మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

హింసాకాండలో దెబ్బతిన్న మహిళలకోసం హెల్ప్.లైన్!


కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా ఆవిష్కరణ

బాధిత మహిళలకు అండగా ప్రభుత్వం, మహిళా కమిషన్..
అదే ఈ 24గంటల హెల్ప్.లైన్ సందేశం: ఇరానీ

Posted On: 27 JUL 2021 3:29PM by PIB Hyderabad

  మహిళల రక్షణ, భద్రత లక్ష్యంగా ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబరు (7827170170)ను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించారు. నిర్విరామంగా 24గంటలూ పనిచేసే ఈ హెల్ప్ లైన్.ను జాతీయ మహిళా కమిషన్ (ఎన్.సి.డబ్ల్యు) ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా మహిళల రక్షణను, భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో, మహిళాభ్యున్నతికి సంపూర్ణంగా కృషిచేయాలన్న కేంద్ర ప్రభుత్వ ధ్యేయానికి అనుగుణంగా హెల్ప్.లైన్ రూపొందింది. అలర్లు, హింసాకాండలో దెబ్బతిన్న బాధిత మహిళలకు ఆన్.లైన్ ద్వారా సహాయం అందించేందుకు, వారికి అండగా నిలిచేందుకు ఈ హెల్ప్.లైన్ ఏర్పాటైంది. పోలీసు యంత్రాంగం, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ, మనస్తత్వ సేవలు తదితర సదుపాయాలతో ఈ నంబరును అనుసంధానం చేయడం ద్వారా బాధిత మహిళలకు భద్రత కల్పించనున్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0018AKW.jpg

  హెల్ప్.లైన్.ను ప్రారంభించిన సందర్భంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ, ఈ విషయంలో జాతీయ మహిళా కమిషన్ తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. కొత్త హెల్ప్.లైన్ పై ఆమె ప్రశంసలు కురిపించారు. మహిళలకు ఏదైనా అవసరం తలెత్తినపుడు తమ ప్రభుత్వం, తమ కమిషన్ అండగా నిలుస్తుందన్న సందేశాన్ని ఈ డిజిటల్ హెల్ప్ లైన్ అందిస్తోందని అన్నారు. మహిళలకు సహాయం అందించేందుకు హెల్ప్.లైన్ ఏర్పాటు చేయడంలో జాతీయ మహిళా కమిషన్ బృందం చేసిన కృషి “అద్భుతమ”ని, ప్రత్యేకించి వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సంక్షోభ సమయంలో ఇలాంటి కృషి జరగడం అభినందనీయమని కేంద్రమంత్రి

అన్నారు. బాధల్లో ఉన్న మహిళల కడగండ్లు తీర్చే కృషిలో జాతీయ మహిళా కమిషన్, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ భాగస్వామ్యం నిరాటంకంగా ఎప్పటికీ కొనసాగగలదని ఆమె అన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002CB2T.jpg

  ఆవిష్కరణ కార్యక్రమంలో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ మాట్లాడుతూ, ఈ హెల్ప్.లైన్ ఏర్పాటుతో జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలోని ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మరింత బలోపేతమైందని, అవసరాల్లోని బాధిత మహిళలకు సకాలంలో అండగా నిలిచేందుకు, కౌన్సెలింగ్ సేవలందించేందుకు హెల్ప్.లైన్ ఎంతో దోహదపడుతుందని అన్నారు. “మహిళల అభ్యున్నతికోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాకు ఎల్లపుడూ స్ఫూర్తిదాయకమే. మహిళా సాధికారతనుంచి, మహిళల సారథ్యంలోని సాధికారత వరకూ, సమర్థవంతమైన ప్రధాని నాయకత్వంలో అనేక మార్పులను మేం చూడగలుగుతున్నాం, మరింత మెరుగ్గా పనిచేసేందుకు ఆయన నాయకత్వమే మాకు స్ఫూర్తిగా నిలుస్తోంది.“ అని రేఖా శర్మ అన్నారు.  

  పోలీసులు, ఆసుపత్రులు, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థలు, మనస్తత్వ సేవలు తదితర  వ్యవస్థలతో, అధికార యంత్రాగాలతో అనుసంధానం ఏర్పరుస్తూ, ఇబ్బందుల్లో ఉన్న బాధిత మహిళలకు తగిన సహాయం, కౌన్సెలింగ్ సేవలందించడమే లక్ష్యంగా ఈ హెల్ప్.లైన్.ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలపై సమాచారం అందించడం కూడా ఈ హెల్ప్.లైన్ లక్ష్యం. నిపుణుల బృందంతో ఈ హెల్ప్.లైన్ పనిచేస్తుంది. 18 సవంత్సరాలు, అంతకు మించిన వయస్సున్న మహిళలు నేరుగా ఈ హెల్ప్.లైన్ నంబరుకు ఫోన్ చేసి తమకు కావలసిన సహాయం కోరవచ్చు. న్యూఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ ఆవరణనుంచి ఈ హెల్ప్.లైన్ 24గంటలూ పనిచేస్తుంది.

  దేశవ్యాప్తంగా ఉన్న హింసాకాండతో దెబ్బతిన్న తిన్న మహిళల ఫిర్యాదులను, హక్కులకు నోచుకోని మహిళల సమస్యలను జాతీయ మహిళా కమిషన్ తన చట్టబద్ధమైన అధికారాలతో పరిశీలిస్తూ, పరిష్కరిస్తూ వస్తోంది. ఈ ఫిర్యాదులు లిఖిత పూర్వకంగా, లేదా ఆన్ లైన్ (www.ncw.nic.in) ద్వారా కమిషన్ దృష్టికి వస్తాయి. తమకు అందిన ఫిర్యాదులను కమిషన్ సముచితంగా పరిష్కరించి, బాధిత మహిళలకు తగిన ఉపశమనం కలిగిస్తుంది. ఫిర్యాదుల పరిష్కార వేదికను మరింత విస్తరింపజేసి, బలోపేతం చేసే లక్ష్యంతోనే కమిషన్ కొత్తగా ఈ డిజిటల్ హెల్ప్.లైన్ ను రూపొందించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ సహకారంతో ఈ హెల్ప్.లైన్ సేవలకు రూపకల్పన చేశారు.

   మహిళల రక్షణ, భద్రతకే జాతీయ మహిళా కమిషన్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. హింసాకాండతో బాధితులైన మహిళలకు అవసరమైన పోలీసు సేవలు, మనస్తత్వ సామాజిక కౌన్సెలింగ్ సేవలు వంటివాటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న ఉద్దేశంతో కొత్త హెల్ప్.లైన్ ఏర్పాటు కోసం జాతీయ మహిళా కమిషన్ చొరవ చూపింది.

  కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ హెల్ప్.లైన్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి ఇందీవర్ పాండే, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ పాల్గొన్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యులు, డిజిటల్ ఇండియా కార్పొరేషన్ పరిశోధనా విభాగం సీనియర్ డైరెక్టర్ వినయ్ ఠాకూర్ సమక్షంలో కార్యక్రమం జరిగింది. 

 

****



(Release ID: 1739536) Visitor Counter : 255