ప్రధాన మంత్రి కార్యాలయం

కేరళ లోని కొచ్చిలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన - ప్రధానమంత్రి మోదీ


అనేక రంగాలకు చెందిన పనులను ఈ రోజు ప్రారంభించడం జరిగింది; అవి భారతదేశ పురోభివృద్ధి కి మరింత బలాన్ని చేకూరుస్తాయి : ప్రధానమంత్రి

కేరళలో పర్యాటక సంబంధమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది : ప్రధానమంత్రి

గల్ఫ్ లో పనిచేసే భారతీయులకు ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంది : ప్రధానమంత్రి

తన విజ్ఞప్తికి ప్రతిస్పందించి, గల్ఫ్ లో భారతీయ సమాజం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు గల్ఫ్ దేశాలకు ధన్యవాదములు తెలియజేసిన - ప్రధానమంత్రి

Posted On: 14 FEB 2021 6:29PM by PIB Hyderabad

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ రోజు, కేరళ లోని కొచ్చి లో, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో - కేరళ గవర్నర్; కేరళ ముఖ్యమంత్రి; కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్; సహాయ మంత్రులు శ్రీ మనసుఖ్ మాండవీయ; శ్రీ మురళీధరన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, అనేక రంగాలకు చెందిన పనులను ఈ రోజు ప్రారంభించడం జరిగిందనీ, అవి భారతదేశ పురోభివృద్ధి కి మరింత బలాన్ని చేకూరుస్తాయనీ, పేర్కొన్నారు. ఈ రోజు ప్రారంభించిన ప్రొపిలీన్ డెరివేటివ్ పెట్రోకెమికల్ ప్రాజెక్టు (పి.డి.పి.పి), విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం ద్వారా, భారతదేశ ప్రయాణాన్ని స్వావలంబన దిశగా బలోపేతం చేయడానికి దోహదపడుతుందని ఆయన చెప్పారు. అనేక రంగాలకు చెందిన పరిశ్రమలు ప్రయోజనం పొందడంతో పాటు, ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి. అదేవిధంగా, రో-రో నౌకల వల్ల, రహదారిలో దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం, జలమార్గాల ద్వారా 3.5 కిలోమీటర్లకు తగ్గుతుంది. తక్కువ రద్దీ, మరింత సౌకర్యం, వాణిజ్యంతో పాటు, సామర్థ్యాన్ని పెంపొందించుకోడానికి వీలుకలుగుతుంది.

కేరళలో పర్యాటక సంబంధిత మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. కొచ్చిలోని అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్, "సాగరిక" ప్రారంభోత్సవం ఇందుకు ఒక ఉదాహరణ. సాగరిక క్రూయిజ్ టెర్మినల్ లక్ష కు పైగా సముద్రయానం చేసే అతిథులకు సేవలందించనుంది. అంతర్జాతీయ ప్రయాణాలపై మహమ్మారి సంబంధిత ఆంక్షల కారణంగా స్థానిక పర్యాటకం పెరిగిందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్థానిక పర్యాటక రంగంలో ఉన్నవారికి అదనపు జీవనోపాధితో పాటు, మన సంస్కృతి, మన యువత మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని ఆయన పేర్కొన్నారు. వినూత్న పర్యాటక సంబంధిత ఉత్పత్తుల గురించి ఆలోచించాలని, ఆయన, అంకురసంస్థలకు పిలుపునిచ్చారు. గత ఐదు సంవత్సరాలుగా భారతదేశంలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక రంగ ర్యాంకింగ్ సూచీ లో భారతదేశం, 65వ స్థానం నుంచి 34వ స్థానానికి మెరుగుపడిందని, ప్రధానమంత్రి తెలియజేశారు.

సామర్థ్య నిర్మాణం, భవిష్యత్తు కు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఈ రెండూ, దేశాభివృద్ధికి ముఖ్యమైన అంశాలని, ప్రధానమంత్రి చెప్పారు. ఈ రెండు అంశాలకు, 'విజ్ఞాన్ సాగర్' మరియు సౌత్ కోల్ బెర్త్ యొక్క పునర్నిర్మాణం కోసం ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధి పనులు, దోహదం చేస్తాయి. ముఖ్యంగా మెరైన్ ఇంజినీరింగ్ చదవాలనుకునే వారికి కోచిన్ షిప్ యార్డులో ఉన్న నూతన విజ్ఞాన ప్రాంగణం, "విజ్ఞాన్ సాగర్" ఎంతగానో ఉపయోగపడుతుంది. సౌత్ కోల్ బెర్త్ వల్ల సరకు రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు, సరకు రవాణా సామర్ధ్యం మెరుగుపడుతుంది. నేడు మౌలిక సదుపాయాల నిర్వచనం మరియు పరిధి మారాయని, ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఇది ఇప్పుడు కేవలం మంచి రోడ్లకు మించి, కొన్ని పట్టణ కేంద్రాల మధ్య అభివృద్ధి పనులు, అనుసంధానం వంటి వాటికి చెందినదిగా భావించాలి. జాతీయ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా 110 లక్షల కోట్ల రూపాయల మేర మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రధానమంత్రి తెలియజేశారు.

నీలి ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధికి దేశ ప్రణాళికను, శ్రీ మోదీ వివరిస్తూ, "ఈ రంగంలో మన ప్రణాళిక, పనులు : మరిన్ని నౌకాశ్రయాలు, ప్రస్తుత నౌకాశ్రయాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సముద్ర తీరానికి దూరంగా సామర్ధ్యం; స్థిరమైన తీరప్రాంత అభివృద్ధి మరియు తీరప్రాంతాల అనుసంధానం". అని చెప్పారు. మత్స్య సంపద యోజన గురించి, ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఇది మత్స్యకారుల సమాజాల విభిన్న అవసరాలను తీరుస్తుందని చెప్పారు. ఇది మరింతగా పరపతిని నిర్ధారించడానికి ఏర్పాట్లు కలిగి ఉంది. మత్స్యకారులను కిసాన్ క్రెడిట్ కార్డులతో అనుసంధానం చేయడం జరిగింది. అదేవిధంగా, సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు భారతదేశాన్ని ఒక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతోంది.

ఈ ఏడాది బడ్జెట్ లో కేరళకు ఎంతో మేలు చేకూరే పథకాలు, కేటాయింపులు ఉన్నాయని, ప్రధానమంత్రి చెప్పారు. ఇందులో కొచ్చి మెట్రో నిర్మాణం తదుపరి దశ కూడా ఉంది.

కరోనా సవాలుకు భారతదేశ స్ఫూర్తిదాయక ప్రతిస్పందనను ప్రస్తావిస్తూ, గల్ఫ్ లో నివసిస్తున్న భారతీయ సంతతి కుటుంబాలకు ప్రత్యేకంగా సహాయం చేయడానికి ప్రభుత్వం చేసిన కృషిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. గల్ఫ్ లో ఉన్న భారత సంతతి సమాజాన్ని చూసి భారతదేశం గర్వపడుతోందని ఆయన పేర్కొన్నారు. వందే భారత్ మిషన్ లో భాగంగా యాభై లక్షల మంది కంటే ఎక్కువగా భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. వారిలో చాలామంది కేరళకు చెందిన వారు ఉన్నారు. అక్కడ జైళ్ళలో మగ్గుతున్న పలువురు భారతీయులను విడుదల చేసేందుకు భారత ప్రభుత్వం చేసిన కృషి పట్ల సున్నిత వైఖరి అవలంబించిన వివిధ గల్ఫ్ దేశాలకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. "గల్ఫ్ దేశాలు, నా వ్యక్తిగత విజ్ఞప్తులకు ప్రతిస్ప౦ది౦చి, మన సమాజాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. భారతీయులను తిరిగి స్వదేశాలకు పంపించేందుకు వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రక్రియను సులభతరం చేయడానికి వీలుగా వ్యవస్థను ఏర్పాటు చేశాం. గల్ఫ్ లో పనిచేసే భారతీయుల సంక్షేమానికి నా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నదన్న విషయాన్ని వారు గుర్తించాల్సి ఉంది" అని ప్రధానమంత్రి చెప్పారు.


*****


 

 


(Release ID: 1698009) Visitor Counter : 250