ప్రధాన మంత్రి కార్యాలయం

భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం 95వ వార్షికోత్సవం.. ఉప-కులపతుల జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం


డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌పై రచించిన నాలుగు పుస్తకాల ఆవిష్కరణ;
భారత ప్రజాస్వామ్య వారసత్వ బలోపేతంసహా దేశం ముందడుగుకు

బాబాసాహెబ్‌ బలమైన పునాది వేశారు: ప్రధానమంత్రి;
సమాన అవకాశాలు - హక్కులపై బాబాసాహెబ్‌ దార్శనికతను

ప్రభుత్వ పథకాలు నెరవేరుస్తున్నాయి: ప్రధానమంత్రి;
అన్ని విశ్వవిద్యాలయాలూ బహుళ-కోర్సులతో విద్యార్థులకు

చదువులు సరళం చేయాలన్నది మా ఆకాంక్ష: ప్రధానమంత్రి

Posted On: 14 APR 2021 12:41PM by PIB Hyderabad

భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం (ఏఐయూ) 95వ వార్షికోత్సవం... ఉప-కులపతుల జాతీయ సదస్సుల‌నుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్యమం ద్వారా ప్ర‌సంగించారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ జీవితంపై శ్రీ కిషోర్ మక్వానా రచించిన నాలుగు పుస్తకాలను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో గుజరాత్‌ గవర్నర్, ముఖ్యమంత్రితోపాటు కేంద్ర-రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమాలను నిర్వహించింది. ‘భారతరత్న’ బాబాసాహెబ్‌ డాక్టర్ అంబేడ్కర్‌కు దేశం తరఫున, ప్రజల తరఫున ప్రధానమంత్రి ఘనంగా నివాళి అర్పించారు. భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను దేశవ్యాప్తంగా   నిర్వహిస్తున్న ప్రస్తుత సమయంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు కూడా చేసుకోవడం మనకు కొత్త శక్తినిస్తుందని ఆయన అన్నారు.

   ప్రపంచవ్యాప్త ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లివంటిదని, మన జీవన విధానం, నాగరికతలో ప్రజాస్వామ్యం ఒక సమగ్ర భాగమని శ్రీ మోదీ నొక్కిచెప్పారు. భారత ప్రజాస్వామ్య వారసత్వాన్ని బలోపేతం చేయడంతోపాటు దేశం ముందడుగు వేసేందుకు బాబాసాహెబ్‌ బలమైన పునాది వేశారని ప్రధాని పేర్కొన్నారు. బాబాసాహెబ్‌ సిద్ధాంతాలను ప్రస్తావిస్తూ- ‘జ్ఞానం, ఆత్మగౌరవం, వినయం’ అనే త్రిగుణాలను ఆయన అమితంగా పూజించే త్రిమూర్తులతో సమానంగా పరిగణించేవారని గుర్తుచేశారు. జ్ఞాన సముపార్జనతో వ్యక్తికి ఆత్మగౌరవం సిద్ధిస్తుందని, తన హక్కులేమిటో తెలుసుకునేందుకు అది తోడ్పడుతుందని పేర్కొన్నారు. సమాన హక్కులతోనే సామాజిక సామరస్యం ఆవిష్కృతమవుతుందని, దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని చెప్పారు. బాబాసాహెబ్‌ చూపిన బాటలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన విద్యా వ్యవస్థపైన, విశ్వవిద్యాలయాల మీద ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

   జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)పై ప్రధానమంత్రి మాట్లాడుతూ- “ప్రతి విద్యార్థికీ కొన్ని సామర్థ్యాలుంటాయి. ఈ సామర్థ్యాలు విద్యార్థికి, బోధకులకు మూడు ప్రశ్నలు సంధిస్తాయి. మొదటిది- వారేం చేయగలరు? రెండోది- సరైన బోధన లభిస్తే వారి సామర్థ్యం ఎలా ఉంటుంది? మూడోది- వారేం చేయాలని భావిస్తున్నారు? తొలి ప్రశ్నకు జవాబు విద్యార్థిలోని అంతర్గత శక్తి. అయితే, ఈ శక్తికి వ్యవస్థాగత బలాన్ని జోడిస్తే వారి ప్రగతి విస్తరిస్తుంది... తద్వారా తామేం చేయదలచారో అది చేయగలరు” అని వివరించారు. అటుపైన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వ్యాఖ్యలను ప్రధానమంత్రి ఉటంకించారు. దేశ ప్రగతిలో భాగస్వామ్యం దిశగా విద్యార్థులకు స్వేచ్ఛను, సాధికారతను ప్రసాదించే విద్య అవసరమన్న డాక్టర్‌ రాధాకృష్ణన్‌ దార్శనికతను నెరవేర్చడమే జాతీయ విద్యావిధానం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచం మొత్తాన్నీ ఒక్కటిగా ఉంచే విధంగా విద్యా నిర్వహణ సాగాలని, అదే సమయంలో భారతీయ సహజ విద్యా స్వభావాన్ని కొనసాగించడంపై దృష్టి సారించాలన్నారు.

   స్వయం సమృద్ధ భారతం ఆవిర్భవిస్తున్న నేపథ్యంలో నైపుణ్యాలకు డిమాండ్‌ పెరగటాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ- కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, బిగ్‌ డేటా, 3డి ప్రింటింగ్‌, వర్చువల్‌ రియాలిటీ, రోబోటిక్స్‌, మొబైల్‌ సాంకేతికత, జియో-ఇన్ఫర్మాటిక్స్‌, అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ, రక్షణ తదితర రంగాల్లో భవిష్యత్‌ ప్రపంచ కూడలిగా భారత్‌ గుర్తింపు పొందగలదని చెప్పారు. ఈ నైపుణ్యాల అవసరాన్ని తీర్చడానికి దేశంలోని మూడు పెద్ద మెట్రోపాలిటన్‌ నగరాల్లో భారతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఐఐఎస్‌)ల ఏర్పాటు గురించి ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా ముంబైలో ఇప్పటికే ఏర్పాటైన భారత నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఐఐఎస్‌)లో విద్యార్థుల తొలి బ్యాచ్‌ మొదలైందని తెలిపారు. కాగా, ‘నాస్కామ్‌’ సహకారంతో భవిష్యత్‌ నైపుణ్యాల అభివృద్ధి దిశగా వినూత్న ప్రయత్నం 2018లోనే ప్రారంభమైందని ప్రధానమంత్రి తెలిపారు. అన్ని విశ్వవిద్యాలయాలూ బహుళ-కోర్సులతో విద్యార్థులకు చదువులు సరళం చేయాలన్నది తమ ఆకాంక్షగా ఆయన పేర్కొన్నారు. ఈ లక్ష్యం సాధనకు కృషి చేయాల్సిందిగా ఉప-కులపతులకు ఆయన పిలుపునిచ్చారు.

   ప్రజలందరికీ సమాన హక్కులు-అవకాశాలపై బాబాసాహెబ్‌ కట్టుబాటు గురించి శ్రీ మోదీ విశదీకరించారు. ‘జన్‌ ధన్‌’ వంటి పథకాలు ప్రతి వ్యక్తి ఆర్థిక సార్వజనీనతకూ తోడ్పడుతున్నాయని, ‘ప్రత్యక్ష లబ్ధి బదిలీ’ (డీబీటీ)ద్వారా వారి ఖాతాలకు నగదు నేరుగా జమ అవుతున్నదని ప్రధానమంత్రి గుర్తుచేశారు. బాబాసాహెబ్‌ సందేశం ప్రతి వ్యక్తికీ చేరేలా చేయడంలో దేశం చిత్తశుద్ధిని ప్రధాని పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా బాబాసాహెబ్‌ జీవితంలోని ముఖ్య ఘట్టాలకు సంబంధించిన కీలక ప్రదేశాలను ‘పంచతీర్థాలు’ పేరిట అభివృద్ధి చేయడాన్ని ఒక ముందడుగుగా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా జల్‌జీవన్‌ మిషన్‌, ఉచిత గృహాలు, ఉచిత విద్యుత్‌, మహమ్మారి సమయంలో జీవనోపాధి మద్దతు, మహిళా సాధికారతకు తీసుకున్న వినూత్న చర్యలు బాబాసాహెబ్‌ కన్న కలలు సాకారమయ్యేందుకు దోహదం చేస్తున్నాయని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమాల్లో భాగంగా బాబాసాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ జీవితంపై శ్రీ కిషోర్‌ మక్వానా రచించిన కింది నాలుగు పుస్తకాలను ప్రధానమంత్రి ఆవిష్కరించారు:

“డాక్టర్‌ అంబేడ్కర్‌ జీవన్‌ దర్శన్‌”

“డాక్టర్‌ అంబేడ్కర్‌ వ్యక్తి దర్శన్‌”

“డాక్టర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర దర్శన్‌”

“డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆయమ్‌ దర్శన్‌”

   ఈ నాలుగు పుస్తకాలూ ఆధునిక ప్రామాణిక గ్రంథాలతో దీటైనవని, బాబాసాహెబ్‌ విశ్వజనీన దృష్టికోణాన్ని ఇవి వివరిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్థులు ఈ పుస్తకాలను విస్తృతంగా చదువుతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

 

***



(Release ID: 1711953) Visitor Counter : 146