విద్యుత్తు మంత్రిత్వ శాఖ

దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లకు అంతరాయం లేకుండా 24x 7 విధ్యుత్ సరఫరా అయ్యేలా చూడడానికి చర్యలు తీసుకుంటున్న విద్యుత్ మంత్రిత్వ శాఖ

Posted On: 12 MAY 2021 11:57AM by PIB Hyderabad

దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు ఎటువంటి అంతరాయం లేకుండా 24x7 విద్యుత్ సరఫరా అయ్యేలా చూడడానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ప్రత్యేక చర్యలను అమలుచేస్తోంది.  కరోనా రెండవ దశ తీవ్ర ప్రభావంతో దేశంలో ఆక్సిజన్ వినియోగం పెరిగింది. వైద్య అవసరాలు, ఇళ్లలో వైద్య సౌకర్యాలు పొందుతున్నవారికి అవసరం కావడంతో ఆక్సిజన్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడడానికి విద్యుత్ శాఖ ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాన్ని సిద్ధం చేసి అమలు చేస్తోంది. దేశంలో 73 ప్రధాన ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది. వీటిలో 13 ప్లాంట్లు జాతీయ రాజధాని ప్రాంత (ఎన్‌సిఆర్) ఆక్సిజన్ అవసరాలను తీరుస్తున్నాయి. ఈ ప్లాంట్లకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అయ్యేలా చూడడానికి విద్యుత్ శాఖ ఈ కింది కార్యాచరణ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 

i. రోజువారీ పరిస్థితిని సమీక్షిస్తున్న విద్యుత్ కార్యదర్శి: ప్రతి ప్లాంటుకు సరఫరా అవుతున్న విద్యుత్ పరిస్థితిని విద్యుత్ శాఖ కార్యదర్శి సంబంధిత రాష్ట్రాల ఇంధన కార్యదర్శులు,పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (పోసోకో)సిఎండి తో సమీక్షిస్తున్నారు. 24x7 విద్యుత్ సరఫరాకు సంబంధించిన అన్ని అంశాలను వివరంగా చేస్తూ అంతరాయం లేకుండా విద్యుత్ ను సరఫరా చేయడానికి పోసోకో,  సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సహాయంతో రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు తగిన చర్యలను అమలు చేసేలా చూస్తున్నారు. 

ii. 24 గంటలూ పనిచేస్తున్న కంట్రోల్ రూం: ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అయ్యేలా తగిన చర్యలను తీసు కోవడానికి 24 గంటలూ పనిచేసే ఒక ఆక్సిజన్ ప్లాంట్ కంట్రోల్ రూమ్ (ఒపిసిఆర్) మరియు ఇంటర్నల్ కంట్రోల్ గ్రూప్ (ఐసిజి) ఏర్పాటు అయ్యాయి. ఆర్‌ఇసి లిమిటెడ్‌లో ఏర్పాటైన ఈ రెండు కేంద్రాలు ఆక్సిజన్ ప్లాంటుల నోడల్ అధికారులతో కలసి విద్యుత్ సరఫరా పరిస్థితిని గమనిస్తున్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే తక్షణం స్పందించి సరఫరాను పునరుద్ధరించడానికి కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. పరిస్థితిని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ రాష్ట్రాల విద్యుత్ సంస్థలు పవర్ గ్రిడ్ అధికారులు సమీక్షించి సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. 

iii)అంతరాయం లేకుండా సరఫరా : ఎటువంటి అంతరాయం లేకుండా ప్లాంట్లకు విద్యుత్ సరఫరా అయ్యేలా చూడడానికి రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు జారీ అవుతున్నాయి. ప్లాంట్లకు విద్యుత్ సరఫరా చేస్తున్న లైన్లను సక్రమంగా నిర్వహించాలని, ఆక్సిజన్ ప్లాంట్ ఫీడర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వీటిని సమర్ధంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తూ సూచనలు జారీ అయ్యాయి. దీనిలో భాగంగా బరోటివాలా ప్లాంట్ (హిమాచల్ ప్రదేశ్) మరియు కేరళ మినరల్  మెటల్ ప్లాంట్ (కేరళ) వద్ద రిలేలను సరి చేయాలని, పక్షుల బెడద ఎక్కువగా ఉన్న సాలెక్వి (ఉత్తరాఖండ్) వద్ద ఆక్సిజన్ ప్లాంట్ కోసం 132 కెవి భూగర్భ కేబుల్ వేయాలని సూచించడం జరిగింది. 

iv. సమస్యల పరిష్కారానికి విద్యుత్ సరఫరాపై సాంకేతిక పరిశీలన 

* ప్రతి ఆక్సిజన్ ప్లాంట్ ముఖ్యంగా దేశ రాజధాని ప్రాంతానికి ఆక్సిజన్ సరఫరా చేస్తున్న ప్లాంట్లపై సాంకేతిక పరిశీలన నిర్వహించే భాద్యతను పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ కు అప్పగించడం జరిగింది. దీనిలో భాగంగా విద్యుత్ సరఫరా స్వభావం, విద్యుత్ సరఫరా మూలం (లు), ప్రత్యామ్నాయ ఏర్పాట్ల లభ్యత, రిలే సెట్టింగులు మొదలైనఅంశాలను పరిశీలించడం జరుగుతుంది. పరిశీలన తరువాత  విద్యుత్ సరఫరాను మెరుగుపరచడానికి  అమలుచేయవలసిన దీర్ఘకాలిక చర్యలతో  స్వల్పకాలిక చర్యలపై  నివేదికలను సిద్ధం చేస్తారు. ఇప్పటివరకు కొత్త ఢిల్లీ , ఎన్‌సిఆర్ ప్రాంతానికి ఆక్సిజన్ సరఫరా చేస్తున్న 13 ప్లాంట్ల పరిశీలన పూర్తయ్యింది.

* నివేదికల ఆధారంగా నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేలా చూడడానికి అమలు చేయవలసిన చర్యలపై  హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, హర్యానా, జార్ఖండ్ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యుత్మంత్రిత్వశాఖ లేఖలు రాసింది. ఆక్సిజన్  ప్లాంట్లకు విద్యుత్ సరఫరా చేస్తున్న సబ్ స్టేషన్ల పరిధిలో తగిన నిర్వహణా కార్యక్రమాలను చేపట్టాలని డివిసికి సూచనలు జారీ అయ్యాయి.

* 20 ప్లాంట్లలో సాంకేతిక పరిశీలన పూర్తయ్యింది. దీనికి సంబంధించిన నివేదికలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపుతూ తక్షణ చర్యలను తీసుకోవాలని విద్యుత్ మంత్రిశాఖ ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన ఏడు ప్లాంట్ల పరిశీలన త్వరలో పూర్తవుతుంది. 

రాష్ట్రాల ప్రభుత్వాలు, విద్యుత్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న చర్యల వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయాలు గణనీయంగా తగ్గాయి. దీనితో పాటు తమ ఆవరణలో ఎటువంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా చూడడానికి తగిన చర్యలను అమలు చేయాలని ఉత్పత్తి ప్లాంట్లకు విద్యుత్ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. 

* బహుముఖ వ్యూహాలతో కూడిన కార్యాచరణ కార్యక్రమం అమలు కావడంతో తమ పూర్తి సామర్ధ్యం మేరకు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు పనిచేయగలుగుతున్నాయి. 

 

***



(Release ID: 1717965) Visitor Counter : 211