ప్రధాన మంత్రి కార్యాలయం

భారత ఆటబొమ్మల ప్రదర్శన 2021 ని ప్రారంభించిన - ప్రధానమంత్రి

స్వావలంబన భారత్ నిర్మాణానికి, భారత ఆటబొమ్మల ప్రదర్శన-2021 ఒక ముందడుగు : ప్రధానమంత్రి

పర్యావరణానికీ, మానసిక విజ్ఞానానికీ అనువుగా బొమ్మలను తయారు చేయాలి : ప్రధానమంత్రి

గొప్ప బొమ్మలు తయారుచేసే సంప్రదాయం, సాంకేతికత, భావనలతో పాటు, సామర్థ్యం భారతదేశానికి ఉన్నాయి : ప్రధానమంత్రి

Posted On: 27 FEB 2021 1:01PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, భారత ఆటబొమ్మల ప్రదర్శన-2021 ని ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో - కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ; కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ కూడా పాల్గొన్నారు.  ఈ ఆటబొమ్మల ప్రదర్శన 2021 ఫిబ్రవరి,  27వ తేదీ నుండి 2021 మార్చి, 2వ తేదీ వరకు జరుగుతుంది. ఈ ప్రదర్శనలో, దాదాపు వెయ్యి మందికి పైగా ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు.

కర్ణాటకలోని చెన్నపట్నం, ఉత్తర ప్రదేశ్ ‌లోని వారణాసి, రాజస్థాన్ ‌లోని జైపూర్ ‌ల నుండి వచ్చిన బొమ్మల తయారీదారులతో, ప్రధానమంత్రి ఈ సందర్భంగా, మాట్లాడారు. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులను ప్రోత్సహించడం కోసం, బొమ్మల తయారీ మరియు సోర్సింగ్ కోసం భారతదేశాన్ని తదుపరి ప్రపంచ కేంద్రంగా ఎలా చేయవచ్చో, చర్చించడానికి, ప్రభుత్వం మరియు పరిశ్రమలు, ఈ ఆటబొమ్మల ప్రదర్శన ద్వారా, కలిసి ముందుకు రావాలి.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, భారతదేశంలో నిబిడీకృతమై ఉన్న బొమ్మల పరిశ్రమ సామర్థ్యాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయాలని,  స్వావలంబన భారత్ ప్రచారంలో ఒక పెద్ద భాగంగా, ఈ రంగానికి ఒక గుర్తింపును సృష్టించాలని, పిలుపునిచ్చారు. ప్రప్రధమంగా ప్రారంభించిన ఈ బొమ్మల ఉత్సవం కేవలం వ్యాపారం లేదా ఒక ఆర్థిక సంఘటన కాదనీ,  ఈ కార్యక్రమం దేశంలోని క్రీడలు మరియు ఉల్లాస భరిత సంస్కృతిని బలోపేతం చేసే, ఒక అనుసంధాన ప్రక్రియ అని ఆయన వ్యాఖ్యానించారు.  బొమ్మల రూపకల్పన, ఆవిష్కరణ, సాంకేతికత, మార్కెటింగ్, ప్యాకేజింగ్ గురించి చర్చించడానికీ, అదేవిధంగా, వారి అనుభవాలను పంచుకోడానికీ, ఈ బొమ్మల ప్రదర్శన, ఒక వేదిక అని, ఆయన, అభివర్ణించారు. సింధు లోయ నాగరికత, మొహెంజో-దారో, హరప్ప కాలం నుండి బొమ్మల తయారీపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగాయని, ఆయన, తెలియజేశారు.

పురాతన కాలంలో, ప్రపంచంలోని వివిధ దేశాల నుండి ప్రయాణికులు భారతదేశానికి వచ్చినప్పుడు, వారు భారతదేశంలో క్రీడలను నేర్చుకుని, వాటిని, వారితో పాటు తీసుకువెళ్ళేవారు, అని ప్రధానమంత్రి, గుర్తు చేసుకున్నారు.  ఈ రోజు ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందిన చెస్ క్రీడను, ఇంతకు ముందు భారతదేశంలో 'చతురంగ లేదా చదురంగ' గా ఆడారు. ఆధునిక లూడోను అప్పుడు 'పచ్చీస్' గా ఆడారు. మన ప్రాచీన గ్రంథాల్లో, బాల రామ్ వద్ద చాలా బొమ్మలు ఉన్నట్లు వివరించబడిందని, ఆయన, తెలిపారు.  గోకులంలో, గోపాల కృష్ణుడు తన స్నేహితులతో ఇంటి బయట గాలి గుమ్మటంతో ఆడుకునేవాడు.  మన పురాతన దేవాలయాలపై - ఆటలు, అట బొమ్మలు, హస్త కళలు కూడా, శిల్పాలుగా చెక్కబడ్డాయి.

మన దేశంలో తయారుచేసిన ఆట బొమ్మలు పిల్లల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడ్డాయని ప్రధానమంత్రి అన్నారు. పునర్వినియోగం మరియు రీసైక్లింగ్ అనేవి, భారతీయ జీవనశైలిలో ఒక భాగమనీ, ఇది మన బొమ్మల్లో కూడా కనిపిస్తుందని ఆయన చెప్పారు.  చాలా భారతీయ ఆట బొమ్మలు సహజ మరియు పర్యావరణ అనుకూల వస్తువుల నుండి తయారవుతాయి. వాటిలో ఉపయోగించే రంగులు కూడా సహజమైనవి మరియు సురక్షితమైనవి.  ఈ బొమ్మలు మన చరిత్ర, సంస్కృతితో మనస్సును అనుసంధానిస్తాయి. అదేవిధంగా, సామాజిక, మానసిక అభివృద్ధి మరియు భారతీయ దృక్పథాన్ని పెంపొందించడంలో కూడా ఇవి సహాయపడతాయని ఆయన వివరించారు.  పర్యావరణ శాస్త్రం మరియు మనస్తత్వశాస్త్రం రెండింటికీ అనువుగా, మంచి ఆట బొమ్మలను తయారు చేయాలని దేశంలోని ఆట బొమ్మల తయారీదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు!  ఆట బొమ్మల తయారీలో తక్కువ ప్లాస్టిక్ వాడాలనీ, రీసైకిల్ చేయగలిగే పదార్ధాలనే ఉపయోగించాలనీ, ఆయన వారిని కోరారు.

ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా, ప్రతి రంగంలో, భారతీయ దృక్పథం గురించీ, భారతీయ ఆలోచనల గురించీ, మాట్లాడుతున్నారని, ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.  మన భారతీయ క్రీడలు, ఆట బొమ్మల ప్రత్యేకత ఏమిటంటే, వాటిలో జ్ఞానం, సైన్స్, వినోదం, విజ్ఞానం మరియు మనస్తత్వశాస్త్రం కలిసి ఉంటాయని, ఆయన తెలిపారు.  పిల్లలను లట్టుతో ఆడించేటప్పుడు, వారికి గురుత్వాకర్షణ, సమతుల్యత అనే పాఠాలు నేర్పుతారని, ఆయన అన్నారు.  పజిల్ బొమ్మలు వ్యూహాత్మక ఆలోచనలను, సమస్యల పరిష్కారాలనూ అభివృద్ధి చేస్తాయని ఆయన చెప్పారు.  అదేవిధంగా, నవజాత శిశువులు కూడా చేతులు కదపడం, తిప్పడం ద్వారా వృత్తాకార కదలికను అనుభవిస్తూ ఉంటారు. 

సృజనాత్మక బొమ్మలు పిల్లల భావాలను పెంపొందిస్తాయనీ, వారి ఊహలకు రెక్కలు తొడుగుతాయనీ, ప్రధానమంత్రి చెప్పారు.  వారి ఊహలకు పరిమితి లేదు.  వారికి కావలసిందల్లా వారి ఉత్సుకతను సంతృప్తిపరిచే, వారి సృజనాత్మకతను మేల్కొల్పే ఒక చిన్న ఆట బొమ్మ మాత్రమే. పిల్లల అభ్యాస ప్రక్రియలో ఆట బొమ్మలు కీలక పాత్ర పోషిస్తున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలతో ఆడుకోవాలని ఆయన కోరారు.  ఆట బొమ్మల శాస్త్రం గురించే, పిల్లల అభివృద్ధిలో ఆట బొమ్మలు పోషిస్తున్న పాత్ర గురించీ, తల్లిదండ్రులు ముందుగా అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు.  అదేవిధంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా దీనిని ఉపయోగించాలని ప్రధానమంత్రి కోరారు. ఈ దిశగా, ప్రభుత్వం కూడా, సమర్థవంతమైన చర్యలు తీసుకుందనీ, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా తగిన మార్పులు తీసుకువచ్చిందనీ ఆయన తెలియజేశారు.

నూతన జాతీయ విద్యా విధానం గురించి, ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, ఈ విద్యావిధానంలో, పెద్ద ఎత్తున ఆట-ఆధారిత మరియు కార్యాచరణ-ఆధారిత విద్యను పొందుపరుస్తున్నట్లు, తెలియజేశారు.  ఇది ఒక విద్యావ్యవస్థ, దీనిలో పిల్లల్లో, తార్కిక మరియు సృజనాత్మక ఆలోచనల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది.  ఆట బొమ్మల రంగంలో, భారతదేశానికి సంప్రదాయం మరియు సాంకేతికత ఉంది, భారతదేశానికి భావనలు మరియు సామర్థ్యం ఉన్నాయి. మనం ప్రపంచాన్ని పర్యావరణ అనుకూల బొమ్మల వైపు తిరిగి తీసుకుని వెళ్ళవచ్చు. మన సాఫ్ట్-‌వేర్ ఇంజనీర్లు, కంప్యూటర్ గేమ్స్ ద్వారా, భారతదేశ కథలను ప్రపంచానికి వ్యాప్తి చేయగలరు. ఇవన్నీ ఉన్నప్పటికీ, ఈ రోజున, వంద బిలియన్ డాలర్లగా ఉన్న, ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారతదేశం వాటా చాలా తక్కువగా ఉంది.  దేశంలో 85 శాతం ఆట బొమ్మలు విదేశాల నుండే దిగుమతి అవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన నొక్కి చెప్పారు.

భారతదేశం, ఇప్పుడు 24 ప్రధాన రంగాలలో బొమ్మల పరిశ్రమను కూడా, ఒకటిగా చేర్చిందని, ప్రధానమంత్రి చెప్పారు. జాతీయ ఆట బొమ్మల కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధమయ్యింది. ఈ పరిశ్రమల్లో పోటీని పెంపొందించడానికీ, దేశాలను ఆట బొమ్మల తయారీలో స్వావలంబన దిశగా మార్చడానికీ, భారతీయ ఆట బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికీ, 15 మంత్రిత్వశాఖలను ఈ కార్యాచరణ ప్రణాళికలో భాగస్వాములను చేయడం జరిగింది. ఈ ప్రచారం ద్వారా, ఆట బొమ్మల తయారీ సమూహాలను అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలను సమాన భాగస్వామిగా చేయడం జరిగింది. ఈ ప్రయత్నాలతో పాటు, ఆట బొమ్మల పర్యాటక అవకాశాలను బలోపేతం చేయడానికి కూడా కృషి జరుగుతోందని, ఆయన చెప్పారు.  భారతీయ క్రీడా ఆధారిత బొమ్మలను ప్రోత్సహించడానికి, "టాయ్-థాన్-2021" కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా, 7000 కి పైగా ఆలోచనలకు రూపకల్పన జరిగింది. 

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ రోజు భారతదేశంలో తయారీకి డిమాండ్ ఉందంటే, భారతదేశంలో చేతితో తయారు చేసిన వస్తువులకు కూడా డిమాండ్ సమానంగా పెరుగుతున్నట్లే అని పేర్కొన్నారు.  ఈ రోజు ప్రజలు ఆట బొమ్మలను కేవలం ఒక ఉత్పత్తిగా మాత్రమే కొనడం లేదు, ఆ బొమ్మతో సంబంధం ఉన్న అనుభవంతో అనుసంధానం కావాలని కూడా కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.  అందువల్ల, మనం భారతదేశంలో చేతితో తయారు చేసిన వస్తువులను కూడా ప్రోత్సహించాలి.

 

*****


(Release ID: 1701455) Visitor Counter : 275