భారత ఎన్నికల సంఘం

జనవరి 25-జాతీయ వోటర్ల దినోత్సవం

‘వోటర్లకు సాధికారత, జాగరూకత, భద్రత, అవగాహన కల్పించడం’ వోటర్ల దినోత్సవ ఇతివృత్తం

Posted On: 24 JAN 2021 5:19AM by PIB Hyderabad

  2021 జనవరి 25వ తేదీన 11వ జాతీయ వోటర్ల దినోత్సవాన్ని భారతీయ ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా న్యూల్లీలో జరగనున్న జాతీయ స్థాయి ఉత్సవంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. న్యూఢిల్లీలోని అశోక్ హోటల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రపతి భవన్.నుంచి వర్చువల్ పద్ధతిలో రాష్ట్రపతి ఈ కార్యక్రమంలో  పాలుపంచుకుంటారు. న్యాయం, కమ్యూనికేషన్లు ఎలెక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గౌరవ అతిథిగా పాల్గొంటారు.

  ‘వోటర్లకు సాధికారత కల్పించడం, వారిని జాగరూకత కల్గిన వారుగా, భద్రంగా, అవగాహన కల్గిన వారుగా ఉంచడం’ అన్న ఇతివృత్తంతో ఈ ఏడాది జాతీయ వోటర్ల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఎన్నికల్లో చురుగ్గా, భాగస్వామ్యం వహించేవారుగా వోటర్లను తీర్చిదిద్దాలన్న  అంశాన్ని ఈ ఇతివృత్తంలో పొందుపరిచారు. కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి  సమయంలో ఎన్నికలను సురక్షితంగా నిర్వహించే అంశంపై భారతీయ ఎన్నికల కమిషన్ చిత్తశుద్ధిని కూడా ఇది ప్రతిబింబిస్తోంది.

 జాతీయ వోటర్ల దినోత్సవాన్ని, 2011నుంచి ప్రతి ఏడాదీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ వస్తున్నారు. భారతీయ ఎన్నికల కమిషన్ వ్యవస్థాపక దినమైన 1950వ సంవత్సరం జనవరి 25వ తేదీని గుర్తుకు తెచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. వోటర్ల నమోదు ప్రక్రియను ప్రోత్సహించడం, అందుకు తగిన సదుపాయాలు కల్పించి, గరిష్టస్థాయిలో వోటర్ల నమోదును చేపట్టడం జాతీయ వోటర్ల దినోత్సవం ప్రధాన ధ్యేయం. దేశంలోని వోటర్లు అందరికీ ఈ కార్యక్రమాన్ని అంకితం చేశారు. వోటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు,, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పేందుకు ఈ వోటర్ల దినోత్సవాన్ని వినియోగించుకుంటున్నారు. వోటర్ల దినోత్సవ కార్యక్రమాల్లో కొత్త వోటర్లకు గౌరవించి, వారికి వోటర్ ఫొటో గుర్తింపు కార్డును (ఇ.పి.ఐ.సి.ను) అందిస్తూ వస్తున్నారు. 

  జాతీయ వోటర్ల దినోత్సవం సందర్భంగా ఈ సారి 2020-21 సంవత్సరపు జాతీయ అవార్డులను గౌరవ రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ‘హలో వోటర్స్’ పేరిట భారతీయ ఎన్నికల కమిషన్ తరఫున రూపొందించిన వెబ్ రేడియోను ఆయన ఆవిష్కరిస్తారు. ఎన్నికల నిర్వహణా ప్రక్రియలో ఉత్తమమైన, ప్రతిభావంతమైన సేవలు అందించినందుకు గుర్తింపుగా రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి అధికారులకు జాతీయ అవార్డులను అందిస్తారు. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ, భద్రతా నిర్వహణ, కోవిడ్-19 సమయంలో ఎన్నికల నిర్వహణ, వోటరు అవగాహన కార్యక్రమాలు తదితర అంశాల్లో సేవలందించినందుకు గుర్తింపుగా ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఎన్నికల నిర్వహణా ప్రక్రియకు సంబంధించిన భాగస్వామ్య వర్గాలుగా పరిగణించే జాతీయ ప్రతీకాత్మక వ్యక్తులకు, కేంద్ర గణాంక శాఖ అధికారులకు, వోటర్ల అవగాహన కల్పనలో విలువైన సేవలందించిన మీడియా గ్రూపులకు కూడా ఈ జాతీయ పురస్కారాలు అందిస్తారు.    

 ఇ.సి.ఐ. వెబ్ రేడియా: ‘హలో వోటర్స్’: ఆన్ లైన్ లో అందుబాటులో ఉండే ఈ డిజిటల్ రేడియో సర్వీసు వోటర్ల అవగాహనా కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. భారతీయ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నడిచే వెబ్ సైట్ లోని లింక్ ద్వారా ఈ వెబ్ రేడియో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ప్రజాదరణ పొందిన ఎఫ్.ఎం. రేడియోకు దీటుగా పనిచేసేలా వెబ్ రేడియో సర్వీసును రూపొందించారు. ఎన్నికల ప్రక్రియల గురించి సమాచారం అందించి, వోటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని పాటలు, నాటక ప్రక్రియ, చర్చలు, ఉదంతాలు, కథల రూపంలో ఈ వెబ్ రేడియో ప్రసారం చేస్తుంది. హిందీ, ఇంగ్లీషుతోపాటుగా, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ భాషల్లో ఈ ప్రసారాలను వెబ్ రేడియో అందిస్తుంది.

   వోటర్ల దినోత్సవం సందర్భంగా ఇ-ఎపిక్ (e-EPIC) కార్యక్రమాన్ని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రారంభిస్తారు. ఐదుగురు నూతన వోటర్లకు డిజిటల్ రూపంలోని ఇ-ఎపిక్స్.ను, వోటరు ఫొటో గుర్తింపు కార్డులను కేంద్రమంత్రి పంపిణీ చేస్తారు. వోటరు ఫొటో గుర్తింపు కార్డుల డిజిటల్ రూపమైన e-EPICను, వోటరు హెల్ప్ లైన్ యాప్ ద్వారా, https://voterportal.eci.gov.in/, https://www.nvsp.in/ అనే వెబ్ సైట్ల ద్వారా పొందడానికి వీలుంటుంది.

  ఎన్నికల కమిషన్ చేపట్టిన మూడు ప్రచురణలను కూడా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ జాతీయ వోటర్ల దినోత్సవంలో విడుదల చేస్తారు. ఈ ప్రచురణ పత్రాల ప్రతులను గౌరవ రాష్ట్రపతికి అందిస్తారు.  ప్రచురణల వివరాలు ఈ కింది విధంగా ఉంటాయి.:

  మహమ్మారి వ్యాప్తి సమయంలో ఎన్నికల నిర్వహణ. ఛాయాచిత్ర పయనం: ఇది పూర్తిగా ఫొటోలతో రూపొందించిన పుస్తకం. మహమ్మారి వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎదురైన సవాళ్లను ఇది వివరిస్తుంది.  రాజ్యసభ ద్వైవార్షి ఎన్నికలు మొదలుకొని,..దేశంలో పలు ఎన్నికలను ఎన్నిక కమిషన్ ఇటీవల విజయవంతంగా నిర్వహించింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియల్లో ఒకటిగా పరిగణించదగిన బీహార్ శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించారు.  వివిధ రాష్ట్రాల్లో విస్తరించిన 60 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను కూడా ఎన్నికల కమిషన్ నిర్వహించింది.

స్వీప్ (ఎస్.వి.ఇ.ఇ.పి.) కార్యక్రమాలు:  2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా అవగాహనా చర్యలు: 2019లో జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వోటర్ల అవగాహన, అందుకు చేపట్టిన సృజనాత్మక చర్యలు, ఇతర కార్యక్రమాలను ఈ పుస్తకం వివరంగా అందిస్తుంది. ‘దేశ మహా పర్వదినం’ ధ్యేయాన్ని, దేశంలో నిర్వహించిన అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ స్ఫూర్తిని ఈ పుస్తకం విపులంగా తెలియజేస్తుంది. కుల, మత, వర్ణ, లైంగిక వివక్షకు తావులేకుండా దేశవ్యాప్తంగా నిర్వహించిన అతి పెద్ద ప్రజాస్వామ్య పర్వదినాన్ని వివరిస్తుంది.  వ్యవస్థీకృతమైన వోటర్ల అవగాహన, వారు ఎన్నికల్లో పాలుపంచుకునే కార్యక్రమం (స్వీప్-ఎస్.వి.వి.ఇ.ఇ.పి.) కింద ఈ పుస్తకాన్ని రూపొందించారు.

 చలో, కరేఁ మత్.దాన్: ఇది హాస్యస్ఫోరకమైన బొమ్మల పుస్తకం. వోటర్ల అవగాహనను గురించి బొమ్మల సహాయంతో సరదాగా వివరిస్తూ భావస్ఫోరకంగా దీన్ని రూపొందించారు. యువ వోటర్లు, భావి వోటర్లకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ పుస్తకం తయారు చేశారు. ఎన్నికల ప్రక్రియలపై వోటర్లకు స్థూలంగా అవగాహన కల్పించే లక్ష్యంగా సరదా బొమ్మలతో ఈ పుస్తకాన్ని తయారు చేశారు.

 

******


(Release ID: 1691937) Visitor Counter : 256