రాష్ట్రప‌తి స‌చివాల‌యం

72వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాధ్ కోవింద్ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం

Posted On: 25 JAN 2021 7:41PM by PIB Hyderabad

 

ప్రియమైన సహ పౌరులారా,

నమస్కారం,

 

1.      ప్రపంచంలోకెల్లా అతి పెద్దది, ఎంతో చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మన ఈ భూమిలో భిన్నత్వంతో సుసంపన్నమైన, అనేక పండుగలతో, మన జాతీయ పండుగలను ప్రతి ఒక్కరం గొప్ప దేశభక్తితో జరుపుకుంటాము. జాతీయ పండుగైన గణతంత్ర దినోత్సవాన్ని మనం ఆనందంతో జరుపుకుంటాము. మన జాతీయ జెండాను గౌరవించుకుంటూ, ఆనందంతో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము.

2.     దేశ విదేశాలలో నివసిస్తున్న భారతీయులందరికీ ఈ రోజు ఎంతో ముఖ్యమైన దినం. 71 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారత ప్రజలమైన మనం మన కోసం మనకు మనమే విశిష్టమైన రాజ్యాంగాన్ని ఆమోదించి, చట్టబద్ధం చేసుకున్నాం. ఈనాడు మనందరం కూడా రాజ్యాంగం నిర్దేశించిన మౌలిక విలువలకు నిబద్దులమై ఉండాలి. మన రాజ్యాంగ పీఠికలో పొందుపరచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఈ విలువలు మన అందరికీ పవిత్రమైనవి. వీటిని అమలు చేసే వారే కాకుండా ప్రజలందరూ కూడా వాటికి బద్దులై ఉండాలి.

3.     మన ప్రజాస్వామ్య సౌధం నిలబడి ఉన్న పునాదిని నిర్మించేందుకు రాజ్యాంగం మొదటిలోనే ఈ నాలుగు అంశాలను చేర్చాలని మన రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించుకోవడానికి కారణముంది. వాస్తవానికి ఈ విలువలే మన స్వాతంత్య్ర పోరాటానికి, మార్గనిర్దేశనం చేశాయి. బాల గంగాధర తిలక్, లాలా లజపతి రాజ్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్ర బోస్ వంటి గొప్ప నాయకులు, మేధావుల కూటమి స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రభావితం చేశారు. మాతృభూమి యొక్క బ్రహ్మాండమైన భవిష్యత్ కోసం వారు విభిన్న కలలు కన్నారు. వారికి ఉన్న ఉమ్మడి ఆకాంక్షలు: న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలే.

4.     మనం ఇంకొంచెం వెనక్కి వెళ్ళి చూడాలని, మన జాతి నిర్మాతలను ఈ అమూల్యమైన విలువలు ఎందుకు మార్గనిర్దేశనం చేశాయో తెలుసుకోవాలని నేను భావిస్తున్నాను. మరి సమాధానం విస్పష్టమే. ఈ నేల, ఈ నేల మీద నివసించినవారు అనాది నుంచి ఈ గొప్ప ఆదర్శాలను ఆచరించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి మన జీవనతత్వంలోని శాశ్వత విలువలు. ఈ సూత్రాలు మనకు నిరంతరాయంగా నాగరికత ఆరంభం నుంచి వచ్చాయి. అయితే, ప్రతి తరంలోనూ ఈ విలువల భావాన్ని కాలానుగుణంగా అర్థం చేసుకోవాలి. తమ తరంలో స్వాతంత్య్ర సమరయోధులు అర్థం చేసుకున్నట్లే మనం కూడా వీటిని అర్థం చేసుకుని ఉపయోగించుకోవాలి. ఈ ముఖ్య విలువలు మన అభివృద్ధి పథాన్ని దేదిప్యమానం చేస్తాయి.

 

ప్రియమైన సహ పౌరులారా,

 

5.     ప్రతి భారతీయుడు మన రైతులకు వందనం సమర్పించాలి. వారు మన విశాలమైన, జన బాహుళ్యమైన దేశాన్ని ఆహార ధాన్యాలు, పాడి ఉత్పత్తులలో స్వయం సమృద్ధం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, అనేక ఇతర సవాళ్ళు, కొవిడ్-19 మహమ్మారి ఎదురైనప్పటికీ మన రైతులు వ్యవసాయ ఉత్పత్తులను సుస్థిరం చేశారు. మన గొప్ప దేశం మన రైతుల సంక్షేమానికి సంపూర్ణ నిబద్ధతతో కట్టుబడి వుంది.

6.     కష్ట జీవులైన మన రైతులు ఆహార భద్రతను కాపాడినట్లే మన సాయుధ దళాల వీర జవాన్లు సంక్లిష్టమైన పరిస్థితులలో కూడా మన దేశ సరిహద్దులను కాపాడుతున్నారు. లద్దాఖ్ లోని సియాచిన్, గాల్వన్ లోయలో గడ్డకట్టే చలి మైనస్ 50 నుంచి 60 డిగ్రీల సెల్సియస్  ఉష్ణోగ్రతకు పడిపోయినా, జైసల్మేర్ లో మండుటెండలు అత్యధికంగా 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు పెరిగినా, నేలపై, ఆకాశంలో, విశాల తీర ప్రాంతాలలో మన సైనిక యోధులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. మన సైనికుల ధైర్య సాహసాలు, దేశభక్తి, త్యాగ స్ఫూర్తి పట్ల ప్రతి పౌరుడు గర్వపడుతున్నాడు.

7.     ఆహార భద్రత, జాతీయ భద్రత, రోగాలు, విపత్తుల నుంచి రక్షణ, వివిధ అభివృద్ధి రంగాలలో తమ సేవల ద్వారా మన శాస్త్రవేత్తలు మన జాతీయ ప్రయత్నాలను పటిష్టం చేశారు. అంతరిక్షం నుంచి పరిశ్రమల వరకు, విద్యా సంస్థల నుంచి ఆసుపత్రులు వరకు శాస్త్రవేత్తల సమాజం మన జీవనం, కృషిని బలోపేతం చేసింది. కొరోనా వైరస్ ను ఛేదించేందుకు మన శాస్త్రవేత్తలు రేయింబవళ్ళు కృషి చేస్తున్నారు. రికార్డు సమయంలో వాక్సిన్ అభివృద్ధి చేయడంలో వారు సఫలీకృతులయ్యారు. ఈ ఫలితంతో మన శాస్త్రవేత్తలు మానవ జాతి సంక్షేమ సేవలో ఈ వైభవోపేతమైన అధ్యయనాన్ని జోడించారు. వైరస్ ను అరికట్టడంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో మృతుల సంఖ్యను తక్కువ చేయడంలో డాక్టర్లూ, అధికారులు, ఇతర జీవన రంగాలకు చెందిన వారు పెద్ద సేవనందించారు.  ఆ విధంగా మన రైతులందరూ, సైనికులు, శాస్త్రవేత్తలు ప్రత్యేక అభినందలకు పాత్రులు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన గొప్ప దేశం వారికి శుభాకాంక్షలు తెలుపుతోంది.

 

ప్రియమైన సహ పౌరులారా,

 

8.     గత సంవత్సరం కనీవినీ ఎరుగని ఒక పెను విపత్తు ఎదురవ్వడంతో మానవజాతి దాదాపుగా స్తంభించి పోయింది. దీంతో నేను భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని తరచూ మననం చేసుకుంటూ ఉన్నాను. సౌభ్రాతృత్వమనే మన రాజ్యాంగ విలువ లేకపోతే మహమ్మారికి మన సమర్ధవంతమైన స్పందన సాధ్యమయ్యేది కాదు. భారతీయులు దగ్గరగా అల్లిన గూడు వంటి సన్నిహిత కుటుంబాలు. కరోనా వైరస్ వంటి ఉమ్మడి శత్రువును ఎదుర్కోవడంలో ఒకరినొకరు రక్షించుకునేందుకు ఎంతటి త్యాగానికైనా వెరవరు. నేను ఇక్కడ మాట్లాడుతున్నది కొవిడ్-19 రోగులకు చికిత్సను అందించడంలో తమ ప్రాణాలను అడ్డుపెట్టిన డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్, ఆరోగ్య రక్షణ సేవాధికారులు, పారిశుద్ధ్య కార్మికులు గురించి. వారితో పాటు దాదాపు 1.5 లక్షల మంది ఈ మహమ్మారికి బలి అయ్యారు. ఈ మృతుల కుటుంబాలకు నేను సంతాపం తెలియజేస్తున్నాను. మన ఫ్రంట్ లైన్ కరోనా యోధులు సాధారణ ప్రజలైనా అసాధారణ సేవలందించారు. ఇంకా ముగియని ఈ చారిత్రాత్మక విషాద అధ్యయనం వ్రాసినప్పుడు ఆకస్మికంగా ఎదురయ్యే ఇటువంటి సంక్షోభాన్ని మన భావి తరాలు సాహసంతో ఎదుర్కొని మీ అందర్నీ రక్షిస్తారని నేను విశ్వాసంతో ఉన్నాను.

9.     మన దేశ జన సాంద్రత, సాంస్కృతిక, సంప్రదాయ భిన్నత్వం, ప్రకృతి, భౌగోళిక సవాళ్ళను బట్టి చూస్తే కొవిడ్-19 కి వ్యతిరేకంగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా కష్టతరమైన పని. అయినా, ఈ వైరస్ విస్తృతంగా వ్యాపించకుండా నిరోధించడంలో మనం కృతకృత్యులమయ్యాము.

10.    తీవ్రమైన విపత్తులు వచ్చినప్పటికీ అనేక రంగాలలో మన కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్ళడంలో మనం సఫలమయ్యాము. ఈ మహమ్మారి మన యువతరం చదువుల ప్రకియను కుదేలు చేసినప్పటికీ విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు వెను వెంటనే నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యలో ఎటువంటి అవరోధం లేకుండా చూశారు. అధిక జన సాంద్రత కలిగిన బీహార్ లోనూ, గమ్యం చేరుకోవడంలో కష్టాలు, సవాళ్ళు ఎదురయ్యే కేంద్రపాలిత ప్రాంతం జమ్ము, కాశ్మీర్, లద్దాఖ్ లలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగానే కాకుండా సురక్షితంగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా మన ప్రజాస్వామ్యం, మన ఎన్నికల కమిషన్ శ్లాఘనీయమైన కసరత్తును పూర్తి చేశాయి. జ్యుడీషరీ సాంకేతిక సహాయాన్ని గుర్తించి ఉపయోగించుకుంటూ న్యాయం అందిస్తోంది. ఇలా చెప్పాలంటే ఎన్నో.

11.     ప్రజల ప్రాణాలకు ముప్పులేకుండా ఆర్థిక వ్యవస్థను తెరవడంలో అన్ లాకింగ్ ప్రక్రియను జాగ్రత్తగా ఆచితూచి అమలు చేశారు. ఇది సత్ఫలితాలు ఇచ్చింది. ఆర్థిక వ్యవస్థ, ఊహించిన దానికంటే కూడా త్వరగా కోలుకుంటున్న సూచనలు కనిపించాయి. తాజాగా అసాధారణరీతిలో జి.ఎస్.టి. కలెక్షన్, విదేశీ పెట్టబడులకు అత్యంత ప్రాధాన్యం గల దేశంగా భారతదేశం ఆవిర్భవించడం మన ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకోవడాన్ని సూచిస్తున్నాయి. ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తిని కలిగించి, వినూత్న వాణిజ్య ఆలోచనలతో ముందుకు వచ్చేందుకు ప్రభుత్వం సులభతర రుణాలు అందించడం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించింది.

 

ప్రియమైన సహ పౌరులారా,

 

12.     గత సంవత్సరపు విపరీతమైన పరిస్థితులు – మానవత్వం పట్ల మన భద్రత, ఆందోళన, సౌభ్రాతృత్వం భావనలను ఎల్లప్పుడూ గుండెల్లో పెట్టుకోవడం వల్లే సహస్రాబ్ధాలుగా మనం కలిసి ఉంటున్నామనే విషయాన్ని గుర్తు చేశాయి. ప్రతిరంగంలో భారతీయులు సందర్భాన్ని బట్టి ముందుకు వచ్చారు. తమ కంటే ముందు ఇతరుల క్షేమం కాంక్షించారు. మానవత్వం కోసం భారతీయులు బ్రతుకుతారు మరణిస్తారు. ఈ భారతీయ ఆదర్శాలను మహాకవి మైథిలి శరణ్ గుప్త్ ఈ అక్షరాలలో వివరించారు.

उसी उदार की सदा, सजीव कीर्ती कूजती

तथा उसी उदार को, समस्त सृष्टि पूजती.

अखण्ड आत्मभाव जो, असीम विश्व मेँ भरे,

वही मनुष्य है कि जो, मनुष्य के लिये मरे.

 

దీని భావం

                “దివ్యమైన గేయాలలో ఎవరి కీర్తి శాస్వతంగా నిలిచి ఉంటుందో వారిదే దయ

                   ఎవరిని ప్రపంచం ఎప్పటికీ గౌరవిస్తుందో వారిదే ఔదార్యం,

                   ఎవరి ఏకత్వ స్ఫూర్తి ఎల్లలు లేని ప్రపంచాన్ని నింపుతుందో,

                   ఎవరు తోటి వారికోసం మరణిస్తారో వారే నిజమైన మానవులు.”

 

మానవత్వం కోసం ప్రేమ, త్యాగ నిరతిలు మనలను ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళతాయన్న విశ్వాసం నాకు ఉంది.

13.    2020 సంవత్సరం నుంచి చాలా నేర్చుకున్నామని, భావిస్తున్నాను. ప్రకృతి మాత పునరుజ్జీవనం అద్భుతాలు జరిగాయి. చిన్న చిన్న ప్రయత్నాలు కూడా పెద్దవాటికి ఏ మాత్రం తీసిపోవనేలా ఆ అద్భుతాలు మానవత్వానికి కఠినమైన పాఠం నేర్పాయి. ఇటువంటి మహమ్మారీల బెడదను తగ్గించుకునే దృష్టితో అంతర్జాతీయ స్థాయిలో వాతావరణ మార్పు అంశానికి పెద్ద పీట వేయాలని నేను ఖచ్చితంగా చెబుతున్నాను.

 

ప్రియమైన సహ పౌరులారా,

 

14.     సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటూ ప్రధాన మంత్రి ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ లేదా ‘భారత్ స్వయం సమృద్ధ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మన చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం వ్యాపారపరంగా కష్టపడి పని చేసే ప్రతిభావంతులైన మన ప్రజలు ముఖ్యంగా యువత – స్వయం సమృద్ధమైన భారతాన్ని మలచడంలో మన కృషికి శక్తినిస్తారు. దేశంలో వస్తు సేవలకు ఉన్న డిమాండ్, వాటికి అనుగుణంగా దేశీయంగా జరిగే కృషి ఈ ప్రయత్నాలలో ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం ఉపయోగం – ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ ను పటిష్ట పరుస్తున్నాయి. ఈ మిషన్ కింద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా అంకుర పరిశ్రమలకు వెన్నుదన్నును మరింత పెంచడం ద్వారా ఆర్థికవృద్ధికే కాదు ఉపాధికల్పనకు కూడా చర్యలు చేపట్టడం జరిగింది. దీనిని ప్రజలే తమకు తాము ముందుకు తీసుకెళ్ళే ఉద్యమం అయింది.

15.     మన దేశం 75 వసంతాలు పూర్తి చేసుకునే 2022 సంవత్సరం కల్లా నూతన భారతాన్ని మలచడానికి అనుగుణంగా ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ రూపొందింది. ప్రతి కుటుంబానికి కనీస అవసరాలతో పక్కా ఇళ్ళ నిర్మాణం నుంచి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం వరకు పెద్ద లక్ష్యాలను సాధించాలన్న మన కృతనిశ్చయాన్ని బట్టి జాతి ప్రయాణంలో ఇది ఒక ప్రత్యేకమైన మైలురాయి అవుతుంది. సంలీన నూతన భారత సమాజాన్ని నిర్మించడంలో విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, నిరుపేదల అభ్యున్నతి, మహిళల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాము.

16.    అప్పుడప్పుడు విపత్కర పరిస్థితులు గొప్ప ఉపాధ్యాయుని పాత్రను పోషిస్తాయి. ఇవి మనలను మరింత పటిష్టపరచి మరింత విశ్వాసం కల్పిస్తాయి. అనేక రంగాలలో భారత దేశం గొప్ప శిఖరాలను అధిరోహించింది. ఆర్థిక సంస్కరణలు ముందుకు సాగుతున్నాయి. దానికి అనుబంధంగా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కార్మిక, వ్యవసాయ రంగాల సంస్కరణలు చట్టరూపం దాల్చాయి. ‘సంస్కరణ’ల పథగమనం తొలి దశల్లో తెలియని భయాందోళనలు కలుగవచ్చు. అయితే, రైతుల సంక్షేమం ఒక్కటే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుందని అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

17.    అంతే ముఖ్యమైనది, ప్రత్యక్షంగా ఎన్నో జీవితాలను స్మృశించేది విద్యారంగంలో వచ్చిన సమగ్ర సంస్కరణ. ఇది దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంది. సంప్రదాయంతోపాటు సాంకేతికతపై ప్రధాన దృష్టి పెడుతున్న 2020 జాతీయ విద్యా విధానం నూతన భారతావనికి పునాది వేస్తుంది. ఇది అంతర్జాతీయ రంగంపై విజ్ఞాన కేంద్రంగా ఆవిష్కృతం కావాలనే కాంక్ష కలిగి వుంది. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, జీవిత సవాళ్ళను ఎదుర్కొనే మేధాశక్తిని రగిలించడమే ఈ సంస్కరణ ధ్యేయం.

18.    ఈ ప్రయత్నాలన్నిటి నికర ఫలితం మన ముందున్నది. దాదాపు ఏడాది పాటు అనుభవించిన ఈ ఆకస్మిక కష్టం తర్వాత భారత్ ఈనాడు నిరుత్సాహపూరితంగా కాకుండా ఆత్మవిశ్వాస పూరితంగా నిలబడి ఉంది. ఆర్థిక వ్యవస్థ తిరిగి చురుకుతనం పుంజుకోవడంతో మందగమనం అనేది కేవలం ఒక పరివర్తనగా మిగిలిపోయింది. స్వయం సమృద్ధమైన భారతదేశం తన సొంత కొవిడ్-19 వ్యాక్సిన్ ను తయారు చేసుకుని ఇప్పుడు వ్యాక్సిన్ వేసే భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది చరిత్రలోనే అతిపెద్ద కసరత్తు. ఈ మహాకసరత్తును విజయవంతం చేయడానికి పాలనా యంత్రాంగం, ఆరోగ్య సేవలు సంపూర్ణ సంసిద్ధతో కృషి చేస్తున్నాయి. ఈ జీవధార సేవను ఉపయోగించుకుని మార్గదర్శకాల ప్రకారం వాక్సిన్ పొందాలని నేను దేశ వాసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఆరోగ్యం మీ అభ్యుదయానికి బాటలు వేస్తుంది.

19.    ఈనాడు భారతదేశాన్ని ప్రపంచ ఔషధ భాండాగారంగా పిలవడం సముచితమే. ప్రజల బాధలను కడతేర్చడానికి ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారిని అరికట్టడానికి మనం అనేక దేశాలకు ఔషధాలు, ఇతర ఆరోగ్య రక్షణ వస్తువులను సరఫరా చేస్తున్నాము. ఇప్పుడు మనం ఇతర దేశాలకు వ్యాక్సిన్ లను అందించబోతున్నాము.

 

ప్రియమైన సహ పౌరులారా

 

20.     గత సంవత్సరం అనేక వైపుల నుంచి కష్టాలకాలం వచ్చింది. మన సరిహద్దులలో ఆక్రమణ దుశ్చర్యను మనం ఎదుర్కొనగా, మన వీర సైనికులు దానిని భగ్నం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం ఆ వీరజవాన్లలో 20 మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. శాంతికి కట్టుబడి ఉన్నామని మనం పునరుద్ఘాటిస్తున్నప్పటికీ, మన భద్రతను దెబ్బతీసే ఎటువంటి ప్రయత్నానైనా వమ్ము చేసేందుకు మన రక్షణ దళాలు – ఆర్మీ, వైమానిక దళం, నావికా దళాలు చక్కటి సమన్వయంతో తగిన రీతిలో సమీకరించబడ్డాయి. ఎట్టి పరిస్థితులలోనూ మన జాతీయ ప్రయోజనాన్ని రక్షించుకుంటాము. భారతదేశపు ధృడమైన, సైద్ధాంతికమైన వైఖరిని అంతర్జాతీయ సమాజం విస్తృతంగా అర్థం చేసుకునేలా చేశాము కూడా.

21.    భారతదేశం ముందుకు నడుస్తూ ప్రపంచంలో తన సముచిత స్థానం పొందుతున్నది. ఈ సంవత్సరం భద్రతామండలిలో మన దేశం శాశ్వతేతర-సభ్య దేశంగా ప్రవేశం పొందడానికి అంతర్జాతీయ సమాజం నుంచి అందిన గొప్ప మద్దతు రీతి మన దేశ ప్రభావాన్ని సూచిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నాయకులతో మన సంపర్కాల నాణ్యత అనేక రెట్లు పెరిగింది. ఒక బాధ్యత కలిగిన, విశ్వాస పాత్రమైన దేశంగా, చైతన్యవంతమైన ప్రజాస్వామ్యంతో భారతదేశం సముచితమైన గౌరవాన్ని ఆర్జించింది.

22.    మన రాజ్యాంగ విలువలను మనకు మనం వల్లె వేసుకుంటుండాలి. నేను ఇది ముందు కూడా చెప్పాను. మన జాతిపిత జీవితం, ఆలోచనా విధానాన్ని మననం చేసుకోవడం మన నిత్యకృత్యం కావాలి. ప్రతి కంటి నీటి చుక్కను తుడిచేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి. మన గణతంత్రం గొప్పతనం చాటి చెప్పేది సమానత్వ భావనే. సాంఘిక సమానత్వం మనందరికీ, గ్రామీణులకు, మహిళలు, మన సమాజంలోని బలహీనవర్గాలు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, దివ్యాంగులు, వృద్ధులకు గౌరవం కల్పిస్తున్నది. ఆర్థిక సమానత్వం, సమాన అవకాశాలు కల్పిస్తున్నది. అణగారిన వర్గాలను చేయిపట్టి నడిపిస్తున్నది. తోటి మానవులకు సహాయపడే మన చర్యలు మన సానుభూతి సామర్థ్యాన్ని విస్తృత పరుస్తుంది. ముందున్న మన ఉమ్మడి మార్గంలో సౌభ్రాతృత్వమే మన నైతిక దిక్సూచి. 1948 నవంబర్ 4న రాజ్యాంగ పరిషత్ లో రాజ్యాంగ ముసాయిదాను సమర్పిస్తూ బాబాసాహెబ్ డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ చేసిన ప్రసంగంలో పేర్కొన్న రాజ్యాంగబద్ధ నైతికత మార్గాన్ని మనందరం అనుసరిద్దాం. రాజ్యాంగ బద్ధ నైతికత అంటే రాజ్యాంగంలో ప్రతిష్ఠించిన విలువలే శిరోధార్యమని అర్థము.

 

ప్రియమైన సహ పౌరులారా,

 

23.     మన గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న సందర్భంలో విదేశాలలోని మన సోదరసోదరీమణులు జ్ఞాపకం వచ్చారు. మన జాతి సంతతి మనకు గర్వకారణం. విదేశాలలో నివసిస్తున్న భారతీయులు విభిన్న జీవన మార్గాలలో సఫలీకృతులయ్యారు. కొందరు రాజకీయ నాయకత్వంలో అత్యున్నత శిఖరాలకు చేరుకోగా, మరికొందరు విజ్ఞాన శాస్త్రం, కళలు, విద్యారంగం, పౌర సమాజం, వాణిజ్య రంగానికి తమ సేవలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రవాస భూమికి, అలాగే భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్నారు. మీ పూర్వీకుల మాతృదేశం నుంచి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సాధారణంగా తమ తమ కుటుంబాలకు దూరంగా పండుగలు జరుపుకునే సాయుధ బలగాలు, పారా మిలటరీ దళాలు, పోలీసులకు నా శుభాకాంక్షలు.  ఈ జవాన్లు అందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు.

24.    నేను మరొక సారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

 

ధన్యవాదాలు.

జైహింద్

జైహింద్

జైహింద్

***(Release ID: 1692323) Visitor Counter : 62