ప్రధాన మంత్రి కార్యాలయం
సోమనాథ్ లో బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
భారత ప్రాచీన వైభవ పునరుద్ధరణలో అసాధారణమైన సంకల్పాన్ని ప్రదర్శించిన సర్దార్ పటేల్ కు శిరస్సు వంచి వందనం
విశ్వనాథ్ నుంచి సోమనాథ్ వరకు పలు దేవాలయాలను పునర్నిర్మించిన లోక్ మాత అహల్యాబాయ్ హోల్కర్ ను గుర్తు చేసుకున్న ప్రధానమంత్రి
మత పర్యాటకంలో కొత్త అవకాశాలు అన్వేషించాలని; స్థానిక ఆర్థిక వ్యవస్థకు, తీర్థయాత్రలకు మధ్య అనుసంధానాన్ని పటిష్ఠం చేయాలంటూ అన్నికాలాల్లోనూ వచ్చే డిమాండు : ప్రధానమంత్రి
విచ్ఛిన్నకర శక్తులు, భయోత్పాతం ద్వారా సామ్రాజ్యాలు నిర్మించాలనే ఆకాంక్షలది తాత్కాలికంగా పై చేయి కావచ్చు, కాని వాటి మనుగడ శాశ్వతం కాదు. అవి దీర్ఘకాలం పాటు మానవత్వాన్ని అణచివేయలేవు. కొందరు సోమనాథ్ పై దాడి చేయడం ఎంత నిజమో ప్రపంచం ఇలాంటి సిద్ధాంతాల విషయంలో ఆందోళన ప్రకటించడం కూడా అంతే నిజం : ప్రధానమంత్రి
సంక్లిష్టమైన సమస్యలకు సామరస్యపూర్వకమైన పరిష్కారాల దిశగా దేశం అడుగేస్తోంది. రామ్ మందిర్ రూపంలో ఆధునిక భారత వైభవ చిహ్నం త్వరలో రాబోతోంది : ప్రధానమంత్రి
మా వరకు చరిత్ర సారం, విశ్వాసం "సబ్ కా సాత్
Posted On:
20 AUG 2021 1:26PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గుజరాత్ లోని సోమనాథ్ లో పలు ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. సోమనాథ్ విహారయాత్రా కేంద్రం, సోమనాథ్ ఎగ్జిబిషన్ సెంటర్, పాత (జునా) సోమనాథ్ లో పునర్నిర్మించిన దేవాలయం ఆ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. దీనికి తోడు ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ పార్వతి దేవాలయానికి శంకుస్థాపన చేశారు. శ్రీ లాల్ కృష్ణ అద్వానీ, కేంద్ర హోం మంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రపంచంలోని భక్తులందరికీ అభినందనలు తెలియచేస్తూ భారతదేశ ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించేందుకు అసాధారణమైన సంకల్పాన్ని ప్రకటించిన సర్దార్ పటేల్ కు ప్రధానమంత్రి నివాళి అర్పించారు. సర్దార్ పటేల్ సోమనాథ్ మందిరాన్ని స్వతంత్ర భారత స్వతంత్రతా స్ఫూర్తితో అనుసంధానం చేశారు. "75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా సర్దార్ సాహెబ్ కృషిని ముందుకు నడిపించడం మన అదృష్టం" అని శ్రీ మోదీ అన్నారు. అలాగే విశ్వనాథ్ నుంచి సోమనాథ్ వరకు పలు దేవాలయాలను పునర్నిర్మించిన లోక్ మాత అహల్యా బాయ్ హోల్కర్ ను కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆధునికత, సాంప్రదాయం మేళవింపు ద్వారా లభించిన స్ఫూర్తితో దేశం ముందడుగేస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు.
ఐక్యతా విగ్రహం, కచ్ పరివర్తన వంటి చొరవల ద్వారా ఆధునికత, పర్యాటకం జోడింపు ఫలితాన్ని గుజరాత్ సన్నిహితంగా వీక్షించిందని ప్రధానమంత్రి అన్నారు. "మనం మత పర్యాటకంలో కొత్త అవకాశాలు అన్వేషించాలని; తీర్థయాత్రా స్థలాలకు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు అనుసంధానత పెంచాలన్న దీర్ఘకాలిక డిమాండు మనం చూస్తున్నాం" అని ప్రధానమంత్రి అన్నారు.
వినాశం, విధ్వంసం నడుమ అభివృద్ధి, సృజనాత్మకతకు పరమశివుడు మార్గం చూపిస్తాడు. శివస్వరూపం అనంతం, వర్ణింపనలవి కాదు, శాశ్వత శక్తి. "శివునిపై విశ్వాసం మనకు కాలాతీతమైన మనుగడను గుర్తు చేస్తుంది. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనగల బలం ఇస్తుంది" అని ప్రధానమంత్రి చెప్పారు.
ఆరాధనీయమైన ఆ దేవాలయం చరిత్రను ప్రతిబింబింబిస్తూ పలుమార్లు విధ్వంసానికి గురయిందని, ప్రతీ దాడిలోనూ పునరుద్ధరణ జరిగిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. "అసత్యంతో నిజాన్ని ఓడించలేరని, భయోత్పాతంతో విశ్వాసాన్ని అణగదొక్కలేరనే నమ్మకానికి అది గుర్తు". "విధ్వంసకర శక్తులు భయోత్పాతంతో సృష్టించే సామ్రాజ్యం తాత్కాలికంగా మనుగడ సాగించవచ్చు గాని, దీర్ఘకాలం పాటు మానవతను అణచివేయలేవు. సోమనాథ్ పై విధ్వంసక శక్తులు దాడులు జరిపిన ప్రతీ సందర్భంలోనూ ఇదే నిజమయింది. ప్రపంచం యావత్తు ఇలాంటి సిద్ధాంతాల విషయంలో భయం ప్రకటించడం ద్వారా నేటికీ ఆ వాస్తవానికి అంతే ప్రాధాన్యత ఉంది అని నిరూపిస్తోంది" అని ప్రధానమంత్రి అన్నారు.
సోమనాథ దేవాలయ అద్భుత పునర్నిర్మాణం శతాబ్దాల అత్యంత బలమైన సంకల్పం, సైద్ధాంతిక కొనసాగింపునకు నిదర్శనమని ప్రధానమంత్రి అన్నారు. "రాజేంద్రప్రసాద్ జీ, సర్దార్ పటేల్, కెఎం మున్షీ వంటి ఎందరో మహాత్ములు స్వాతంత్ర్య సాధన తర్వాత కూడా ఈ ప్రచారోద్యమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు.1950లో ఆధునిక భారత పవిత్ర స్తంభంగా చివరికి సోమనాథ్ మందిరం నిర్మాణం జరిగింది. ఈ రోజు దేశం అత్యంత సంక్లిష్టమైన సమస్యలకు సామరస్యపూర్వక పరిష్కారాలు సాధించే దిశగా కదులుతోంది. ఆధునిక భారత ఉజ్వల మూలస్తంభంగా రామమందిరం త్వరలో ఆవిర్భవించబోతోంది" అని చెప్పారు.
చరిత్ర నుంచి నేర్చుకుని వర్తమానాన్ని మెరుగుపరుచుకుంటూ కొత్త భవిష్యత్తును సృష్టించుకోవడమే మన ఆలోచన కావాలని ఆయన అన్నారు. తన "భారత్ జోడో" ఆందోళన్ మంత్రం భౌగోళిక అనుసంధానతే కాదు, ఆలోచనల అనుసంధానత కూడా అని శ్రీ మోదీ చెప్పారు. "చరిత్ర పునాదులపై ఆధునిక భారత అనుసంధానత మా వాగ్దానం" అని ప్రధానమంత్రి తెలిపారు."మా వరకు సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ మన చరిత్ర సారం, నమ్మకం" అని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశ ఐక్యత గురించి ప్రస్తావిస్తూ దాని అంతర్నిహిత శక్తి విశ్వాసం, నమ్మకమేనని ప్రధానమంత్రి చెప్పారు. "పడమరలోని సోమనాథ్, నాగేశ్వర్ నుంచి తూర్పున వైద్యనాథ్ వరకు; ఉత్తరాన బాబా కేదార్ నాథ్ నుంచి దక్షిణ భారతంలోని శ్రీ రామేశ్వర్ వరకు 12 జ్యోతిర్లింగాలు యావత్ భారతాన్ని అనుసంధానం చేస్తాయి. అలాగే నాలుగు ధామాల ఏర్పాటు, శక్తిపీఠాల కాన్సెప్ట్, దేశంలోని విభిన్న ప్రాంతాల్లో విభిన్న తీర్థయాత్రా స్థలాల ఏర్పాటు ఇవన్నీ "ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్" పై మన విశ్వాసానికి దర్పణం" అని ప్రధానమంత్రి అన్నారు.
జాతి ఐక్యతను కాపాడడంలో ఆధ్యాత్మికత పాత్ర గురించి ప్రస్తావిస్తూ జాతీయ, అంతర్జాతీయ పర్యాటకం, ఆధ్యాత్మిక పర్యాటకం గురించి మరింత లోతుగా మాట్లాడారు. ఆధునిక మౌలిక వసతుల నిర్మాణం ద్వారా చారిత్రక వైభవాన్ని దేశం పునరుద్ధరిస్తున్నదని ఆయన చెప్పారు. ఇందుకు రామాయణ సర్క్యూట్ ను ఉదాహరణగా చూపుతూ అది రామభక్తులకు రామునికి సంబంధం ఉన్న కొత్త ప్రదేశాలను చూపుతూ రాముడు యావత్ భారత రాముడు అని బోధిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. అదే విధంగా బుద్ధ సర్క్యూట్ ప్రపంచవ్యాప్త భక్తులకు వసతులు కల్పిస్తున్నదని తెలిపారు. స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద 15 ఆలోచనలతో టూరిస్ట్ సర్క్యూట్ లను అభివృద్ధి చేస్తున్నామని, నిర్లక్ష్యానికి గురైన పర్యాటక ప్రాంతాల్లో అవకాశాలు కల్పిస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారు. కొండ ప్రాంతాల్లోని కేదార్ నాథ్ అభివృద్ధి, నాలుగు ధామాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణం, వైష్ణోదేవి అభివృద్ధి పనులు, ఈశాన్యంలో ఆధునిక మౌలిక వసతుల నిర్మాణం వంటివన్నీ దూరాలకు వారధులుగా నిలుస్తాయని చెప్పారు. అలాగే 2014లో ప్రకటించిన ప్రసాద్ స్కీమ్ కింద 40 ప్రధాన తీర్థయాత్రా స్థలాల అభివృద్ధి జరుగుతోందని, వాటిలో 15ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. గుజరాత్ లో రూ.100 కోట్లతో మూడు ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. పర్యాటకం ద్వారా సగటు పౌరుల అనుసంధానతతో పాటు దేశం పురోగమిస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. ప్రయాణ, పర్యాటక పోటీ సామర్థ్య సూచిలో 2013లో భారత్ 65వ స్థానంలో ఉండగా 2019లో 34వ స్థానానికి ఎదిగిందని తెలిపారు.
ప్రసాద్ (యాత్రా స్థలాల పునరుద్ధరణ; ఆధ్యాత్మిక, చారిత్రక స్థలాల అభివృద్ధి) పథకం కింద రూ.47 కోట్లతో సోమనాథ్ పర్యాటక కేంద్రం అభివృద్ధి జరిగింది. "పర్యాటక సహాయ కేంద్రం"లో ఏర్పాటైన సోమనాథ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ధ్వంసమైన సోమనాథ దేవాలయ భాగాలు, శిల్పాలను ప్రదర్శిస్తారు.
రూ.3.5 కోట్ల పెట్టుబడితో శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ప్రాచీన (జునా) సోమనాథ్ ఆలయ ప్రాంగణ పునర్నిర్మాణం పూర్తయింది. పురాతన దేవాలయ శిథిలాలను కనుగొన్న ఇండోర్ రాణి అహల్యాబాయి నిర్మించిన కారణంగా దీన్ని అహల్యాబాయి దేవాలయంగా కూడా పిలుస్తారు. తీర్థయాత్రికుల భద్రత, విస్తరించిన సందర్శకుల సామర్థ్యంతో పాత దేవాలయ ప్రాంగణం అంతటినీ సంపూర్ణంగా అభివృద్ధి చేశారు.
రూ.30 కోట్ల పెట్టుబడితో శ్రీ పార్వతిదేవాలయ పునర్నిర్మాణాన్ని కూడా ప్రతిపాదించారు. సోమపురా సలాట్స్ శైలిలో దేవాలయ నిర్మాణం, గర్భాలయం, నిత్య మండపం అభివృద్ధి అన్నీ అందులో ఉన్నాయి.
***
(Release ID: 1748020)
Visitor Counter : 229
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam