సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
దివ్యాంగజనుల పునరావాసం కోసం ఆరునెలల సి.బి.ఐ.డి. కోర్సు!
దేశంలోనే తొలిసారిగా ఆవిష్కరణ
Posted On:
19 MAY 2021 3:40PM by PIB Hyderabad
దివ్యాంగుల పునరావాసానికి సంబంధించిన ఆరునెలల కార్యక్రమాన్ని (కొత్త అధ్యయన కోర్సును) సామాజిక న్యాయం, సాధికారత శాఖల కేంద్ర మంత్రి డాక్టర్ తవర్ చంద్ గెహ్లాట్ ఈ రోజు వర్చువల్ పద్ధతిలో లాంఛనంగా ప్రారంభించారు. సామాజిక న్యాయం, సాధికారత శాఖల కేంద్ర సహాయమంత్రి కిషన్ పాల్ గుర్జార్ సమక్షంలో ఈ కోర్సు ప్రారంభమైంది. భారతదేశంలో ఆస్ట్రేలియా హై కమిషనర్ బారీ ఒ ఫార్రెల్, ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్ మన్ ప్రీత్ వోహ్రా, కేంద్ర వికలాంగుల సాధికారతా శాఖ కార్యదర్శి అంజలీ భావ్రా, మెల్.బోర్న్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ డంకన్ మాస్కెల్, కేంద్ర వికలాంగుల సాధికారతా శాఖ సంయుక్త కార్యదర్శి ప్రబోధ్ సేథ్, మెల్.బోర్న్ విశ్వవిద్యాలయ ప్రతినిధి డాక్టర్ నాథన్ గిల్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సమూహం ప్రాతిపదికన రూపొందించిన సమ్మిళిత అభివృద్ధి ప్రాజెక్టు (సి.బి.ఐ.డి.)ను ఇలా కోర్సుగా చేపట్టడం దేశంలో ఇదే తొలిసారిగా పరిగణించవచ్చు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి తవర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ, వికలాంగ వ్యక్తులకు నరేంద్మోదీ ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రాధాన్యం ఇస్తూ వస్తోందని, ఇకపై కూడా వారికి ప్రాధాన్యత ఇలాగే కొనసాగుతుందని అన్నారు. వికలాంగ వ్యక్తుల హక్కులకు సంబంధించి 2016లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని ఆమోదించిందని, వికలాంగ వ్యక్తులు సమాజంలో సమ్మిళిత భాగంగా ఈ చట్టం పరిగణిస్తోందని మంత్రి అన్నారు. వికలాంగ వ్యక్తులు మానవ వనరుల్లో చాలా ముఖ్యమైన భాగమని, తగిన సదుపాయాలు, అవకాశాలు కల్పించిన పక్షంలో వారు ఏ రంగంలోనే ప్రతిభ చూపగలుగుతారని చెప్పారు. విద్య, క్రీడలు, ప్రదర్శన కళలు, లలిత కళలు వంటి ఏ రంగంలో అయినా వారు ప్రతిభాపాటవాలు ప్రదర్శించగలరన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే, మెల్ బోర్న్ విశ్వవిద్యాలయం సహకారంతో ఈ కొత్త కోర్సును రూపొందించినట్టు మంత్రి చెప్పారు. దివ్యాంగ జనులు అభ్యున్నతి, పునరావాసం లక్ష్యంగా శిక్షణ పొందిన మానవ వనరులను అభివృద్ధి చేయడానికి ఈ కోర్సు దోహదపడుతుందన్నారు. దివ్యాంగ జనులు సాధికారత పొందడానికి, సమాజంలో అంతర్భాగంగా వారు సమ్మిళతం కావడానికి ఇది ఉపకరిస్తుందని అన్నారు.
అయితే, కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా, శిక్షణ పొందే దివ్యాంగ జనులకు తొలి దఫాలో కౌన్సెలర్ లేదా గైడ్ లను ఏర్పాటు చేయడం అవసరమని, ఈ కార్యక్రమాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించడం అవసరమని గెహ్లాట్ అభిప్రాయపడ్డారు.
కేంద్ర సహాయమంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ మాట్లాడుతూ, 'అందరికీ అభివృద్ధి, అందరితో కలసి అభివృద్ధి' అన్న పరమార్థాన్ని తెలిపే, 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. మన విధానాల, కార్యక్రమాల సమ్మిళిత స్వభావాన్ని ఈ నినాదం తెలియజేస్తున్నదని అన్నారు. అందువల్లనే, మన విధానాల్లో దివ్యాంగ జనులకు ప్రాధాన్యం కొనసాగుతూ వస్తోందని, సమాజంలో వారికి పూర్తి స్థాయి భాగస్వామ్యం దక్కుతోందని అన్నారు. రిస్కు కేసులను గుర్తించడానికి, దివ్యాంగ జనులకు ప్రభుత్వం అందించే ప్రయోజనాలను తల్లిదండ్రులకు, సంరక్షకులకు తెలియజెప్పేందుకు, సమీపంలోని శిక్షణా కేంద్రాల్లో వారిని చేర్చవలసిన అవసరాన్ని తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. అలాగే, ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన శిక్షణతో కూడిన మానవ వనరులను ఏర్పాటు చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ విషయంలో ఇతర దేశాల అనుభవంలోకి వచ్చిన ఉత్తమ విధానాలను గురించి తెలుసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ సహకారం లక్ష్యంగా ప్రభుత్వం ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడం ఒక ముందడుగు అని గుర్జార్ అన్నారు.
వికలాంగ వ్యక్యుల కేంద్ర శాఖ కార్యదర్శి అంజలీ భావ్రా మాట్లాడుతూ, ఎంతో వినూత్నమైన ఈ కార్యక్రమాన్ని, కోర్సును రూపొందించేందుకు ఆస్ట్రేలియాకు భారతదేశానికి చెందిన నిపుణులు కలసికట్టుగా కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం వికలాంగ వ్యక్తులకు, వారి తల్లిదండ్రులకు మధ్య వారధిగా పనిచేసేందుకు కావలసిన శిక్షితులైన మానవ వనరుల కొరత ఉందని, ఇలాంటి సుక్షితులైన మానవ వనరుల తయారు చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించగలదని అంజలీ భావ్రా అన్నారు. ఈ కార్యక్రమ రూపకల్పనకోసం భారతీయ పునరావాస మండలి, మెల్ బోర్న్ విశ్వవిద్యాలయం గత రెండేళ్లుగా కృషి చేస్తూ వస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమ విస్తృతి ప్రక్రియలో అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రమేయం కల్పించనున్నట్టు చెప్పారు.
కొత్త కోర్సు పాఠ్యాంశాలకు సంబంధించిన ఆరు చిన్న పుస్తకాలను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సమాజం ప్రాతిపదికగా అట్టడుగు స్థాయిలో పునరావాస కార్యకర్తల సమూహాన్ని తయారు చేయడమే లక్ష్యంగా ఈ కోర్సుకు రూపకల్పన చేశారు. ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలతో పాటుగా ఈ కార్యకర్తలు కూడా కలసి పనిచేస్తారు. వైకల్యం సమస్యలను పరిశీలించి, వైకల్యం కలిగిన వ్యక్తులను సమాజంలో అంతర్భాగంగా సమ్మిళితం చేసేందుకు కృషిచేస్తారు. ఈ కార్యకర్తలకు సామర్థ్య ఆధారిత విజ్ఞానం, నైపుణ్యాలను అందించే లక్ష్యంతో కోర్సును తయారు చేశారు. ఈ కార్యకర్తలు తమ విధులను సమర్థంగా నిర్వర్తించేలా తీర్చిదిద్దడమే కోర్సు లక్ష్యం. వీరిని 'దివ్యాంగ మిత్ర'గా అంటే వికంలాగ వ్యక్తులకు స్నేహితులుగా పరిగణిస్తారు.
ఈ కోర్సును తొలుత ప్రయోగాత్మక ప్రాతిపదికన ప్రారంభించాలని భారతీయ పునరావాస మండలి సంకల్పించింది. రెండు బ్యాచులుగా, విగలాంగ వ్యక్తుల సాధికారతా శాఖకు చెందిన 7 జాతీయ స్థాయి సంస్థల్లో ఈ కోర్సు ప్రారంభించనున్నారు. సామాజిక ప్రాతిపదికన పునరావాస కార్యక్రమాల్లో పనిచేసిన అనుభవం కలిగిన 7నుంచి 9 స్వచ్ఛంద సంస్థలకు ఇందులో ప్రమేయం కల్పించనున్నారు. తొట్టతొలుతగా ఈ కోర్సు ఇంగ్లీష్, హిందీ భాషల్లోను, 7 ప్రాంతీయ భాషల్లోను అందుబాటులో ఉంటుంది. గుజరాతీ, మరాఠీ, ఒడియా, బెంగాళీ, తెలుగు, తమిళం, గారో వంటి ప్రాంతీయ భాషల్లో ఈ కోర్సు ముందస్తుగా అందుబాటులో ఉంటుంది. తొలి బ్యాచిలో దాదాపు 600మంది విద్యార్థులకోసం ఈ ఏడాది ఆగస్టులో తరగతులు ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తితో కాస్త ప్రతికూల పరిస్థితులు నెలకొన్నందున ఈ శిక్షణా తరగతులు ఆన్ లైన్, ఆఫ్ లైన్ పద్ధతిలో చేపట్టనున్నారు.
ఈ సి.బి.ఐ.డి కోర్సును భారతీయ పునరావాస మండలి, మెల్ బోర్న్ విశ్వవిద్యాలయం కలసి ఉమ్మడిగా రూపొందించాయి. ఇందుకు సంబంధించి ఆస్ట్రేలియా ప్రభుత్వం, భారత ప్రభుత్వం కలసి 2018 నవంబరు 22నాడే ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంగవైకల్య సమస్య పరిష్కారంలో పరస్పర సహకారం కింద ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కోర్సుకు సంబంధించిన పాఠ్యాంశాలను, విషయ ప్రణాళికను నిపుణుల కమిటీ రూపొందించింది. భారతదేశం, ఆస్ట్రేలియాలకు చెందిన నిపుణులకు ఈ కమిటీలో ప్రాతినిథ్యం కల్పించారు. భారతీయ పునరావాస మండలి ఆధ్వర్యంలో పనిచేసే పునరావాస పరీక్షల జాతీయ బోర్డు ఈ కోర్సు కోసం పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన అభ్యర్థులకు యోగ్యతా పత్రాలను ప్రదానం చేస్తుంది.
****
(Release ID: 1719975)
Visitor Counter : 236