ప్రధాన మంత్రి కార్యాలయం

సిఇఆర్ఎ వారోత్స‌వం 2021లో కీల‌క‌ప్ర‌సంగం చేసిన ప్ర‌ధాన‌మంత్రి


ప్ర‌ధాన‌మంత్రికి సిఇఆర్ఎ వారోత్స‌వ గ్లోబ‌ల్ ఎన‌ర్జీ , ఎన్విరాన్‌మెంట్ లీడ‌ర్‌షిప్ అవార్డు

అవార్డును ప్ర‌జ‌ల‌కు భార‌తీయ సంప్రదాయాల‌కు అంకితం చేసిన ప్ర‌ధాన‌మంత్రి

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు సంబంధించిన గొప్ప‌యోధుడు మ‌హాత్మాగాంధీ: ప‌్ర‌ధాన‌మంత్రి

వాతావ‌ర‌ణ మార్పుల‌పై పోరాటం చేయ‌డానికి శ‌క్తిమంత‌మైన విధానం , ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు తీసుకురావ‌డ‌మే : ప‌్ర‌ధాన‌మంత్రి

హేతుబ‌ద్ధంగా , ప‌ర్యావ‌ర‌ణ‌ప‌రంగా ఆలోచించే స‌మ‌యం ఇది. ఇది మీకు నాకు మాత్ర‌మే సంబంధించింది కాదు.ఇది విశ్వ‌భ‌విష్య‌త్తుకు సంబంధించిన‌ది: ప‌్ర‌ధాన‌మంత్రి

Posted On: 05 MAR 2021 7:49PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ సిఇఆర్ ఎ వారోత్స‌వం 2021 సంద‌ర్భంగా వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా కీల‌కోప‌న్యాసంచేశారు. ప్ర‌ధాన‌మంత్రికి సిఇఆర్ఎ వారోత్స‌వ అంత‌ర్జాతీయ ఇంధ‌న‌, ప‌ర్యావ‌ర‌ణ నాయ‌క‌త్వ అవార్డు ను అంద‌జేశారు. తాను విన‌మ్ర‌త‌తో ఈ అవార్డును అంగీక‌రిస్తున్నాన‌ని ప్ర‌ధాని అన్నారు. ఈ అవార్డును  ఈ అద్భుత‌మైన మాతృభూమికి చెందిన ప్ర‌జ‌ల‌కు అంకితం చేస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌క‌టించారు.అలాగే ఈ అవార్డును భార‌త‌దేశ అద్భుత సంప్ర‌దాయాల‌కు, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు అవి చూపిన మార్గానికి అంకితం చేస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో శ‌తాబ్దాలుగా భార‌తీయులు నాయ‌క‌త్వ స్థానంలో ఉన్నార‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.మ‌న సంస్కృతిలో ప్ర‌కృతి,దైవ‌త్వం స‌న్నిహిత అనుబంధం క‌లిగిన‌వ‌ని ఆయ‌న అన్నారు.

ఇప్పటివరకు జీవించిన గొప్ప పర్యావరణ ప‌రిర‌క్ష‌ణ‌వేత్త‌ల‌లో  మహాత్మా గాంధీ  గొప్ప మ‌హ‌నీయుల‌ని  ప్రధాని అన్నారు. మాన‌వాళి మ‌హాత్ముడి ప‌థాన్ని అనుస‌రించి ఉంటే మ‌నం ఇవాళ ఎదుర్కొంటున్న ఎన్నో స‌మ‌స్య‌లు త‌లెత్తేవి కాద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌లు మ‌హాత్మాగాంధీ స్వ‌స్థ‌ల‌మైన గుజ‌రాత్‌లోని పోర్‌బంద‌ర్‌ను సంద‌ర్శించాల్సిందిగా పిలుపునిచ్చారు. ఇక్క‌డ ఎన్నో సంవ‌త్సరాల క్రిత‌మే వ‌ర్ష‌పునీటిని సంర‌క్షించేందుకు భూగ‌ర్భ ట్యాంకులు నిర్మించార‌న్నారు.

వాతావ‌ర‌ణ మార్పులు, విప‌త్తుల‌పై పోరాటానికి కేవ‌లం రెండే మార్గాలున్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.ఇందులో ఒక‌టి విధానాలు, చ‌ట్టాలు, నిబంధ‌న‌లు, ఆదేశాల‌ని ఆయ‌న అన్నారు. ఇందుకు ప్ర‌ధాన‌మంత్రి ప‌లు ఉదాహ‌ర‌ణ‌లు ఇచ్చారు. శిలాజేత‌ర ఇంధ‌న వ‌న‌రుల కు సంబంధించి భార‌త‌దేశ‌పు విద్యుత్ స్థాపిత సామ‌ర్ధ్యం 38 శాతం పెరిగిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ఏప్రిల్ 2020 నుంచిభార‌త్ -6 ఉద్గారాల నిబంధ‌న‌ల‌ను పాటిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఇది యూరో -6 ఇంధ‌నానికి స‌మాన‌మ‌న్నారు.

ఇండియా ప్ర‌స్తుతం స‌హ‌జ‌వాయువు వాటాను ప్ర‌స్తుత 6 శాతం నుంచి 2030 నాటికి 15 శాతానికి పెంచేందుకు కృషిచేస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ఇటీవ‌ల ప్రారంభించిన నేష‌న‌ల్ హైడ్రోజ‌న్ మిష‌న్‌, పి.ఎం. కుసుమ్ ను కూడా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. ఇవి వికేంద్రీకృత సౌర విద్యుత్ ఉత్ప‌త్తి న‌మూనాను ప్రోత్స‌హిస్తాయి.అయితే వాతావ‌ర‌ణ మార్పుపై పోరాటానికి అత్యంత శ‌క్తిమంత‌మైన విధానం, ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు తీసుకురావ‌డ‌మేన‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మ‌న‌ల్ని మ‌నం బ‌ద్ధుల‌ను చేసుకోవాల‌ని , దీనితో ప్ర‌పంచం బాగుంటుంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు అనేది మ‌న  సంప్ర‌దాయ అల‌వాట్ల‌లో కీల‌క‌భాగ‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ఇది క‌రుణ‌తో వినియోగాన్ని నేర్పుతుంద‌న్నారు. ఆలొచ‌నార‌హితంగా అన‌వ‌సరంగా వాడిపడేసే సంస్కృతి మ‌న‌ది కాద‌ని ఆయ‌న అన్నారు. భార‌తీయ రైతులు గ‌ర్వ‌కార‌ణ‌మైన వార‌ని ప్ర‌ధాని అన్నారు. రైతులు నిరంత‌రం నీటిపారుద‌ల‌కు సంబంధించి ఆధునిక టెక్నిక్‌లు వాడుతున్నార‌న్నారు. అలాగే భూసారాన్ని మెరుగు ప‌ర‌చ‌డంపై ప్ర‌జ‌ల‌లో చైత‌న్యం పెరుగుతున్న‌ద‌ని ఇది పురుగుమందుల వాడకాన్ని త‌గ్గిస్తున్న‌ద‌ని అన్నారు.

ప్ర‌పంచం ఇవాళ  ఫిట్‌నెస్‌, వెల్‌నెస్‌పై దృష్టి కేంద్రీక‌రిస్తున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.అలాగే ఆరోగ్య‌వంత‌మైన‌, ఆర్గానిక్ ఫుడ్‌కు డిమాండ్ పెరుగుతున్న‌ద‌న్నారు.  అంత‌ర్జాతీయంగా వ‌స్తున్న మార్పును భార‌త‌దేశం మ‌న వంట‌కాలు, మ‌న ఆయుర్వేద ఉత్ప‌త్తుల‌తో ముందుకు తీసుకుపోవ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. ఇండియాలో ప్ర‌భుత్వం, 27 ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌లో ప‌ర్యావ‌ర‌ణ హిత ప్ర‌యాణం కోసం మెట్రో నెట్ వ‌ర్క్‌ల పై కృషి చేస్తున్న‌ట్టు చెప్పారు.

పెద్ద ఎత్తున ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు తీసుకురావ‌డానిఇక మ‌నం వినూత్న‌మైన ,చ‌వ‌క అయిన , ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం క‌లిగిన ప‌రిష్కారాల‌ను చూప‌వ‌ల‌సి ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ఎల్ఇడి బ‌ల్బులు, గివ్ ఇట్ అప్ ఉద్య‌మం, ఎల్‌.పి.జి క‌వ‌రేజ్ పెంపు, చ‌వ‌క ర‌వాణా వంటి వాటిని ప్ర‌స్తావించారు. దేశ‌వ్యాప్తంగా ఇథ‌నాల్‌కు ఆమోద‌యోగ్య‌త పెరుగుతుండ‌డం ప‌ట్ల ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు.

గ‌డచిన ఏడు సంవ‌త్స‌రాల‌లో ఇండియా అట‌వీ ప్రాంతం చెప్పుకొద‌గిన స్థాయిలో పెరిగింద‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. సింహాలు, పులులు, చిరుత‌ల బాగా పెరిగాయ‌న్నారు. ఇవి సానుకూల ప్ర‌వ‌ర్త‌న మార్పుల‌కు సంకేతాల‌ని గుర్తుచేశారు.

మ‌హాత్మాగాంధీ ప్ర‌వ‌చించిన ట్ర‌స్టీషిప్ సూత్రం గురించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. ట్ర‌స్టీషిప్ లో కీల‌క‌మైన‌ది స‌మిష్టిత‌త్వం,క‌రుణ‌, బాధ్య‌త అన్నారు. ట్ర‌స్టీషిప్ అంటే వ‌న‌రుల‌ను బాధ్య‌తాయుతంగా వాడ‌డ‌మ‌న్నారు. తార్కికంగా, ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగా ఆలోచించేందుకు ఇది త‌గిన స‌మ‌య‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.ఇది మీకు , నాకు మాత్ర‌మే సంబంధించిన‌ది కాద‌ని ఇది మ‌న విశ్వ భ‌విష్య‌త్తుకు సంబంధించిన‌దని ప్ర‌ధాన‌మంత్రిఅన్నారు. రాబోయే త‌రాల‌కు మ‌నం రుణ‌ప‌డి ఉన్నామ‌న్నారు.

 

*****

 


(Release ID: 1702858) Visitor Counter : 204