ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 వాక్సిన్ పంపిణీ

కోవిడ్ టీకా పంపిణీకు దేశం సన్నద్ధం: కో-విన్

నిర్వహణ మీద రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శనం

ప్రపంచంలో అతిపెద్ద టీకాల కార్యక్రమానికి

అత్యాధునిక పరిజ్ఞానపు పునాది

Posted On: 10 JAN 2021 2:48PM by PIB Hyderabad

జాతీయ స్థాయిలో కోవిడ్ టీకా మందు పంపిణీకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమన్వయం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యకలాపాలు చేపడుతోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. టీకా కార్యక్రమ నిర్వహణకు వెన్నెముకలాంటి కో-విన్ సాఫ్ట్ వేర్ విషయం కూడా ఇందులో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది.   

కోవిడ్ మీద పోరాటానికి ఏర్పాటైన టెక్నాలజీ, డేటా మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ హోదాల్లో శ్రీ ఆర్ ఎస్ శర్మ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.  కోవిడ్ టీకాలు ఇచ్చే కార్యక్రమం కోసం ఏర్పాటైన  నిపుణుల కమిటీకి కూడా ఆయనే అధ్యక్షుడు. ఈ కార్యక్రమంలో రాష్ట్రాల ప్రిన్సిపల్ కార్యదర్శులు, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్లు, రాష్ట్రాల టీకాల కార్యక్రమం అధికారులు, ఆరోగ్య మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కో-విన్ సాఫ్ట్ వేర్ మీద వివిధ రాష్ట్రాలు ఇచ్చిన ప్రతిస్పందనను ఈ సమావేశం సమీక్షించింది. నమూనా టీకాల కార్యక్రమం ఆచరణలో ఎదురైన అనుభవాన్ని ఇందులో వివరంగా చర్చించారు.

కో-విన్ సాఫ్ట్ వేర్ గురించి, టీకాల కార్యక్రమంలో దాని పాత్ర గురించి శ్రీ రామ్ సేవక్ శర్మ వివరంగా తెలియజెప్పారు. టీకాలిచ్చే పనిలో టెక్నాలజీని ఎలా సమర్థంగా వాడుకోవచ్చునో ఆయన వివరించారు.ధారపడిన అత్యాధునిక సాఫ్ట్ వేర్ గా దీనిని ఆయన అభివర్ణించారు. ఇప్పుడు చేపట్టబోయే కోవిడ్ టీకాల కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్దదని కూడా చెప్పారు. ఇంత భారీ స్థాయి కార్యక్రమాన్ని ఇంతకుముందెన్నడూ చేపట్టలేదని కూడా అన్నారు. ఈ మొత్తం ప్రక్రియ ప్రజలే కేంద్రంగా సాగాలని గుర్తు చేశారు. ప్రతిచోటా, అందరికీ టీకా అందుబాటులో ఉండేట్టు చూడటానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నాణ్యత మీద ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడకూడదన్నారు. వేగంగాను, అవసరానికి తగినట్టు సంఖ్య పెంచుకోవటంలోను ఇబ్బంది లేకుండా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు.

టీకా సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమీకరించి వెబ్ సైట్ లో ఎక్కించటం ఎంత ప్రాధాన్యమో నిపుణుల బృందం అధ్యక్షుడు ఈ సందర్భంగా వివరించారు.  ఇందులో ఏ మాత్రమూ రాజీపడనక్కర్లేదన్నారు. కొన్ని రాష్ట్రాలలో  ఆన్ లైన్ లో అవకాశం లేకపోయినా ఆఫ్ లైన్ లో అయినా ఎక్కించటానికి వీలు కలుగుతుందన్నారు.

లబ్ధిదారులలో ఒకరికి బదులు మరొకరు అనే పరిస్థితి రాకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రతి లబ్ధిదారునీ గుర్తించి మరీ టీకాలివ్వాలని చెప్పారు. ఆధార్ ను వాడుకోవటం గురించి మాట్లాడుతూ, రాష్ట్రాలు తప్పకుండా లబ్ధిదారులు ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు  సేకరించటం ద్వారా రిజిస్ట్రేషన్ ను పటిష్టం చేయాలని సూచించారు. అదే విధగా టీకాల కార్యక్రమం సమాచారాన్ని ఎప్పటికప్పుడు లబ్ధిదారుకు మెసేజ్ ద్వారా అందించేలా చూడాలని చెప్పారు. టీకాలు వేయించుకున్నవారందరి డిజిటల్ రికార్డ్ భద్రపరచాలని, ఎవరికి ఎవరు టీకా ఇచ్చారో కూడా అందులో నమోదై ఉంటుందని గుర్తు చేశారు.  ఈ మొత్తం ప్రక్రియ సరైన సమాచారం మీదనే ఆధారపడి ఉంటుంది గనుక అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలన్నారు.

నమూనా టీకాల కార్యక్రమంలో ఎదురైన అనుభవాలను అన్ని రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాలూ ఈ సమావేశంలో పంచుకున్నాయి. ఈ ప్రతిస్పందనకు అనుగుణంగా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసిన విషయం  కూడా ప్రస్తావించారు. ఏయే ప్రదేశాలలో ఏయే రోజుల్లో ఎంతమందికి టీకాలివ్వాలి, అనే విషయాలమీద సమగ్రమైన అవగాహన పెంచుకోవాలని కోరారు.

 

***(Release ID: 1687514) Visitor Counter : 202