హోం మంత్రిత్వ శాఖ
దేశంలో వరద పరిస్థితులపై సంసిద్ధతను సమీక్షించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భారత వాతావరణ విభాగం, జల్శక్తి మంత్రిత్వశాఖ, కేంద్ర జల కమిషన్, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం మధ్య కొత్త సమన్వయ వ్యవస్థ కోసం ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సంభవించే వరదల సమస్యను పరిష్కరించడానికి దీర్ఘకాలిక సమగ్ర విధానాన్ని రూపొందించడంపై ఈ సమావేశంలో అమిత్ షా సమీక్షించారు.
దేశంలోని ప్రధాన పరీవాహక ప్రాంతాల్లో వరద పరిస్థితిని, నీటిమట్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర రాష్ట్ర సంస్థల మధ్య మెరుగైన శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను కేంద్ర హోంమంత్రి ఆదేశించారు.
పెద్ద ఆనకట్టల నుండి మట్టిని తొలగించడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు అమిత్ షా సూచించారు. దీనివల్ల జలాశయాల సామర్థ్యం పెరుగుతుందని, వరదలను నియంత్రించడానికి సహాయపడుతుందన్నారు.
మరింత ఖచ్చితమైన వాతావరణ సమాచారం, వరదల అంచనా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉపగ్రహ డేటాను ఉపయోగించాలని భారత వాతావరణ విభాగం, కేంద్ర జల కమిషన్ వంటి ప్రత్యేక సంస్థలకు సూచించారు.
భారత వాతావరణ విభాగం జారీ చేసే పిడుగుపాటు వంటి హెచ్చరికలను వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడానికి వెంటనే ఓ ఎస్ఓపీని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి సూచించారు.
ఉమంగ్, రెయిన్ అలారం, దామిని వంటి మొబైల్ యాప్లకు సాధ్యమైనంత ఎక్కువగా ప్రచారం కల్పించాలని, వా
Posted On:
15 JUN 2021 8:14PM by PIB Hyderabad
దేశంలో వరద పరిస్థితిని ఎదుర్కోవటానికి తీసుకుంటున్న చర్యల సంసిద్ధతను సమీక్షించడానికి కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత వాతావరణ విభాగం, జల్ శక్తి మంత్రిత్వశాఖ, కేంద్ర జల కమిషన్, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం మధ్య కొత్త సమన్వయ వ్యవస్థ కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా దేశంలో వరద సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం కోసం సమగ్రమైన, విస్తృతమైన విధానాన్ని రూపొందించడానికి దీర్ఘకాలిక చర్యలను కూడా కేంద్ర హోంమంత్రి సమీక్షించారు.
దేశంలోని ప్రధాన పరీవాహక ప్రాంతాల్లో వరద పరిస్థితిని, నీటిమట్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర రాష్ట్ర సంస్థల మధ్య మెరుగైన శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను కేంద్ర హోంమంత్రి ఆదేశించారు.
భారీ జలాశయాల్లో పూడికతీతను చేపట్టడానికి ఓ యంత్రాంగాన్ని రూపొందించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు అమిత్ షా సూచించారు. దీనివల్ల జలాశయాల సామర్థ్యం పెరుగుతుందని, వరదలను నియంత్రించడానికి సహాయపడుతుందన్నారు.
మరింత ఖచ్చితమైన వాతావరణ సమాచారం, వరద అంచనాల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉపగ్రహ డేటాను ఉపయోగించాలని భారత వాతావరణ విభాగం, సెంట్రల్ వాటర్ కమిషన్ వంటి ప్రత్యేక సంస్థలకు అమిత్ షా సూచించారు. పిడుగుపాట్లకు సంబంధించి భారత వాతావరణ విభాగం జారీ చేసే హెచ్చరికలను ప్రజలకు వెంటనే చేరవేసేందుకు టీవీ, ఎఫ్‌ఎం రేడియో, ఎస్‌ఎంఎస్ ఇతర మాధ్యమాలను ఉపయోగించుకోవాలని, ఇందుకోసం ఓ ఎస్ఓపీని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి ఆదేశించారు. భారత వాతావరణ విభాగం అభివృద్ధి చే సిన ఉమంగ్, రెయిన్ అలారం, దామిని వంటి మొబైల్ యాప్లకు వీలైనంత ఎక్కువ ప్రచారం కల్పించాలని ఆయన ఆదేశించారు. తద్వార యాప్ల గరిష్ట ప్రయోజనాలు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు చేరతాయన్నారు. దామిని అప్లికేషన్ పిడుగుపాట్ల వంటి హెచ్చరికలను మూడుగంటల ముందుగానే జారీ చేస్తుందని, దీనివల్ల ఆస్తి, ప్రాణనష్టాలు తగ్గించడంలో సహాయపడుతుందన్నారు.
మన నదీ వ్యవస్థలపై పెరుగుతున్న ఒత్తిడిని ఉపగ్రహ అప్లికేషన్ల ద్వారా అధ్యయనం చేయాలని అమిత్ షా సూచించారు. నదులపట్ల మనం ఎంత సెన్సిటివ్గా ఉంటామో.. నదీ ప్రవాహాల గురించి కూడా మనమంతా జాగ్రత్త వహించాలని ఆయన నొక్కి చెప్పారు. నదుల్లో నీటి మట్టం, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, క్రమం తప్పకుండా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నివేదికలు పంపాలని కేంద్ర జల కమిషన్, భారత వాతావరణ విభాగం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలను ఆదేశించారు. వరద ప్రభావిత రాష్ట్రాల్లోని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలల అధిపతులను వెంటనే సమావేశాలు నిర్వహించాలని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ను ఆదేశించారు.
గత ఏడాది జూలై 3 న జరిగిన వరద సమీక్ష సమావేశంలో అమిత్ షా ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర జల కమిషన్ దేశంలోని అన్ని జలాశయాల కోసం 5 రోజుల ముందస్తు ఇన్‌ఫ్లో సూచనను జారీ చేయడం ప్రారంభించింది. నీటిని విడుదల చేయడానికి సకాలంలో, ముందస్తు చర్యలు తీసుకోవటానికి, వరదలను మరింత తగ్గించడానికి, ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి, ఈ విషయాల్లో అధికారులకు తగిన సూచనలు చేయడానికి నిపుణుల బృందాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖతోపాటు కేంద్ర జల కమిషన్ను అమిత్ షా ఆదేశించారు.
గతేడాది జరిగిన వరద సమీక్ష సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి ఇచ్చిన ఆదేశాలపై తీసుకున్న చర్యలకు సంబంధించి భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్, సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దేశంలో వాతావరణ పరిస్థితులు, వరద పరిస్థితుల అంచనా పద్ధతుల మెరుగుదల కోసం తీసుకున్న చొరవ, డ్యామ్ల నిర్వహణ కోసం అమలుచేసిన నూతన పద్ధతులను వివరించారు.
భారతదేశంలో ఓ భారీ ప్రాంతం వరదలకు గురవుతోంది. ఇందులో గంగా మరియు బ్రహ్మపుత్ర ప్రధాన వరద పరీవాహక ప్రాంతాలతోపాటు అసోం, బీహార్, ఉత్తర ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వరదలు సంభవించే ప్రాంతాలున్నాయి.
వరదలు, వాటివల్ల పంటలు, ఆస్తులు, జీవనోపాధి, ప్రాణాలు కోల్పోతున్న లక్షలాది ప్రజల బాధలను తగ్గించేందుకు ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు.. మరిన్ని పరిష్కారాల దిశగా సాగనున్నాయి.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఈ ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్, కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, ఆయా మంత్రిత్వశాఖలు, విభాగాల కార్యదర్శులతోపాటు జలవనరులు, ఎర్త్ సైన్స్ సభ్యకార్యదర్శి, ఎన్డీఎంఏ, ఐఎండీ డైరెక్టర్ జనరల్స్ పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ చైర్మన్, సీడబ్ల్యూసీ, సంబంధిత మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1727404)
Visitor Counter : 226