ప్రధాన మంత్రి కార్యాలయం

భారత-నెదర్లాండ్స్ వాస్తవిక సాదృశ శిఖరాగ్ర సదస్సు

Posted On: 09 APR 2021 9:46PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని గౌరవనీయ మార్క్ రట్టీ ఇవాళ వాస్తవిక సాదృశ మాధ్యమం ద్వారా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు.

   నెదర్లాండ్స్ దేశంలో 2021 మార్చి నెలలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించిన అనంతరం ప్రధాని రుట్టీ పాల్గొన్న తొలి ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశం ఇదే. ఈ ఎన్నికలలో విజయంతో వరుసగా నాలుగోసారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రట్టీకి ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలిపారు.

   ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పాలన, మానవ హక్కులపై గౌరవంసహా రెండు దేశాలకూగల స్నేహాస్పద చరిత్రాత్మక బంధాల భాగస్వామ్యం భారత్-నెదర్లాండ్స్ మధ్యగల బలమైన, సుస్థిర సంబంధాలను మరింత ఇనుమడింపజేస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన

శిఖరాగ్ర సమావేశంలో దేశాధినేతలిద్దరూ ద్వైపాక్షిక సంబంధాల్లో భాగమైన అన్ని అంశాలనూ సమగ్రంగా సమీక్షించారు. అదే సమయంలో వాణిజ్యం-ఆర్థిక వ్యవస్థ, జల నిర్వహణ, వ్యవసాయం, అత్యాధునిక నగరాలు, శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానం, ఆరోగ్య సంరక్షణసహా అంతరిక్ష రంగాల్లో సంబంధాల వైవిధ్యీకరణ, విస్తరణలపై వారు తమ ఆలోచనలను పరస్పరం పంచుకున్నారు. జలసంబంధ రంగంలో ఇండో-డచ్ సహకారం మరింత విస్తరించే దిశగా ‘‘జల వ్యవహారాలపై వ్యూహాత్మక భాగస్వామ్య’’ వ్యవస్థ ఏర్పాటుపై ప్రధానమంత్రులు ఇద్దరూ ఒక అంగీకారానికి వచ్చారు. దీంతోపాటు జల వ్యవహారాలపై సంయుక్త కార్యాచరణ బృందాన్ని మంత్రుల స్థాయికి ఉన్నతీకరించాలని నిర్ణయించారు.

   వాతావరణ మార్పులు, ఉగ్రవాద నిరోధం, కోవిడ్-19 మహమ్మారి తదితర ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై అధినేతలిద్దరూ పరస్పరం అభిప్రాయాలు తెలియజేసుకున్నారు. అలాగే ఇండో-పసిఫిక్, ప్రతిరోధక సరఫరా శృంఖలాలు, అంతర్జాతీయ డిజిటల్ పరిపాలన వంటి కొత్త రంగాల్లో ప్రవర్ధమాన ఆవిర్భావాన్ని సద్వినియోగం చేసుకోవడంపై అంగీకారానికి వచ్చారు. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఎ), విపత్తు ప్రతిరోధక మౌలిక వసతుల కూటమి (సిడిఆర్‌ఐ)లకు నెదర్లాండ్స్ సహకరించడంపై ప్రధానమంత్రి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇండో-పసిఫిక్ విధానంలోనే కాకుండా, 2023లో భారత్ జి20 కూటమి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక కూడా సహకారం కొనసాగించాలన్న నెదర్లాండ్స్ ఆకాంక్షపై ప్రధానమంత్రి మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి, సుస్థిరత, శ్రేయస్సులకు భరోసా దిశగా నియమాధారిత బహుపాక్షిక క్రమం కొనసాగేలా చూడటంపై రెండు దేశాల అధినేతలూ తమ కట్టుబాటును పునరుద్ఘాటించారు. ఇక 2021 మే నెలలో పోర్చుగల్‌లోని పోర్టో నగరంలో నిర్వహించనున్న భారత-ఐరోపా సమాఖ్య నాయకుల శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతం చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

 

***


(Release ID: 1710778) Visitor Counter : 235