నీతి ఆయోగ్

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా
అటల్ టింకరింగ్ లాబ్ తాజా సంచిక ఆవిష్కరణ

Posted On: 12 JAN 2021 7:16PM by PIB Hyderabad

నీతి ఆయోగ్ కు చెందిన అటల్ ఇన్నొవేషన్ మిషన్ ఈరోజు  అటల్ టింకరింగ్ లాబ్ తాజా సంచికను ఆవిష్కరించింది. ఈ లాబ్ ల నిర్వహణావిధానాలను ఈ కరదీపిక సవివరంగా తెలియజేస్తుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా చేస్తున్న సరికొత్త ప్రయాణం.  స్వామి వివేకానంద జన్మదినోత్సవం సందర్భంగా ఆయన గౌరవార్ధం జాతీయ యువజనోత్సవం  నాడే దీన్ని ఆవిష్కరించటం గమనార్హం. శక్తిమంతమైన దేశ నిర్మాణంలో యువత ప్రాధాన్యాన్ని తన జీవితకాలమంతా చెబుతూ వచ్చారు.

అటల్ టింకరింగ్ లాబ్ హాండ్ బుక్ 2.0 పేరుతో విడుదల చేసిన ఈ  హాండ్ బుక్ అటల్ ఇన్నొవేషన్ మిషన్ ప్రధాన కార్యక్రమైన అటల్ టింకరింగ్ లాబ్ కు సంబంధించిన నిర్మాణాత్మక, ఎంపిక, స్థాపన తదితర అంశాలమీద ఆచరణాత్మక మార్గదర్శకాలన్నిటినీ వివరిస్తుంది.  అటల్ ఇన్నొవేషన్ మిషన్ అధికారిక వెబ్ సైట్ లో ఈ కరదీపికను అందుబాటులో ఉంచారు. ఇది దేశవ్యాప్తంగా మారుమూల పాఠశాలల్లో సైతం  క్షేత్ర స్థాయిలో కనిపెట్టే కొత్త కొత్త ఆవిష్కరణలమీద సాంకేతికంగానిర్మాణాత్మకమైన, వివరణాత్మకమైన మార్గదర్శకాలు అందిస్తుంది.

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక వీడియో సందేశం ఇచ్చారు. “ఈ రోజు వివేకానంద జయంతి సందర్భంగా మనం ఎటిఎల్ హాండ్ బుక్ రెండో సంచిక  ఆవిష్కరించుకున్నాం. ఇది మూడేళ్ళపాటు ఎయిమ్ బృందం క్షేత్ర స్థాయిలో చేసిన కృషి ఫలితం. నాణ్యమైన విధాన పరమైన కార్యకలాపాలకు నెలవైన నీతి ఆయోగ్ కీర్తికిరీటంలో ఇది కలికితురాయి. “

ఎయిమ్ మిషన్ డైరెక్టర్, నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి శ్రీ ఆర్ రమణన్ ఈ పుస్తకాన్ని వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ఎయిమ్ వారి అటల్ టింకరింగ్ లక్ష్యాలను వివరించారు. ఇందులో పాల్గొనేవారికి దాని వలన కలిగే ప్రయోజనాల గురించి కూడా తెలియజెప్పారు.   

“అన్ని పాఠశాలలకు, అందరు మార్గదర్శకులకు, ఆవిష్కర్తలకు అటల్ టింకరింగ్ లాబ్స్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఒకే చోట దొరికే పుస్తకం ఇది. వాటిని ఎలా వాడుకోవాలో కూడా తెలియజెబుతుంది. ఈ పుస్తకాన్ని బాగా వాడుకోగలిగేలా సరళంగా తయారుచేశాం. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరింత అదనపు సమాచారం కావాలనుకునే వారి కోసం క్యూ ఆర్ కోడ్స్ కూడా అందులో పొందుపరచాం.”

మిషన్ హై లెవెల్ కమిటీ బోర్డ్ సభ్యుడు, ఎయిమ్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ విజయ్ చౌథాయివాలే స్వామి వివేకానంద ను తన ప్రసంగంలో ఉటంకిస్తూ ఆయన బోధనలను అనుసరించాలని అప్పుడే ఉన్నతమైన లక్ష్యాలు సాధించగలుగుతారని  విద్యార్థులనుద్దేశించి అన్నారు.  

“ఎటిఎల్ మా అందరికీ ఒక అద్భుతమైన అభ్యసన అనుభూతి. దేశంలోని లేత మేథస్సు నవకల్పనల పర్యావరణం మధ్య ఎదగటానికి ఎలా అవకాశం కల్పిస్తున్నదో చూడగలగటం ఇందులో ప్రత్యేకత.  ఇందుకోసం అటల్ ఇన్నొవేషన్ మిషన్ కృషిచేస్తూ వస్తోంది. అన్ని పాఠశాలలు, అందరు విద్యార్థులు ఈ ప్రచురణను పూర్తిగా వాడుకోవాలని సలహా. విద్యార్థులు వైఫల్యాలకు భయపడకుండా రిస్క్ తీసుకోవటం ముఖ్యమని చెప్పటం నా ఉద్దేశం. “ అన్నారు.

ఈ కరదీపిక ప్రతిని ఈ క్రింది లింక్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు:  https://aim.gov.in/pdf/ATL_Handbook_2021.pdf

ఎటిఎల్ గురించి:

బాలల మేథస్సు తమ ఆలోచనలకు రూపం ఇవ్వటానికి ఆస్కారం కల్పించటం అటల్ టింకరింగ్ లాబ్స్ పని. వాళ్ళు తమంతట తాము స్వయంగా ప్రయోగాలు చేసుకోవటానికి,  ఆవిష్కరణ పూర్వకమైన నైపుణ్యాలు నేర్చుకోవటానికి సహాయపడతాయి. వ్యవస్థాపకతను, నవకల్పనలను పెంపొందించటానికి అటల్ ఇన్నొవేషన్ మిషన్, నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా 7,000 కు పైగా అటల్ టింకరింగ్ లాబ్స్ ను ఏర్పాటు చేశాయి. దీనివలన 6-12 తరగతుల మధ్య చదువుకునే 30 లక్షలమందికి పైగా విద్యార్థులు సమస్యాపరిష్కారాన్ని, కొత్త ఆలోచనల ధోరణిని అలవరచుకుంటారు.

 

 

******(Release ID: 1688131) Visitor Counter : 34