ప్రధాన మంత్రి కార్యాలయం

‘టీకా ఉత్సవ్’పై ప్రధానమంత్రి సందేశం తెలుగు పాఠం

Posted On: 11 APR 2021 12:15PM by PIB Hyderabad

నా ప్రియమైన దేశవాసులారా!

   జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా నేడు... అంటే- ఏప్రిల్ 11న మనం ‘టీకా ఉత్సవ్’ను ప్రారంభించుకుంటున్నాం. ఈ ‘టీకా ఉత్సవ్’ ఏప్రిల్ 14దాకా... అంటే- బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకల వరకూ కొనసాగుతుంది. ఒక విధంగా ఈ ఉత్సవం కరోనాపై మరో కీలక యుద్ధానికి శ్రీకారం. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రతకే కాకుండా సామాజిక శుభ్రతకూ మనం ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలి. ఇందులో భాగంగా మనం నాలుగు అంశాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి:

  • ప్రతి ఒక్కరూ – కనీసం ఒకరికి టీకా వేయించాలి... అంటే- స్వయంగా వెళ్లి టీకా వేయించుకోలేని పెద్దలు, పెద్దగా చదువుకోని వారికి సాయం చేయాలి.
  • ప్రతి ఒక్కరూ – కనీసం ఒకరిని ఆదరించాలి... అంటే- టీకా అందుబాటుకు సంబంధించిన సదుపాయాల గురించి తెలియనివారికి లేదా అందుకు అవకాశం లేనివారికి సాయం చేయాలి.
  • ప్రతి ఒక్కరూ – కనీసం ఒకరిని రక్షించాలి... అంటే- ‘‘నేను కచ్చితంగా మాస్కు ధరించి నన్ను నేను రక్షించుకోవవడంతోపాటు ఇతరుల ప్రాణాలకూ రక్షణ కల్పిస్తాను’’ అని ప్రతినబూనాలి.

   ఇక నాలుగో ముఖ్యమైన అంశం ఏమిటంటే- ఎవరికైనా కరోనా సోకినపుడు ఆ పరిసర ప్రదేశాల్లో ‘సూక్ష్మ నియంత్రణ మండలం’ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలి. కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన పక్షంలో ఆ వ్యక్తి కుటుంబసభ్యులు సంబంధిత ప్రాంతంలోని ఇతరులు కూడా ‘సూక్ష్మ నియంత్రణ మండలం’ ఏర్పాటు చేసుకోవాలి.

   అధిక జనసాంద్రతగల భారత్ వంటి దేశంలోనైనా కరోనాపై పోరులో ‘సూక్ష్మ నియంత్రణ మండలం’ ఏర్పాటు ఒక కీలక తరణోపాయం. అలాగే ఏ ఒక్కరికి వ్యాధి నిర్ధారించబడినా అందరూ అప్రమత్తమై, మిగిలినవారంతా పరీక్ష చేయించుకునేలా శ్రద్ధ వహించాలి. అదే సమయంలో సామాజికంగానే కాకుండా పాలన యంత్రాంగం పరంగానూ అర్హులైన వారందరూ  టీకా వేయించుకునేలా కృషిచేయాలి. ఒక్క టీకా కూడా వ్యర్థం కారాదన్నది మన లక్ష్యం కావాలి. ఆ మేరకు అసలు టీకా వృథా అన్నమాటకే తావు లేకుండా జాగ్రత్త వహించాలి. ఈ కృషిలో భాగంగా దేశంలోని టీకా సామర్థ్యాన్ని గరిష్ఠంగా వినియోగించుకునేలా చూడాలి. మన టీకా ఉత్పాదక సామర్థ్యాన్ని ఇనుమడింపజేయడానికి ఇదీ ఒక మార్గమే.

  • మన విజయం – ‘సూక్ష్మ నియంత్రణ మండలం’పై అవగాహనపైనే ఆధారపడి ఉంటుంది.
  • మన విజయం – అనవసరంగా ఇళ్లనుంచి బయటకు వెళ్లకపోవడంలోనే ఉంటుంది.
  • మన విజయం – అర్హులైన వారందరికీ టీకా వేయించడంపైనే నిర్ణయించబడుతుంది.
  • మన విజయం – మనం మాస్క్ ధరించడం, ఇతర నిబంధనలను పాటించడంపైనా ఆధారపడి ఉంటుంది.

మిత్రులారా!

   ఈ నాలుగు రోజుల ‘టీకా ఉత్సవ్’లో వ్యక్తిగత, సామాజిక, పాలన యంత్రాంగం స్థాయులలో లక్ష్యాలను సాధించే దిశగా మనం అన్నివిధాలా కృషిచేయాలి. అప్రమత్తంగా ఉండటంతోపాటు ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించడంతోపాటు ప్రజల భాగస్వామ్యంతో మనం మరోసారి కరోనాను నియంత్రించగలమని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.

గుర్తుంచుకోండి – మందులు వాడటమే కాదు... విధివిధానాలకు కట్టుబాటు కూడా ముఖ్యం.

 

ధన్యవాదాలు!

మీ

నరేంద్ర మోదీ

బాధ్యత నిరాకరణ ప్రకటన: ఇది ప్రధానమంత్రి హిందీ వాస్తవ ప్రసంగానికి సమీప తెలుగు అనువాదం.

 

***


(Release ID: 1711049) Visitor Counter : 215