సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వచ్చే పాతికేళ్ల దార్శినికతకు తగిన తరుణం ఇదే: ప్రకాశ్ జవదేకర్
ఢిల్లీతో సహా ఏడుచోట్ల ఎగ్జిబిషన్లను ప్రారంభించిన కేంద్రమంత్రి
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహణ
Posted On:
13 MAR 2021 3:56PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన (ఫొటో ఎగ్జిబిషన్)ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ రోజు ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో నిర్వహణకోసం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన భారీ స్థాయి కార్యక్రమంలో భాగంగా అవుట్.రీచ్ అండ్ కమ్యూనికేషన్ బ్యూరో (బి.ఒ.సి.) ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి కేంద్రమంత్రి జవదేకర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం సముపార్జించుకున్న నాటినుంచి మనం ఎంతమేర పురోగమించామో తెలియజేసే అతి ముఖ్యమైన క్షణాలివేనని, వచ్చే ఇరవై ఐదేళ్లలో మనం ఏమి సాధించాలనుకుంటున్నామో అన్న దార్శనికతను నిర్దేశించుకునే ముఖ్యమైన తరుణం కూడా ఇదేనని అన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చిన తర్వాతనే మనకు స్వాతంత్ర్యం సమకూరిందని, స్వాతంత్ర్యమే లక్ష్యంగా జరిగిన నేతల త్యాగాలను గురించి తెలుసుకునేందుకు ఈ ఛాయాచిత్ర ప్రదర్శన దోహదపడుతుందని మంత్రి తెలిపారు. ప్రదర్శనలను ఏర్పాటు చేసిన బి.ఒ.సి.ని జవదేకర్ అభినందించారు.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ ఖరే మాట్లాడుతూ, స్వాతంత్ర్య సముపార్జనకోసం పోరాడిన వారి సేవలను గురించిన అవగాహన కార్యక్రమాన్ని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నియమించిన జాతీయ కమిటీ రూపొందించిందని, ఈ కార్యక్రమాన్ని ప్రతి మంత్రిత్వ శాఖకు అప్పగించిందని అన్నారు. ఈ ప్రదర్శనల డిజిటల్ రూపం కూడా ప్రస్తుతం తయారవుతోందని, వచ్చే ఆగస్టు 15వ తేదీలోగా డిజిటల్ వర్షెన్ ను కూడా ప్రారంభించే అవకాశం ఉందని ఆయన అన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మరో ఆరు ప్రదర్శనలను కూడా ప్రకాశ్ జవదేకర్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. దేశంలోని ఈ కింది ప్రాంతాల్లో ఈ ప్రదర్శలను ఏర్పాటు చేశారు. అవి...
- సాంబా జిల్లా, జమ్ము కాశ్మీర్
- బెంగుళూరు, కర్ణాటక
- పుణె, మహారాష్ట్ర
- భువనేశ్వర్, ఒడిశా
- మోయిరాంగ్, బిష్ణుపూర్ జిల్లా, మణిపూర్
- పాట్నా, బీహార్
జమ్ముకాశ్మీర్.లోని సాంబాలో ఫొటో ఎగ్జిబిషన్.ను బ్రిగేడియర్ రాజేందర్ సింగ్ పురా బగూనా ఏర్పాటు చేశారని, 'కాశ్మీర్ రక్షకుడు'గా పేరుపొందిన బ్రిగేడియర్ రాజేందర్ సింగ్ కు ఇది జన్మస్థలం. కాశ్మీర్ లో 1947లో పాకిస్తాన్ మద్దతుతో దాడి చేసిన గిరిజన తెగలను బ్రిగేడియర్ రాజేందర్ సింగ్ ఒక్కరే సాహసోపేతంగా ఎదుర్కొని వీరోచితంగా పోరాడి, ప్రాణాలర్పించారు. భారతీయ సైన్యం ఆ ప్రాంతాన్ని చేరుకునే వరకూ బ్రిగేడియర్ రాజేందర్ సింగ్ తన సైనిక బృందంతో వీరోచితంగా పోరాడుతూ, పాకిస్తానీ గిరిజన తెగలను శ్రీనగర్ వైపు కదలకుండా నిలువరించగలిగారు. 1949 డిసెంబరు 30వ తేదీన,.. స్వతంత్ర భారతదేశపు తొలి మహావీరచక్ర పురస్కార గ్రహీతగా ఆయన రికార్డులకెక్కారు.
ఇక బెంగుళూరులోని కోరమంగళ ప్రాంతంలోని కేంద్రీయ సదనలో ప్రాంతీయ అవుట్ రీచ్ బ్యూరో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది. స్వాతంత్ర్య పోరాటాన్ని తలపునకు తెచ్చే పలు ప్రాంతాలు బెంగుళూరులో ఉన్నాయి. నేషనల్ హైస్కూల్ మైదానం, గాంధీ భవన, బన్నప్ప పార్కు, ఫ్రీడమ్ పార్కు, యశ్వంతపుర రైల్వే స్టేషన్ వంటివి ఈ కోవలోకే వస్తాయి. స్వాతంత్ర్యం కోసం జాతీయస్థాయి సమరయోధులతో సహా పోరాడిన స్థానిక యోధుల సేవలను తెలియజెప్పే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
పుణె నగరంలో ఎగ్జిబిషన్ ను ఆగాఖాన్ భవంతిలో నిర్వహించారు. రాజసం ఉట్టిపడే ఈ భవంతికి స్వాతంత్ర్య పోరాటానికి ఎంతో సంబంధం ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ, ఆయన ధర్మపత్ని కస్తూర్బా గాంధీ, గాంధీజీ కార్యదర్శి మహదేవ్ దేశాయ్, సరోజినీ నాయుడులను నిర్బంధించేందుకు ఈ భవంతిని కారాగారంగా ఉపయోగించారు. మహాత్మాగాంధీ తదితరులను ఈ రాజప్రాసాదంలో 21 నెలలపాటు నిర్బంధించారు. క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభం నేపథ్యంలో వారిని 1942 ఆగస్టు 9నుంచి 1944 మే నెల 6వరకూ ఇక్కడే ఉంచారు. ఇక్కడ నిర్బంధంలో ఉండగానే, కస్తూర్బా గాంధీ, మహదేవ్ దేశాయ్ ఈ భవనంలోనే ప్రాణాలు కోల్పోయారు. వారి సమాధులు కూడా అక్కడే ఉన్నాయి. మూలా నదీ సమీపంలో మహాత్మాగాంధీ, కస్తూర్బా గాంధీ స్మారక చిహ్నాలు కూడా ఉన్నాయి.
ఒడిశాలోని ఖోర్దా జిల్లాలో భువనేశ్వర్ కు చెందిన ప్రాంతీయ అవుట్ రీచ్ బ్యూరో ఎగ్జిబిషన్ ను, ఈ నెల 12నుంచి 16వ తేదీవరకూ నిర్వహిస్తోంది. ఖోర్దా జిల్లా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులకు జన్మస్థలం. ఐదు రోజులపాటు సాగుతున్న ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా పలు ప్రదర్శనలు, సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, పలురకాల ఇతర పోటీలు నిర్వహిస్తున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమర యోధల సేవలను, త్యాగాలను తెలియజేస్తూ ఇక్కడ ప్యానెల్స్ ప్రదర్శించారు.
మణిపూర్ లో బిష్ణుపూర్ జిల్లాలో ఉన్న మోయిరాంగ్ ప్రాంతానికి భారతీయ స్వాతంత్ర్య చరిత్రలో విశిష్టమైన స్థానం ఉంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇక్కడ ఫొటో ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నారు. భారతీయ జాతీయ సైన్యం (ఐ.ఎన్.ఎ) పతాకాన్ని తొలిసారిగా మోయిరాంగ్ లోనే 1944, ఏప్రిల్ 14న ఆవిష్కరించారు. ఆజాదీ అమృత్ మహోత్సవ్ లో భాగంగా మోయిరాంగ్ లోని ఐ.ఎన్.ఎ. స్మారక ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఐదు రోజుల ఎగ్జిబిషన్ వర్చువల్ ప్రారంభోత్సవానికి లోక్ సభ సభ్యుడు డాక్టర్ ఆర్.కె. రంజన్ సింగ్, మణిపూర్ రాష్ట్ర కళలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ సీనియర్ అధికారులు, బిష్ణుపూర్ జిల్లా పరిపాలనా యంత్రాంగం అధికారులు హాజరయ్యారు. భారతీయ స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ప్రముఖ ఘట్టాలను తెలియజెప్పేలా ఈ ప్రదర్శనను రూపొందించారు. సహాయ నిరాకరణోద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా పోరాటం తదితర అంశాలను ప్రతిఫలింపజేశారు. దండియాత్ర ఉద్యమంపై దృష్టిని కేంద్రీకరిస్తూ, మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ తదితర నాయకుల త్యాగాలను ప్రతిఫలింపచేస్తూ ఈ ప్రదర్శనను తీర్చిదిద్దారు. జాతీయతా వాదంతో ప్రదర్శనలు, స్వదేశీ డప్పు నృత్యాలు, భారతీయ నృత్యాలు, ఆత్మరక్షణ కళలతో సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రాంతీయ అవుట్ రీచ్ బ్యూరోకు చెందిన సిబ్బంది, ప్యానెల్ కళాకారులు ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. విద్యార్థుల కోసం నిర్వహించే క్విజ్ కార్యక్రమాలు, వక్తృత్వ పోటీలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.
బీహార్ రాజధాని పాట్నాలోని అనుగ్రహ్ నారాయణ్ కళాశాలలో కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. గాంధీ నిర్వహించిన చంపారాన్ సత్యాగ్రహంలో ప్రముఖ పాత్ర పోషించిన స్వాతంత్ర్య సమర యోధుడు అనుగ్రహ్ నారాయణ్ సింగ్ పేరిట ఈ కళాశాలకు నామకరణం చేశారు. బీహార్ కు చెందిన ముఖ్యమైన స్వాతంత్ర్య సమరయోధులను గురించిన వివరిస్తూ ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వారి చరిత్రలను భారీ స్థాయి ఎల్.ఇ.డి. తెరలపై ప్రదర్శిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు.
మన స్వాతంత్ర ఉద్యమానికి, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న నాయకులకు సంబంధించిన మరపురాని ఘట్టాలను వివరించేందుకు బి.ఒ.సి. ఆధ్వర్యంలో సాగే ఈ ఛాయాచిత్ర ప్రదర్శనలు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. జాతిపిత మహాత్మా గాంధీతో పాటుగా, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభభాయి పటేల్, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు, చక్రవర్తి రాజగోపాలాచారి, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్, లాలా లజపతి రాయ్ వంటి నేతలు, షాహిద్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాంప్రసాద్ బిస్మిల్ వంటి ఎందరో విప్లవకారుల త్యాగాలను ఈ ఛాయాచిత్ర ప్రదర్శనలు కళ్లకు గడుతున్నాయి.
*****
(Release ID: 1704610)
Visitor Counter : 214