రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

రోజుకు 50 మెట్రిక్ ట‌న్నుల మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను కోవిడ్ పేషెంట్ల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌నున్న ఎరువుల క‌ర్మాగారాలు.

Posted On: 28 APR 2021 11:47AM by PIB Hyderabad

ప్ర‌భుత్వ‌, ప్రైవేటు, సహ‌కార రంగ ఎరువుల క‌ర్మాగారాల‌లో ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి అవ‌కాశాల‌ను ప‌రిశీలించేందుకు ఉద్దేశించిన స‌మావేశానికి  కేంద్ర ర‌సాయ‌నాలు, ఎరువుల శాఖ స‌హాయ‌మంత్రి శ్రీ మ‌న్‌సుఖ్ మాండ‌వీయ అధ్య‌క్ష‌త వ‌హించారు.

ప్ర‌స్తుత క‌రోనా మ‌హ‌మ్మారి కాలంలో త‌మ ప్లాంట్ల‌లో వైద్య అవ‌స‌రాల‌కు వినియోగించే ఆక్సిజ‌న్ ఉత్పత్తి సామ‌ర్ధ్యాన్ని పెంచి దానిని ఆస్ప‌త్రుల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌డం ద్వారా  స‌మాజానికి స‌హాయం చేయాల్సిందిగా ఎరువుల క‌ర్మాగారాల‌కు  పిలుపునిచ్చారు. ఎరువుల క‌ర్మాగారాలు మంత్రి సూచ‌న‌ను స్వాగ‌తించాయి.దేశంలో కోవిడ్ మ‌హ‌మ్మారిపై భార‌త ప్ర‌భుత్వం సాగిస్తున్న పోరాటంతో చేతులు క‌లిపేందుకు ఎరువుల క‌ర్మాగారాలు వెంట‌నే ఆస‌క్తి వ్య‌క్తం చేశాయి.

ఈ స‌మావేశం ఫ‌లితం కింది విధంగా ఉంది.

 

ఇఫ్కో సంస్థ గుజ‌రాత్‌లోని క‌లోల్ యూనిట్‌లో గంట‌కు 200 క్యూబిక్ మీట‌ర్ల సామ‌ర్ధ్యంగ‌ల మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేసే ప్లాంటును ఏర్పాటు చేస్తున్న‌ది. దీనితో ఈ సంస్థ మొత్తం ఉత్ప‌త్తి సామ‌ర్ధ్యం రోజుకు 33,000 క్యూబిక్ మీట‌ర్లు అవుతుంది.

జిఎస్ఎఫ్‌సి త‌మ ప్లాంట్ల‌కు స్వ‌ల్ప మార్పులు చేసి లిక్విడ్ ఆక్సిజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డం మొద‌లు పెట్టింది.

జిఎన్ఎఫ్‌సి  ఎయిర్ సెప‌రేష‌న్ యూనిట్ ను ప్రారంభించిన త‌ర్వాత వైద్య అవ‌స‌రాలనిమిత్తం లిక్విడ్ ఆక్సిజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డం ప్రారంభించింది..

 

జిఎస్ఎఫ్‌సి, జిఎన్ఎఫ్‌సి లు ఇప్ప‌టికే త‌మ ఆక్సిజ‌న్ త‌యారీ ఉత్ప‌త్తి సామ‌ర్ధ్యాల‌ను పెంచే ప్ర‌క్రియ‌ను ప్రారంభించాయి.

ఇత‌ర ఎరువుల క‌ర్మాగారాలు దేశంలోని ఎంపిక చేసిన ప్రాంతాలు,ఆస్ప‌త్రుల‌లో సిఎస్  ఆర్ నిధుల‌తో  ఆస్ప‌త్రులు, ప్లాంటుల‌లో మెడిక‌ల్ ప్లాంటుల‌ను ఏర్పాటు చేయ‌నున్నాయి.

మొత్తంమీద రోజుకు  సుమారు 50 మెట్రిక్‌ట‌న్నుల మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను ఎరువుల క‌ర్మాగారాలు కోవిడ్ పేషెంట్ల‌కు 

అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఈ చ‌ర్య‌లు దేశంలో మెడిక‌ల్ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను రానున్న రోజుల‌లో పెంచ‌నున్నాయి.

 

***



(Release ID: 1714731) Visitor Counter : 221