రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

మ్యుకోర్‌మైకోసిస్‌తో పోరాడేందుకు యాంఫోటెరిసిన్‌-బి లభ్యత పెంపు కోసం చర్యలు తీసుకున్న కేంద్రం

Posted On: 12 MAY 2021 12:10PM by PIB Hyderabad

కొన్ని రాష్ట్రాల్లో యాంఫోటెరిసిన్‌-బి ఔషధానికి హఠాత్తుగా డిమాండ్‌ పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కొవిడ్‌ తర్వాత రోగులకు సోకుతున్న మ్యుకోర్‌మైకోసిస్‌ వ్యాధికి విరుగుడుగా వైద్యులు యాంఫోటెరిసిన్‌-బి మందును సూచిస్తుడడం వల్ల ఈ డిమాండ్‌ ఏర్పడింది. ఈ కారణంగా, యాంఫోటెరిసిన్‌-బి ఉత్పత్తిని పెంచేలా ఉత్పత్తిదారులతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడంతోపాటు, అదనపు దిగుమతుల ద్వారా ఔషధం పంపిణీ మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

    యాంఫోటెరిసిన్‌-బి ప్రస్తుత నిల్వలు, డిమాండ్‌ పరిస్థితిపై ఉత్పత్తిదారులు, దిగుమతిదారులతో కేంద్ర ఔషధ విభాగం మాట్లాడింది. దీనిప్రకారం, ఈ నెల 10వ తేదీ నుంచి ఉన్న సరఫరా ఆధారంగా, 11వ తేదీన రాష్ట్రాలు, యూటీలకు ఈ ఔషధ కేటాయింపులు చేసింది. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ సంస్థల మధ్య ఈ మందులను సమానంగా పంపిణీ చేసేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. రాష్ట్రాలకు అందిన యాంఫోటెరిసిన్‌-బి ఔషధాన్ని ప్రభుత్వ, ప్రైవేటు  ఆసుపత్రులు పొందేందుకు "పాయింట్ ఆఫ్ కాంటాక్ట్"ను ఏర్పాటు చేసి, ప్రచారం చేయాలని కూడా సూచించింది. ఇప్పటికే అందించిన ఔషధాలతోపాటు, కేటాయించినవాటిని న్యాయబద్ధంగా ఉపయోగించుకోవాలని రాష్ట్రాలను కేంద్ర ఔషధ విభాగం అభ్యర్థించింది. ఔషధం పంపిణీ ఏర్పాట్లను  "నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ" పర్యవేక్షిస్తుంది.

    ప్రస్తుతం దేశం తీవ్రమైన మహమ్మారి హస్తాల్లో ఉంది, అది దేశంలోని ఎన్నో ప్రాంతాలను కబళించింది. కొవిడ్‌ ఔషధాల అందుబాటును పెంచడంతోపాటు, వాటిని రాష్ట్రాలు, యూటీలకు సమానంగా, పారదర్శకంగా కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. 

***(Release ID: 1717915) Visitor Counter : 113