే వారి కోసం ప్రధానమంత్రి నిర్వహిస్తున్న 'పరీక్షా-పే-చర్చ' కార్యక్రమం గురించి గుర్తు చేశారు.  "పరీక్షల ఒత్తిడి నుండి విద్యార్థులు ఉపశమనం పొందడానికి ప్రధానమంత్రి వ్యక్తిగతంగా కృషి చేస్తున్నారు.  ఫలితాలు మరియు భవిష్యత్తు గురించి చింతించకుండా నైతికంగా ఉత్తమ జీవితాన్ని గడపాలని, ప్రధానమంత్రి, 'మన్-కీ-బాత్' వంటి కార్యక్రమాల ద్వారా పాఠశాలకు వెళ్లే పిల్లలకు క్రమం తప్పకుండా సలహా ఇస్తున్నారు.  పరీక్షలతో పాటు ఇతర సమస్యల కారణంగా ఒత్తిడికి గురయ్యే పిల్లలపై ఇటువంటి చిన్న చిన్న చర్యలు చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి." అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

మానసిక ఆరోగ్యం మరియు శారీరక ఆరోగ్యం ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ అభివర్ణించారు.  మానసిక ఆరోగ్య అంశాలతో సంబంధం ఉన్న సామాజిక లోపాల ప్రాబల్యం గురించి ఆయన నొక్కి చెప్పారు. అనేక ప్రముఖ పాఠశాలల్లో సైతం విద్యార్థులకు పూర్తి స్థాయిలో సలహాలు చెప్పే కౌన్సిలర్లు లేకపోవడాన్ని కూడా ఆయన ఎత్తి చూపారు.

యునిసెఫ్ భారత ప్రతినిధి డా. యాస్మిన్ అలీ హక్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, నివేదికలోని కొన్ని కీలక అంశాలను వివరించారు.  భారతదేశంలో 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో 14 శాతం మంది లేదా ప్రతి ఏడుగురిలో ఒకరు తరచుగా నిరాశకు గురవుతున్నారని, లేదా పనులు చేయడంలో చాలా తక్కువ ఆసక్తి చూపుతున్నట్లు, ఈ  "ప్రపంచ పిల్లల స్థితి-2021" నివేదికలో పేర్కొన్నట్లు, ఆమె తెలిపారు.  "పిల్లలు భావోద్వేగ విషాదాన్ని అనుభవించడం తో పాటు, చాలా మంది పిల్లలు నిర్లక్ష్యం, నిందలకు గురయ్యే ప్రమాదం ఉంది", అని, ఆమె చెప్పారు. 

ఈ కార్యక్రమంలో,  సంయుక్త కార్యదర్శి-పాలసీ (ఆరోగ్యం), శ్రీ విశాల్ చౌహాన్; జాతీయ మానసిక ఆరోగ్యం, నాడీ శాస్త్ర సంస్థ (ఎన్.ఐ.ఎం.హెచ్.ఏ.ఎన్.ఎస్), డైరెక్టర్, డాక్టర్ ప్రతిమ మూర్తి తో పాటు, మంత్రిత్వ శాఖ, యూనిసెఫ్ లకు చెందిన ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. 

*****



(Release ID: 1761276) Visitor Counter : 203