ప్రధాన మంత్రి కార్యాలయం

దేశంలో కోవిడ్.. టీకాల పరిస్థితిపై ప్రధాన మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష


మార్చి ఆరంభంలో రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య వారానికి

50 లక్షలు కాగా... ప్రస్తుతం 1.3 కోట్ల స్థాయికి పెరుగుదల;

ఎక్కడికక్కడ నియంత్రణ వ్యూహాలే నేడు తక్షణావసరం: ప్రధాన మంత్రి;

అధిక పాజిటివ్ కేసులుగల ప్రాంతాల్లో పరీక్షల సంఖ్య పెంపునకు ప్రధాని ఆదేశం;

ఇంటింటా పరీక్ష-నిఘాదిశగా ఆరోగ్య సంరక్షణ వనరుల పెంపునకు ప్రధాని సూచన;

మహమ్మరిపై గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మర పోరు కోసం ‘ఆశా, అంగన్వాడీ’ కార్యకర్తలకు సకల ఉపకరణాలతో సాధికారత కల్పించాలి: ప్రధానమంత్రి;

గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరా-పంపిణీకి భరోసా ఇవ్వడం ముఖ్యం: ప్రధాన మంత్రి
వెంటిలేటర్లు.. ఇతర పరికరాల నిర్వహణలో ఆరోగ్య

కార్యకర్తలకు సముచిత శిక్షణ ఇవ్వాలి: ప్రధాన మంత్రి

Posted On: 15 MAY 2021 2:28PM by PIB Hyderabad

   దేశంలో కోవిడ్.. టీకాల కార్యక్రమానికి సంబంధించిన పరిస్థితులపై ప్రధానమంత్రి ఇవాళ తన  అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశమంతటా ప్రస్తుత కోవిడ్ స్థితిగతుల గురించి అధికారులు ప్రధానికి వివరించారు. ఈ మేరకు మార్చి ఆరంభంలో రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య వారానికి 50 లక్షలు కాగా... ప్రస్తుతం వారానికి 1.3 కోట్ల స్థాయికి పెరిగినట్లు వారు తెలియజేశారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నిర్ధారిత కేసుల సంఖ్య క్రమేణా తగ్గుతుండగా కోలుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని వారు తెలిపారు. దేశంలో రోజువారీ 4 లక్షలకుపైగా కేసులు నమోదైన పరిస్థితిపై సమావేశం చర్చించింది. అయితే, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలుసహా ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల అవిశ్రాంత కృషి ఫలితంగా నేడు రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతరం వివిధ రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో కోవిడ్, రోగ నిర్ధారణ పరీక్షలు, ఆక్సిజన్ లభ్యత, ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులు, టీకాలపై మార్గ ప్రణాళిక తదితరాల గురించి అధికారులు ప్రధానికి సమగ్రంగా నివేదించారు.

   వివిధ రాష్ట్రాల్లో అధిక పాజిటివ్ కేసులు నిష్పత్తి నమోదవుతున్న జిల్లాలకు ప్రత్యేకించి.. స్థానిక నియంత్రణ వ్యూహాలు తక్షణావసరమని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే ఆయా ప్రాంతాల్లో ‘‘ఆర్టీ-పీసీఆర్, ర్యాపిడ్’’.. రెండు విధానాల్లోనూ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని ప్రధాని ఆదేశించారు. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో నియంత్రణ లోపం లేకున్నా అధిక కేసుల ప్రతికూలత ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఒత్తిడికి గురికాకుండా కేసుల సంఖ్యను పారదర్శకంగా నివేదించేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా పరీక్ష-నిఘాపై నిశితంగా దృష్టి సారించడం కోసం ఆరోగ్య సంరక్షణ వనరులను పెంచాలని ప్రధాని కోరారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మహమ్మరిపై పోరు ముమ్మరం చేయడం కోసం ‘ఆశా, అంగన్వాడీ’ కార్యకర్తలకు సకల ఉపకరణాలతో సాధికారత కల్పించడం గురించి ప్రధాని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ‘చికిత్స, ఏకాంత గృహవాసం’పై సోదాహరణ అవగాహన కల్పించాలని, అదే సమయంలో ఈ సరంజామాను ప్రజలకు సులువుగా అర్థమయ్యే భాషలో రూపొందించాలని ప్రధాని ఆదేశించారు.

   గ్రామీణ ప్రాంతాల్లో కాన్‌సెంట్రేట‌ర్లు అందించడంసహా ఆక్సిజన్ సరఫరా సజావుగా సాగేలా తగు పంపిణీ ప్రణాళిక తయారీకి కూడా ప్రధానమంత్రి ఆదేశించారు. ఆయా పరికరాల నిర్వహణపై ఆరోగ్య కార్యకర్తలకు తగిన శిక్షణ ఇవ్వాలని ప్రధాని సూచించారు. దీంతోపాటు సదరు వైద్య పరికరాలు అవరోధాలు లేకుండా పనిచేసేలా విద్యుత్ సరఫరా సజావుగా సాగేలా చూడాలని ప్రధాని స్పష్టం చేశారు.

   దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వెంటిలేటర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయన్న నివేదికలపై  ప్రధానమంత్రి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అందజేసిన ఈ పరికరాల ఏర్పాటు-వినియోగంపై తక్షణం తనిఖీ నిర్వహించాల్సిందిగా ప్రధాని ఆదేశించారు. అంతేకాకుండా అవసరమైతే వెంటిలేటర్ల నిర్వహణలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు శిక్షణ పునశ్చరణ చేపట్టాలని కోరారు.

   కోవిడ్ మహమ్మారిపై భారత్ పోరాటానికి శాస్త్రవేత్తలు, ఆయా రంగాల నిపుణుల మార్గనిర్దేశం చేస్తున్నారని, భవిష్యత్తులోనూ దేశాన్ని నడిపించేది వారేనని  ప్రధాని చెప్పారు. రాష్ట్రాలవారీగా 45 ఏళ్లకు పైబడినవారికి టీకాల ప్రక్రియ గురించి అధికారులు ఈ సందర్భంగా ప్రధానమంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో టీకా మోతాదుల భవిష్యత్ లభ్యత మార్గ ప్రణాళికపైనా సమావేశం చర్చించగా, టీకాల ప్రక్రియ వేగం పెంపుదిశగా రాష్ట్రాలతో సన్నిహితంగా పనిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

 

***


(Release ID: 1718863) Visitor Counter : 252