యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

టోక్యో ఒలింపిక్స్‌ కోసం బయల్దేరే భారత క్రీడాకారుల తొలి బృందానికి దిల్లీలో వీడ్కోలు పలకనున్న కేంద్ర క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌, సహాయ మంత్రి శ్రీ నిశిత్‌ ప్రమాణిక్‌

Posted On: 17 JUL 2021 3:15PM by PIB Hyderabad

మరో వారం రోజుల్లో టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్నాయి. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు బయల్దేరే భారత క్రీడాకారుల తొలి బృందానికి దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారికంగా వీడ్కోలు పలకనున్నారు. తొలి బృందంలో 88 మంది ఉన్నారు. వీరిలో 54 మంది క్రీడాకారులు కాగా, మిగిలినవారు సహాయక సిబ్బంది, భారత ఒలింపిక్‌ సంఘం ప్రతినిధులు. కేంద్ర క్రీడలు, యుజవజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌, సహాయ మంత్రి శ్రీ నిశిత్‌ ప్రమాణిక్‌ ఈ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొంటారు. భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు శ్రీ నరీందర్‌ ధ్రువ్‌ బత్రా, సెక్రటరీ జనరల్‌ శ్రీ రాజీవ్‌ మెహతా, భారత క్రీడల ప్రాధికార సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ శ్రీ సందీప్‌ ప్రధాన్‌ కూడా వీడ్కోలు కార్యక్రమంలో భాగస్వాములవుతారు.

    విలువిద్య, హాకీ, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, జుడో, జిమ్నాస్టిక్స్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఈ క్రీడాకారులు పాల్గొంటారు. ఈ బృందం మొత్తంలో హాకీ క్రీడాకారుల సంఖ్య ఎక్కువ.

    క్రీడాకారుల భద్రత దృష్ట్యా, ఒలింపిక్స్‌ కోసం వెళ్లే అధికారులందరికీ ఇప్పటికే కొవిడ్‌ పరీక్షలు చేశారు. నెగెటివ్‌ వచ్చినవారు మాత్రమే ఒలింపిక్స్‌కు వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో, విమానంలో సామాజిక దూరం పాటిస్తారు.

    టోక్యో ఒలింపిక్స్‌కు రికార్డు స్థాయిలో 127 మంది భారత క్రీడాకారులు అర్హత సాధించారు. గత రియో ఒలింపిక్స్‌లో ఈ సంఖ్య 117గా ఉంది.
 

*******


(Release ID: 1736523) Visitor Counter : 153