మంత్రిమండలి

మహారాష్ట్ర లోని వధావన్ లో ఒక కొత్త ప్రధాన ఓడ రేవు ను ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయ ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 05 FEB 2020 1:47PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం మహారాష్ట్ర లోని దహానూ సమీపం లోని వధావన్ వద్ద ప్రధాన రేవు ను ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయం గా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని రూ.65,544.54 కోట్లు గా అంచనా వేశారు. వధావన్ రేవు ను ‘‘భూస్వామిత్వ నమూనా’’లో అభివృద్ధిపరుస్తారు. ఇందుకోసం 50 శాతాని కి సమానం గా లేదా అంత కన్నా ఎక్కువ ఎక్విటీ వాటా తో జవాహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టు ప్రధాన భాగస్వామి గా ‘స్పెశల్ పర్పస్ వీకల్ (ఎస్ పివి)ని ఏర్పాటు చేస్తారు. సముద్రాంతర భూసేకరణ (రెక్లమేశన్), అల ల నిరోధ వారధి (బ్రేక్ వాటర్) నిర్మాణం సహా మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత ను ప్రత్యేక ప్రయోజన సంస్థ నిర్వర్తిస్తుంది. దీంతో పాటు లోతట్టు ప్రాంతాని కి అనుసంధానం కూడా కల్పిస్తుంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం కింద అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలనూ ప్రైవేటు భాగస్వాములు చేపడతారు.

జవాహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జెఎన్ పిటి) భారతదేశం లో  అతి పెద్ద కంటెయినర్ రేవు.  ప్రపంచం లో 28వ స్థానం దీనిది. ఇక్కడ 5.1 మిలియన్ టిఇయు (20 అడుగుల సమాన యూనిట్లు)ల మేర ఓడల రాకపోక లు సాగుతుంటాయి. కాగా, జవాహర్ లాల్ నెహ్రూ రేవు లో 2023వ సంవత్సరం కల్లా 10 మిలియన్ టిఇయు ల సామర్థ్యం గల 4వ టర్మినల్ పూర్తి అయిన తరువాత ఇది ప్రపంచం లో 17వ స్థానం లోకి దూసుకుపోతుంది. ఈ నేపథ్యం లో వధావన్ రేవు ను అభివృద్ధి చేశాక భారతదేశం ప్రపంచం లోని 10 అగ్ర శ్రేణి కంటెయినర్ రేవు లను కలిగివున్నటువంటి దేశాల లో చేరిపోతుంది.

మహారాష్ట్ర లోని జవాహర్ లాల్ నెహ్రూ రేవు దేశం లోనే అత్యంత పెద్ద కంటెయినర్ రేవు కాగా, మహారాష్ట్ర సహా ఉత్తర కర్నాటక, తెలంగాణ ల లోని ప్రధాన లోతట్టు ప్రాంతాల కు సేవల ను అందిస్తోంది. దీంతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, నేశనల్ కేపిటల్ రీజన్ (ఎన్ సిఆర్), పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ ల లోని ద్వితీయ ప్రాధాన్య లోతట్టు ప్రాంతాల కు కూడా ఈ రేవు ద్వారా  సేవ లు అందుతున్నాయి. ప్రపంచం లో అత్యంత భారీ కంటెయినర్ ఓడల కు ఆశ్రయం ఇచ్చేందుకు వీలు గా, జవాహర్ లాల్ నెహ్రూ రేవు పై రద్దీ భారాన్ని తగ్గించడానికి అనువైన ఓడ లు నిలిపే లోతైన రేవు ప్రస్తుతం అవసరం. ఆ మేరకు వధావన్ రేవు పూర్తి అయ్యాక 10 మిలియన్ టిఇయు ల సామర్థ్యం సంపూర్ణ వినియోగం లోకి వస్తే ఈ అవసరం తీరుతుంది. జవాహర్ లాల్ నెహ్రూ రేవు, ముంద్రా రేవు లు దేశం లో భారీ స్థాయి న కంటెయినర్ ఓడల కు (మధ్యస్థ పరిమాణంగలవి మాత్రమే) ఆశ్రయం ఇస్తున్నాయి. ఈ రెండు రేవుల లో నౌక లు నిలిపే ప్రదేశాలు 15 మీటర్లు, 16 మీటర్ల లోతు తో ఉన్నాయి. అయితే, ప్రపంచం లో అత్యంత భారీ కంటెయినర్ ఓడ ల నిర్వహణ కోసం 18 నుండి 20 మీటర్ల లోతైన నౌక లు నిలిపే ప్రదేశాలు అవసరం. ఆ మేరకు వధావన్ వద్ద 20 మీటర్ల లోతైన సహజ ప్రదేశం తీరాని కి సమీపం లోనే అందుబాటు లో ఉంది. దీని వల్ల ఈ రేవు లో అతి భారీ ఓడల రవాణా ను కూడా నిర్వహించుకునే అవకాశం లభిస్తుంది. వధావన్ రేవు అభివృద్ధి తో 16,000 నుండి 25,000 టిఇయు ల సామర్థ్యం గల కంటెయినర్ ఓడల ను ఆకర్షించే వీలు కలుగుతుంది. దీంతో రవాణా వ్యయం గణనీయం గా తగ్గడమే గాక అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల లోని ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.

కంటెయినర్ ఓడ ల పరిమాణం నానాటికీ పెరుగుతూనే ఉండటం తో భారత పశ్చిమ తీరం లో లోతైన ప్రదేశాలు గల రేవుల అభివృద్ధి తప్పనిసరి అవుతోంది. విలువ జోడింపు తయారీ రంగం పరిఢవిల్లుతుండటం వల్ల కంటెయినర్ సహిత ఓడ ల రవాణా పెరుగుతోంది. ఆ మేరకు విలువ జోడించిన వస్తు దిగుమతి-ఎగుమతుల నిర్వహణ కు అనువు గా దేశం లో రేవు ల మౌలిక సదుపాయాల ను అభివృద్ధి చేసుకోవలసివుంది. జవాహర్ లాల్ నెహ్రూ రేవు పూర్తి సామర్థ్యాన్ని వినియోగం లోకి తెస్తే దీని పరిధిలో గల లోతట్టు ప్రాంతాల రవాణా రద్దీ 4.5 ఎమ్ టియు నుండి 2022-25 కల్లా 10.1 ఎమ్ టియుల కు పెరుగుతుందని అంచనా. రవాణా మౌలిక వసతుల ను మెరుగుపరచే ప్రణాళిక లు ఫలవంతం కావడంతో పాటు 'మేక్ ఇన్ ఇండియా' ద్వారా తయారీ కూడలి గా, ఎగుమతుల కు ఇతోధికం గా దోహదపడేది గా భారతదేశానికి డిమాండ్ మరింత పుంజుకుంటుంది.


***



(Release ID: 1708483) Visitor Counter : 127