హోం మంత్రిత్వ శాఖ

నిఘా.. నియంత్రణ.. అప్రమత్తతపై దేశీయాంగశాఖ మార్గదర్శకాలు

నియంత్రణ మండళ్ల వెలుపల మాత్రమే అన్ని కార్యకలాపాలకూ అనుమతి;

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యకలాపాలు.. కోవిడ్ అనుగుణ ప్రవర్తనపై నియంత్రణ చర్యలు, ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలు కొనసాగాల్సిందే

Posted On: 27 JAN 2021 6:11PM by PIB Hyderabad

 

  • దేశవ్యాప్తంగా నిఘా, నియంత్రణ, అప్రమత్తతలపై మార్గదర్శకాలను దేశీయాంగ మంత్రిత్వశాఖ ఇవాళ జారీచేసింది. ఇవి 2021 ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీవరకూ అమలవుతాయి.
  • కోవిడ్-19పై పోరులో సిద్ధించిన గణనీయ ఫలితాలను సుస్థిరం చేసుకోవడమే ఈ మార్గదర్శకాల ప్రధాన లక్ష్యం. దేశంలో గత నాలుగు నెలలుగా చురుకైన, తాజా కేసుల సంఖ్య క్రమంగా క్షీణించడమే ఇప్పటిదాకా సాధించిన విజయాలకు రుజువు. ఆ మేరకు మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే దిశగా అప్రమత్తతసహా నిఘా, నియంత్రణలకు నిర్దేశించిన ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలను కఠినంగా పాటించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖలు జారీచేసిన మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.

నిఘా... నియంత్రణ

  • నిఘా... నియంత్రణలకు సంబంధించి కేంద్ర హోం, ఆరోగ్యశాఖల మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా అధికారులు అవసరమైతే నియంత్రణ మండళ్లను సూక్ష్మస్థాయిలో జాగ్రత్తగా గుర్తించి ప్రకటించాలి. అటుపైన సదరు మండళ్లలో నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలి.
  • నిర్దేశిత నియంత్రణ చర్యలు కచ్చితంగా అమలయ్యేలా ఆయా జిల్లా, పోలీసు, పురపాలక అధికారులు బాధ్యత వహించాలి. అంతేకాకుండా సంబంధిత అధికారులు జవాబుదారీతనంపై రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు శ్రద్ధ చూపాలి.

కోవిడ్ అనుగుణ ప్రవర్తన

  • కోవిడ్ అనుగుణ ప్రవర్తన ప్రోత్సహించడంతోపాటు మాస్కుల ధారణ, చేతుల పరిశుభ్రత, భౌతిక దూరం పాటింపు తదితరాలపై రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలి.
  • కోవిడ్ అనుగుణ ప్రవర్తనపై జారీచేసిన జాతీయ కోవిడ్-19 నిర్వహణ ఆదేశాలు దేశవ్యాప్తంగా కొనసాగించేలా చూసుకోవాలి.

నిర్దిష్ట ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలకు కచ్చితంగా కట్టుబాటు

  • నియంత్రణ మండళ్ల వెలుపల అన్ని కార్యకలాపాలకూ అనుమతి ఉంటుంది... కానీ, కింది అంశాలపై మాత్రం ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలకు కచ్చితంగా కట్టుబడాలి.
  • సామాజిక/ఆధ్యాత్మిక/క్రీడా/వినోద/విద్యా/సాంస్కృతిక/మతపరమైన కార్యకలాపాలు నిర్వహించే బహిరంగ ప్రదేశ సామర్థ్యంలో 50 శాతందాకా జన సమీకరణ ఇప్పటికే అనుమతించబడింది. అలాగే మూసి ఉండే ప్రదేశాల్లోనూ 200 మందికి మించకుండా జనంతో కార్యకలాపాలకు అనుమతి ఉంది. అయితే, ప్రస్తుతం ఆయా రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలను అనుసరించే వీలుంటుంది.
  • సినిమా హాళ్లు, థియేటర్లలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో ప్రదర్శనలకు ఇప్పటికే అనుమతి ఇవ్వబడింది. అయితే, ఇకపై మరికొంత అదనపు ప్రేక్షక సంఖ్యకు అనుమతి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖను సంప్రదించి సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ కొత్త మార్గదర్శకాలు జారీచేయనుంది.
  • ఈత కొలనుల నిర్వహణకు ఇప్పటికే అనుమతించిన నేపథ్యంలో ఇప్పుడు అన్ని వర్గాల వినియోగదారులకూ అనుమతి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర హోంశాఖను సంప్రదించి యువజన-క్రీడా వ్యవహారాల శాఖ సవరించిన మార్గదర్శకాలు జారీచేస్తుంది.
  • వ్యాపారంతో వ్యాపారం మధ్య ప్రదర్శన మందిరాలకు ఇప్పటికే అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అన్నిరకాల ప్రదర్శన మందిరాలకూ అనుమతి ఉంటుంది. దీనిపై కేంద్ర హోంశాఖను సంప్రదించి వాణిజ్య మంత్రిత్వశాఖ సవరించిన మార్గదర్శకాలు జారీచేస్తుంది.
  • మరోవైపు అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతిపై కేంద్ర హోంశాఖను సంప్రదించి, పౌర విమానయాన మంత్రిత్వశాఖ పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది.
  • వివిధ కార్యకలాపాలకు సంబంధించి ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలు ఎప్పటికప్పుడు నవీకరించబడతాయి. ఈ మేరకు ప్రయాణ రైళ్ల రాకపోకలు; విమాన ప్రయాణం; మెట్రో రైళ్లు; ఉన్నత విద్యాసంస్థలు; హోటళ్లు-రెస్టారెంట్లు; షాపింగ్ మాల్స్; మల్టీప్లెక్సులు, వినోద పార్కులు; యోగా కేంద్రాలు; వ్యాయామశాలలు తదితరాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలు కచ్చితంగా అమలయ్యేలా సంబంధిత అధికారవర్గాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

స్థానిక ఆంక్షలు

  • రాష్ట్రాల పరిధిలో, రాష్ట్రాల నడుమ వ్యక్తులు, వస్తురవాణాపై ఎలాంటి ఆంక్షలూ లేవు. అలాగే భూ-సరిహద్దుల పరిధిలోని పొరుగు దేశాలతోనూ వాణిజ్యంపై ఆంక్షలేవీ లేవు. వీటికి సంబంధించి ప్రత్యేక అనుమతి/ఆమోదం/ఎలక్ట్రానిక్-అనుమతుల అవసరం ఉండదు.

దుర్బల వ్యక్తులకు రక్షణ

  • దేశంలో 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, ఇతరత్రా అనారోగ్యాలున్న వారు, గర్భిణులు, పదేళ్లలోపు పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించబడింది.

ఆరోగ్య సేతు వినియోగం

  • దేశవ్యాప్తంగా ఆరోగ్య సేతు అనువర్తన వినియోగాన్ని ప్రోత్సహించాలి.

 

****


(Release ID: 1692765) Visitor Counter : 268