ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

‘డిజిటల్‌ ఇండియా’కు ఆరేళ్లు నిండిన నేపథ్యంలో వివిధ పథకాల లబ్ధిదారులతో సంభాషించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

Posted On: 30 JUN 2021 12:44PM by PIB Hyderabad

భారతదేశాన్ని డిజిటల్‌ సాధికారతగల సమాజంగా, విజ్ఞాన ఆర్థికవ్యవస్థగా పరివర్తనాత్మక మార్గంలో నడిపే దార్శనికతతో కూడిన కీలక కృషిలో భాగంగా ‘డిజిటల్‌ ఇండియా’కు శ్రీకారం చుట్టి 2021 జూలై 1నాటికి ఆరేళ్లు పూర్తవుతున్నాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని 2015 జూలై 1న ప్రారంభించారు. అటుపైన నవభారత విజయగాథల్లో ఇదొక కీలక ఘట్టంగా ఆవిర్భవించింది. ఆ మేరకు అన్ని సేవలకూ మార్గం సుగమం కావడంతోపాటు ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయడం, పౌరులతో నిరంతర సంబంధాలు, ప్రజలకు సాధికారత వంటి లక్ష్యాల సాధన దిశగా ముందంజకు దోహదపడింది.

   ప్రధానమంత్రికి ప్రీతిపాత్రమైన పథకాల్లో ఒకటిగా ఇది ఆరేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్‌-సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ (మీటీ) ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇందులో ప్రసంగించడంతోపాటు ‘డిజిటల్‌ ఇండియా’ భాగంగా అమలవుతున్న వివిధ పథకాల లబ్ధిదారులతోనూ సంభాషించనున్నారు. జూలై 1న నిర్వహించే ఈ కార్యక్రమం కేంద్ర ఎలక్ట్రానిక్స్‌-సమాచార సాంకేతిక; చట్టం-న్యాయం-సమాచార శాఖల మంత్రి శ్రీ రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రారంభోపన్యాసంతో మొదలవుతుంది. అనంతరం ‘డిజిటల్‌ ఇండియా’ సాధించిన ప్రధాన విజయాలను వీడియో రూపంలో ప్రదర్శిస్తారు. అటుపైన డిజిటల్‌ ఇండియా కింద వివిధ పథకాలద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులతో ప్రధానమంత్రి మాటామంతీలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్‌-సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అజయ్‌ సాహ్నీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తారు.

   ఈ వేడుక ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో- “దేశవ్యాప్తంగా డిజిటల్‌ ఇండియా కింద ప్రయోజనం పొందిన లబ్ధిదారులతో ప్రధానమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమం ఎంతో సౌహార్ద సంభాషణగా, సమాచారాత్మకంగా సాగుతుంది. ప్రధానమంత్రి నుంచి మాకు అపూర్వ మార్గదర్శకత్వం, మద్దతు లభించడం మేమెంతో గర్వించాల్సిన సందర్భం. ఆయన క్రియాశీల నాయకత్వాన ‘డిజిటల్‌ ఇండియా’ కార్యక్రమాలను ముందుతీసుకెళ్లేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అని డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌కు ఎండీ-సీఈవోగానూ, మంత్రిత్వశాఖలోని ‘ఎన్‌ఈజీడీ’ అధ్యక్షుడు-సీఈవోగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అభిషేక్‌ సింగ్‌ అన్నారు. లబ్ధిదారులతో మాటామంతీ పూర్తయ్యాక ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. డిజిటల్‌ ఇండియా కింద సాధించిన వివిధ విజయాలను, కొన్నేళ్లుగా ప్రజలను సంధానించడంలో చేరుకున్న మైలురాళ్లను గురించి ఆయన ఈ సందర్భంగా వివరిస్తారు. ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలోగల వివిధ పరిణామాలను, చేయాల్సిన కృషిని ఆయన రేఖామాత్రంగా వివరిస్తారు.

   ఈ వేడుకల్లో భాగంగా అన్ని ప్రసంగాలు, లబ్ధిదారులతో మాటామంతీ వాస్తవిక సాదృశ మాధ్యమంలో https://pmindiawebcast.nic.in ద్వారా నిర్వహించబడతాయి. ఆ మేరకు 2021 జూలై 1న ఉదయం 11:00 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానున్న ఈ అద్భుత కార్యక్రమానికి పౌరులందరూ ఆహ్వానితులే. అంతేకాకుండా సామాజిక మాధ్యమ వేదికలైన  ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలోని ‘డిజిటల్‌ ఇండియా’ హ్యాండిళ్లద్వారా కూడా ఈ ప్రత్యక్ష ప్రసారం లభ్యమవుతుంది.


(Release ID: 1731467) Visitor Counter : 248