ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 వాక్సిన్ పంపిణీకి సిద్ధం కావాలని రాష్ట్రాలకు కేంద్రం పిలుపు

ఆరోగ్య కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్రాలతో ఉన్నత స్థాయి సమావేశం

అన్ని రాష్ట్రాలలో 2న నమూనా వాక్సిన్ పంపిణీ కార్యక్రమం

Posted On: 31 DEC 2020 2:33PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా కోవిడ్ వాక్సిన్ పంపిణీ సమర్థవంతంగా జరిగేందుకు అందరూ సన్నద్ధం కావాలని కేంద్ర ప్రభుత్వం అని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్ ఈ రోజు  జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. రాష్ట్రాల సంసిద్ధతను ఈ సందర్భంగా సమీక్షించారు. ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, నేషనల్ హెల్త్ మిషన్ ఎండీలు, అన్ని రాష్ట్రాల ఆరోగ్య  శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.  

ఈ నమూనా వాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జనవరి 2న (శనివారం) నిర్వహిస్తాయి. అన్ని రాష్ట్రాలు కనీసం మూడు చోట్ల ఈ కార్యక్రమాన్ని చేపడతాయి. కొన్ని రాష్ట్రాలు క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలను, రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉన్న జిల్లాలను సైతం దీనికోసం ఎంచుకుంటాయి. మహారాష్ట్ర, కేరళ తమ రాజధానులు కాని ప్రధాన నగరాలను ఈ నమూనా పంపిణీకి ఎంచుకుంటున్నాయి.   

భిన్న వాతావరణాలలో వాక్సిన్ పంపిణీ తీరును, పంపిణీలో ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే అంచనా వేయటానికి, ప్రణాళికకూ - అమలుకూ మధ్య ఏర్పడటానికి అవకాశమున్న అవరోధాలను గుర్తించటానికి ఈ నమూనా పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు.  ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను కూడా గుర్తిస్తారు. వాస్తవంగా అమలు చేయబోయేలోగా వాటిని సరిదిద్దుతారు.  దీనివలన నిర్వాహకులకు ఆత్మ స్థైర్యం కలుగుతుందని భావిస్తున్నారు

వాక్సిన్ ఇచ్చే కార్యక్రమం 2020 డిసెంబర్ 20న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఇచ్చిన నిర్వహణా మార్గదర్శకాలకు అనుగుణంగా సాగుతుంది. వాక్సిన్ నమూనా పంపిణీకి ఎంపిక చేసిన ఒక్కో కేంద్రంలోనూ ఒక ఇన్ ఛార్జ్ వైద్యాధికారి ఉంటారు.  ఈ ప్రయోగాత్మక కార్యక్రమం కోసం ఆరోగ్య కార్యకర్తలలో 25 మంది లబ్ధిదారులను ఆ అధికారి ఎంపిక చేస్తారు.  ఈ లబ్ధిదారుల సమాచారాన్ని కో-విన్ లో అప్ లోడ్ చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశించారు. వీళ్ళంతా 2వ తేదీన టీకాల నమూనా కార్యక్రమం జరిగే ప్రదేశంలో హాజరవుతారు. ఆయా ప్రదేశాలలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చెసి పూర్తి సమాచారాన్ని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసే బాధ్యత కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలదే అవుతుంది.

ప్రతిపాదించిన ప్రదేశాలలో భౌతిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, త్రాగునీటి సౌకర్యం, ఇంటర్నెట్ కనెక్టివిటీ,  విద్యుత్, భద్రత అన్నీ సక్రమంగా ఉన్నట్టు రాష్ట్రాలు నిర్థారించుకోవాలి. ప్రతి రాష్ట్రంలోను రాజధాని నగరంలో అలాంటి మూడు కేంద్రాలను ఎంచుకోవాలి. ప్రతి కేంద్రంలోను ప్రవేశానికి, నిష్క్రమణకు వేరు వేరు ద్వారాలు ఉండాలి. ప్రతి చోటా మూడు గదులు కనీసం ఉండాలి.  అదే విధంగా, తగినంత అవగాహన కల్పించటానికి  వెలుపల విశాలమైన ప్రాంగణం ఉండాలి. మొత్తంగా తగిన వాతావరణం ఉండేలా చూడాలి.  టీకాలిచ్చే బృందాలను గుర్తించి ముమ్దుగానే తగిన శిక్షణ ఇవ్వాలి. ఈ నమూనా టీకాల కార్యక్రమంలో  టీకా మందు సరఫరా, నిల్వ, రవాణా, శీతల గిడ్డంగి సౌకర్యం లాంటి విషయాల నిర్వహణ కలిసి ఉంటుంది.  

టీకాల కార్యక్రమంలో టీకాలు ఇచ్చేవారు చాలా కీలకం కాబట్టి వారికి శిక్షణ ఇచ్చేవాళ్లకు శిక్షణ ఇస్తారు. దాదాపు 96 వేలమంది టీకాలిచ్చేవారికి ఇందుకోసం శిక్షణ ఇచ్చారు.  వాళ్లకు శిక్షణ ఇచ్చే 2,360 మంది ముందుగా శిక్షణ పొందారు. 719 జిల్లాల్లో 57,000 మంది ఇప్పటికే శిక్షణ పూర్తిచేసుకున్నారు. టీకాలు, లేదా సాఫ్ట్ వేర్ సంబంధమైన ప్రశ్నలు తలెత్తితే 1075 కు అదనంగా 104 కు కాల్ చేసే ఏర్పాటు చేశారు. కాల్ సెంతర్ నిర్వాహకులకు కూడా అవసరమైన సమాచారం, శిక్షణ ఇచ్చారు. ఎలాంటి అనుమానం వచ్చినా నివృత్తి చేసుకోవటానికి రాష్ట్రాలు ఆరోగ్య మంత్రిత్వశాఖ జారీచేసిన “తరచు అడిగే ప్రశ్నలు” సరిచూసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ కోరింది.

ఈ నమూనా టీకాల కార్యక్రమం ముఖ్యోద్దేశం టీకాలు వేయించుకున్నవారికి ఏవైనా అనుకోని పరిస్థితి ఎదురైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలో నేర్చుకోవటం. టీకాలిచ్చే చోట కూడా ఇన్ఫెక్షన్ సోకకుండా నియంత్రించటం, వ్యాధి వ్యాపించకుండా చూడటం చాలా కీలకమవుతాయి. ప్రతి తాలూకా, జిల్లా స్థాయిలనుంచి వచ్చే సమాచారాన్ని  రాష్ట్ర టాస్క్ ఫోర్స్ క్రోడీకరించి, విశ్లేషించి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖకు తెలియజేస్తుంది.

నమూనా కార్యక్రమంలో ఏయే అంశాలపట్ల అప్రమత్తంగా ఉండాలో, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో వివరిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సవివరమైన చెక్ లిస్ట్ ను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందజేసింది.

నమూనా టీకాల కార్యక్రమం మొదటి రౌండ్ ఆంధ్రప్రదేశ్, అస్సాం, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలలో డిసెంబర్ 28,29 తేదీలలో జరిగిన విషయం తెలిసిందే. ప్రతి రాష్ట్రంలోనూ రెండేసి జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు.  అక్కడ ఐదేసి ప్రదేశాలు ఎంపిక చేసుకొని ఒక్కో చోట 25 మంది చొప్పున లబ్ధిదారులను గుర్తించారు. ఈ నమూనా కార్యక్రమంలో నిర్వహణ పరమైన ఇబ్బందులేవీ ఎదురుకాలేదు. అన్ని రాష్ట్రాలూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకున్నాయి. నిర్వహణ పట్ల పుర్తి సంతృప్తి వ్యక్తం చేశాయి.

నేషనల్ హెల్త్ మిషన్ అధికారి వందనా గుర్నాని, ఆరోగ్య శాఖ  అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ అజ్ఞాని, సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.  

 

***



(Release ID: 1685094) Visitor Counter : 242