ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకా విడుదల

కోవిడ్-19 టీకా ట్రయల్ రన్ సంసిద్ధతను సమీక్షించడం కోసం ఢిల్లీలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన - డాక్టర్ హర్ష వర్ధన్

పాలనా యంత్రాంగం మరియు వైద్య అధికారుల మధ్య సంపూర్ణమైన, కట్టుదిట్టమైన అవగాహన అవసరం ఎంతైనా ఉంది.

“ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధతో వ్యవహరించి, ఈ ప్రక్రియని, అసలైన టీకా పంపిణీ కార్యక్రమంగా నిర్వహించడానికి ప్రయత్నిద్దాం"

Posted On: 01 JAN 2021 5:14PM by PIB Hyderabad

2021 జనవరి, 2వ తేదీ (రేపు) కోవిడ్-19 టీకా ట్రయల్ రన్ కోసం దేశవ్యాప్తంగా సంసిద్ధతను సమీక్షించడం కోసం ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశానికి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ అధ్యక్షత వహించారు.

రేపు దేశవ్యాప్తంగా, ఎటువంటి లోపాలు లేకుండా, డ్రై-రన్ నిర్వహించడం కోసం చేసిన వివిధ ఏర్పాట్లను మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు కేంద్ర మంత్రికి వివరించారు.  ఈ ఏర్పాట్లలో భాగంగా - క్షేత్ర స్థాయిలో డ్రై-రన్ నిర్వహణ లో ఉన్న బృందాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి వీలుగా టెలిఫోన్ ఆపరేటర్ల సంఖ్యను పెంచడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో భౌతిక తనిఖీ కోసం బ్లాకు స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర సమస్యలతో పాటు, ఈ ప్రక్రియపై తరచుగా అడిగే ప్రశ్నలపై కార్యకర్తలందరికీ పూర్తి అవగాహన కల్పించడం జరిగింది. 

టీకా ఇచ్చే స్థలాలు మరియు ఆక్కడ ఉండే అధికారిక ఇన్‌ఛార్జిలు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ టీకా కోసం రూపొందించిన వివరణాత్మక చెక్ ‌లిష్టు మరియు ఎస్.ఓ.పి. కి కట్టుబడి ఉండేలా చూడాలని, ప్రతి అధికారిని కోరడం జరిగింది.  ఈ డ్రై-రన్ లో మార్గనిర్దేశం చేయడానికి రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలను భాగస్వామ్యం చేయడం జరిగింది. పాలనా యంత్రాంగం మరియు వైద్య అధికారుల మధ్య సంపూర్ణ సమన్వయం అవసరమని, డాక్టర్ హర్ష వర్ధన్, నొక్కిచెప్పారు. 

ఎన్నికల మాదిరిగానే సామూహిక భాగస్వామ్యం ఉన్న ఇటువంటి ప్రక్రియ ప్రాముఖ్యతను ఆయన పునరుద్ఘాటిస్తూ,  “ప్రతి చిన్న విషయంలోనూ, పూర్తి శ్రద్ధతో వ్యవహరించి, ఈ ప్రక్రియని, అసలైన టీకా పంపిణీ కార్యక్రమంగా నిర్వహించడానికి ప్రయత్నిద్దాం. పరస్పర అవగాహన పెంచుకోవడంలో పూర్తి సమన్వయాన్ని నెలకొల్పడం ద్వారా, భవిష్యత్తులో చేపట్టే టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఎటువంటి లోపాలు,  అవాంతరాలు లేకుండా కొనసాగించవచ్చు.” అని దిశా నిర్దేశం చేశారు. 

1994 లో ఢిల్లీలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని, డాక్టర్ హర్ష వర్ధన్ గుర్తుచేస్తూ,  డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ, టీకా పంపిణీ కార్యక్రమం, ప్రజల మధ్య పరస్పర చర్య  మరియు ప్రమేయం మీద ఆధారపడి ఉంటుందనీ, ఇందుకోసం, సంబంధిత భాగస్వాములు, ప్రభుత్వేతర సంస్థలు, పౌర సమాజ సంస్థలు (సి.ఎస్.ఓ. లు) మరియు ఇతరులను సమీకరించాల్సిన అవసరం ఉందనీ, పేర్కొన్నారు.  అదేవిధంగా, టీకా పంపిణీ చేసే ప్రదేశాల్లోనూ, శీతల గిడ్డంగుల వద్దా, వ్యాక్సిన్ రవాణా సమయంలోనూ, తగిన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం కూడా ఉందని ఆయన నొక్కి చెప్పారు.

ఆరోగ్య శాఖ కార్యదర్శి, శ్రీ అమిత్ సింగ్లా తో పాటు, ఢిల్లీలో నమూనా టీకా కార్యక్రమం చేపడుతున్న - షాదారా, సెంట్రల్ ఢిల్లీ, నైరుతి ఢిల్లీ జిల్లాలకు చెందిన జిల్లా మేజిస్ట్రేట్లు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారులతో కూడా డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడారు.  నమూనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్న ఈ మూడు ప్రదేశాలు : గురు తేజ్ బహదూర్ హాస్పిటల్, షాదారా;  పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, దర్యాగంజ్;  శ్రీ వేంకటేశ్వర ఆసుపత్రి, ద్వారక. 

ఈ కార్యక్రమం కోసం నియమించబడిన బృందాలకు తగిన శిక్షణ ఇవ్వడం జరిగిందనీ,   అవాంతరాలను గుర్తించి, వాటిని తిరిగి నివేదించడానికి వీలుగా, వారు ఈ ప్రక్రియ యొక్క ప్రతి అంశాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారనీ, అధికారులు, కేంద్ర మంత్రికి తెలియజేశారు.  టీకా పంపిణీ ప్రదేశాల ఏర్పాటు;  సమాచార సేకరణ మరియు ఆధునీకరణ ప్రక్రియ;   ఆ సమాచారాన్ని కో-విన్ ‌లో పొందుపరచడం; టీకాలు వేసే వ్యక్తికీ శిక్షణ; టీకాలు వేసిన తర్వాత సంభవించే ఏదైనా ప్రతికూల సంఘటన (ఏ.ఈ.ఎఫ్.ఐ) కు సంసిద్ధత;  శీతల గిడ్డంగుల నిర్వహణ;  టీకా సరఫరా చేసే ప్రదేశాల వద్ద భద్రత;  టీకాలు భద్రపరిచే ప్రదేశాల వద్ద రక్షణ; తో సహా నమూనా పంపిణీ కోసం చేసిన సన్నాహాల గురించి వారు మంత్రికి వివరించారు.

టీకా పంపిణీ నమూనా కార్యక్రమ నిర్వహణ సంసిద్ధతపై వారు విశ్వాసం వ్యక్తం చేస్తూ,   గుర్తించిన లబ్ధిదారులకు వాస్తవంగా టీకా పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించడానికి కూడా, తాము అన్ని విధాలా తయారుగా ఉన్నామని, అధికారులు, ఈ సందర్భంగా, కేంద్ర మంత్రికి హామీ ఇచ్చారు.

రెండు ప్రముఖ టీకా సంస్థల స్థితిగతులను, డాక్టర్ హర్ష వర్ధన్, అధికారులకు వివరిస్తూ, వాటి వివరాలను డి.సి.జి.ఐ. కి చెందిన సంబంధిత నిపుణుల కమిటీ నిశితంగా పరిశీలిస్తోందని తెలియజేశారు.  ఫ్రంట్ లైన్ కార్మికుల కృషిని ఆయన ప్రశంసించారు.  ఇతరులను రక్షించే ప్రయత్నంలో ప్రాణాలను అర్పించిన కరోనా యోధులకు ఆయన సంతాపం తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో -  ఢిల్లీ లోని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్; ఏ.ఎస్. & ఎమ్.డి. (ఎన్.ఎం.హెచ్), శ్రీమతి వందన గుర్నానీ;  అదనపు కార్యదర్శి (హెచ్), డాక్టర్ మనోహర్ అగ్నాని;  సంయుక్త కార్యదర్శి శ్రీ లవ్ అగర్వాల్ తో పాటు మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

****


(Release ID: 1685567) Visitor Counter : 217