ప్రధాన మంత్రి కార్యాలయం

రైసినా చర్చలు-2021

Posted On: 13 APR 2021 10:25PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రైసినా చర్చల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ప్రత్యక్ష సాదృశ మార్గంలో వీడియో మాధ్యమంద్వారా ప్రసంగించారు. ఈ సమావేశంలో రువాండా అధ్యక్షుడు మాననీయ పాల్‌ కగామీ, డెన్మార్క్‌ ప్రధానమంత్రి గౌరవనీయ మెట్టీ ఫ్రెడరిక్‌సన్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక 6వ దఫా రైసినా చర్చల కార్యక్రమాన్ని 2021 ఏప్రిల్‌ 13-16 తేదీల మధ్య భారత విదేశీ వ్యవహారాల శాఖ, అబ్జర్వర్‌ రీసెర్చి ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది “వైరల్‌ వరల్డ్‌: అవుట్‌బ్రేక్స్‌, అవుట్‌లయర్స్‌ అండ్‌ అవుట్‌ ఆఫ్‌ కంట్రోల్‌” (వైరస్‌ ప్రపంచం: వ్యాప్తి... అవాస్తవాలు... చేజారిన నియంత్రణ) ఇతివృత్తంగా చర్చలు సాగుతున్నాయి.

   కోవిడ్‌-19 మహమ్మారి ప్రపంచాన్ని ఏడాదికన్నా ఎక్కువ కాలం నుంచి పీడిస్తున్న, మానవ చరిత్ర కీలక మలుపు తిరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత రైసినా చర్చలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ తన ప్రసంగంలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సందర్భంలో దీనికి సంబంధించిన కొన్ని సముచిత ప్రశ్నలపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందని అంతర్జాతీయ సమాజానికి ప్రధాని పిలుపునిచ్చారు.

   సమస్య లక్షణాలను మాత్రమేగాక, దానికి సంబంధించిన అంతర్లీన సవాళ్లను కూడా  పరిష్కరించే దిశగా ప్రపంచ వ్యవస్థలు తమనుతాము సన్నద్ధం చేసుకోవాలని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. మన ఆలోచనలు, కార్యాచరణ మానవాళి కేంద్రకంగా సాగాలని, తదనుగుణంగా నేటి సమస్యలను, రేపటి సవాళ్లను పరిష్కరించగల వ్యవస్థలను సృష్టించాలని ప్రధాని పిలుపునిచ్చారు. మహమ్మారిపై పోరులో దేశీయంగానే కాకుండా ఇతరదేశాలకు సహాయం రూపేణా భారతదేశం ప్రతిస్పందనాత్మక కృషిని కూడా ప్రధాని ఈ సందర్భంగా వివరించారు. మహమ్మారి విసిరిన విభిన్న సవాళ్లను ఎదుర్కొనడానికి సమష్టి కృషి అవసరమని, ఆ దిశగా మానవాళి శ్రేయస్సు కోసం ప్రపంచంతో తన శక్తిసామర్థ్యాలను పంచుకోవడానికి భారత్‌ సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.

 

***



(Release ID: 1711845) Visitor Counter : 211