రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

అనుభవజ్ఞుల దినోత్సవం - 14 జనవరి 2021

Posted On: 13 JAN 2021 4:41PM by PIB Hyderabad

భారత సాయుధ దళాలు, జనవరి 14ను అనుభవజ్ఞుల దినోత్సవంగా జరుపుకోనున్నాయి. సాయుధ దళాల మొదటి కమాండర్-ఇన్-చీఫ్, ఫీల్డ్ మార్షల్ కె.ఎం.కరియప్ప, 1953లో ఇదే రోజున ఉద్యోగ విరమణ చేశారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఏటా ఇదేరోజును అనుభవజ్ఞుల దినోత్సవంగా సాయుధ దళాలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా, దేశ సేవలో అమరులైన యోధుల వారసులకు సంఘీభావం ప్రదర్శించడానికి; నిస్వార్థంగా సేవ, త్యాగాలు చేసిన అనుభవజ్ఞులకు గౌరవసూచకంగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సైనిక కేంద్రాల్లో పుష్పనివాళి, అనుభవజ్ఞుల సమావేశ కార్యక్రమాలను గురువారం నిర్వహిస్తారు.

    రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కలిసి, బెంగళూరు వైమానిక కేంద్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సైనికుల వారసులు, అనుభవజ్ఞులు, మాజీ సైనికోద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా హాజరవుతారు.

    "నేషనల్‌ వార్‌ మెమోరియల్‌" వద్ద పుష్పాంజలి కార్యక్రమంతో దిల్లీలో వేడుకలు ప్రారంభమవుతాయి. సీనియర్‌ మిలిటరీ అధికారులు, ఎంపిక చేసిన సిబ్బంది, అనుభవజ్ఞులు పాల్గొని అంజలి ఘటిస్తారు. తర్వాత, రైనా ఆడిటోరియంలో అనుభవజ్ఞుల సమావేశం ఉంటుంది. త్రివిధ దళాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. నావికా దళాధిపతి అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనుభవజ్ఞులు, మాజీ సైనికోద్యోగ సంఘాల ప్రతినిధులు, రక్షణ శాఖ సహా త్రివిధ దళాల సీనియర్‌ అధికారులు కూడా హాజరవుతారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా, ముందస్తు అనుమతి ఉన్నవారికే ఈ కార్యక్రమంలోకి అనుమతి ఉంటుంది.

***



(Release ID: 1688319) Visitor Counter : 206