ప్రధాన మంత్రి కార్యాలయం

న్యూ భావూపుర్‌-న్యూ ఖుర్జా సెక్ష‌న్ ను మ‌రియు ఈస్ట‌ర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ తాలూకు ఆప‌రేష‌న్ కంట్రోల్ సెంట‌ర్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

మౌలిక స‌దుపాయాల అభివృద్ధి ని రాజ‌కీయాల‌ కు అతీతం గా నిలపాలి

Posted On: 29 DEC 2020 2:21PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ భావూపుర్‌-న్యూ ఖుర్జా సెక్ష‌న్ ను మ‌రియు ఈస్ట‌ర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్‌ తాలూకు ఆప‌రేష‌న్ కంట్రోల్ సెంట‌ర్ ను వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించారు.  ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయ‌ల్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ యోగి ఆదిత్య‌నాథ్ లు కూడా పాల్గొన్నారు.  

ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భం లో మాట్లాడుతూ, ఆధునిక రైలు సంబంధ మౌలిక స‌దుపాయాల ప‌థ‌కం వాస్త‌వంగా కార్య‌రూపం దాల్చ‌డాన్ని చూసి సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.  ఈ రోజున ఖుర్జా-భావూపుర్ ఫ్రైట్ కారిడర్ లో మొట్ట‌మొద‌టి స‌ర‌కుల ర‌వాణా రైలు బండి ప‌రుగులు తీస్తూ ఉంటే స్వ‌యంస‌మృద్ధియుత భార‌త‌దేశం తాలూకు గర్జ‌న‌ ను మనం స్పష్టంగా విన‌వ‌చ్చ‌ు అని ఆయ‌న అన్నారు.  ఆధునిక కంట్రోల్ సెంట‌ర్ ల‌లో ప్ర‌యోగ్ రాజ్ ఆప‌రేష‌న్ కంట్రోల్ సెంట‌ర్ ఒక‌టి, అది న్యూ ఇండియా తాలూకు కొత్త శ‌క్తి కి ఒక సంకేత‌ం అని ఆయ‌న అన్నారు.

ఏ దేశం శక్తి కి అయినా మౌలిక స‌దుపాయాలు అతి పెద్ద వ‌న‌రు గా ఉంటాయి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  భార‌త‌దేశం ఒక పెద్ద ఆర్థిక శ‌క్తి గా మారే మార్గం లో శ‌ర‌వేగం గా ప‌య‌నిస్తున్న స‌మ‌యం లో, అటువంట‌ప్పుడు ఉత్త‌మ సంధానం అనేది దేశ అగ్ర ప్రాధాన్యాల‌లో ఒక‌టి గా ఉంటుంది అని ఆయ‌న అన్నారు.  ప్ర‌భుత్వం ఇదే విష‌యాన్ని దృష్టి లో పెట్టుకొని గ‌త ఆరేళ్ళ‌లో ఆధునిక సంధానం తాలూకు ప్ర‌తి ఒక్క అంశం పైనా కృషి చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.  ప్ర‌భుత్వం హైవేస్, రైల్వేస్‌, ఎయ‌ర్‌ వేస్‌, వాట‌ర్ వేస్‌, అలాగే ఐ-వేస్ అనే అయిదు చ‌క్రాల పైన శ్ర‌ద్ధ తీసుకొంటోంద‌ని ఆయ‌న అన్నారు.  ఈస్ట‌ర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ లో ఒక పెద్ద భాగాన్ని ఈ రోజు న ప్రారంభించుకోవ‌డం ఈ దిశ‌ లో ఒక పెద్ద అడుగు అని ఆయ‌న అభివ‌ర్ణించారు.  

ఈ త‌ర‌హా ప్ర‌త్యేక ఫ్రైట్ కారిడర్ ల అవ‌స‌రం ఎంత‌యినా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి నొక్కి చెప్పారు.  జ‌నాభా పెరుగుతున్న కొద్దీ, ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధి చెందుతూ ఉన్న కొద్దీ స‌ర‌కు ర‌వాణాకు డిమాండు అనేక రెట్లు పెరిగింద‌ని ఆయ‌న అన్నారు.  ప్ర‌యాణికుల రైళ్ళు, స‌ర‌కు ర‌వాణా రైళ్ళు ఒకే రైలు పట్టాల పైన నడుస్తూ పోతాయ‌ని, స‌ర‌కు ర‌వాణా రైలు వేగం నెమ్మ‌ది గా ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు.  స‌ర‌కు ర‌వాణా రైలు వేగం నెమ్మ‌ది గా ఉన్నప్పుడు, ఏదైనా అంత‌రాయం ఏర్ప‌డిందంటే గనక ర‌వాణా ఖ‌ర్చు పెరిగిపోతుందని ఆయ‌న చెప్పారు.  ఖ‌రీదు ఎక్కువ‌ గా ఉండే కార‌ణం గా మ‌న ఉత్ప‌త్తులు దేశీయ బ‌జారుల‌తో పాటు విదేశాల‌లో సైతం ఎదుర‌య్యే పోటీ లో న‌ష్ట‌పోతాయి అని ఆయ‌న వివ‌రించారు.  ఈ స్థితి ని మార్చ‌డానికే ప్రత్యేక ఫ్రైట్ కారిడర్ ప‌థ‌క ర‌చ‌న జ‌రిగింది అని ఆయ‌న తెలిపారు.  మొద‌టి ద‌శ‌ లో రెండు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ ల‌ను రూపొందించాల‌ని ప్ర‌ణాళిక వేయ‌డ‌మైంది.  లుథియానా నుంచి పశ్చిమ బంగాల్ లోని దాన్ కునీ వ‌ర‌కు ఈస్ట‌ర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ సాగుతుంది.  ఈ మార్గం లో బొగ్గు గ‌నులు, బొగ్గు ఆధారిత విద్యుత్తు ప్లాంటులు, పారిశ్రామిక న‌గ‌రాలు ఉన్నాయి.  వీటికోసం ఫీడ‌ర్ రూట్ ల‌ను కూడా నిర్మించ‌డం జ‌రుగుతోంది.  ఇక మహారాష్ట్ర లోని జ‌వాహ‌ర్ లాల్ నెహ్ రూ పోర్ట్ ట్ర‌స్ట్ (జెఎన్ పిటి) నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని దాద్ రీ వ‌ర‌కు వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ ఏర్పాటవుతుంది.  ఈ కారిడర్ లో ముంద్రా, కాండ్ లా, పిపావావ్, దావ్ రీ, హ‌జీరా ల వంటి నౌకాశ్రాయాలు ఫీడ‌ర్ రూట్ ల ద్వారా సేవ‌ల‌ను అందుకోనున్నాయి.  ఈ రెండు ఫ్రైట్ కారిడర్ ల చుట్టుపక్కల దిల్లీ- ముంబ‌యి ఇండస్ట్రియల్ కారిడర్ తో పాటు అమృత్‌స‌ర్‌- కోల్‌కాతా ఇండస్ట్రియల్ కారిడర్ ను అభివృద్ధి చేయడం జ‌రుగుతోంది.  ఇదే విధం గా ఉత్త‌రాన్ని ద‌క్షిణంతోను, తూర్పు ను ప‌శ్చిమంతోను కలిపే ఇటువంటి విశేషమైన రైల్ కారిడర్ ల‌ను కూడా నిర్మించే ప్ర‌ణాళిక‌లు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఆ కోవ‌ కు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ లు జాప్యానికి గుర‌య్యే ప్ర‌యాణికుల రైళ్ళ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌గ‌లుగుతాయ‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  ఈ కార‌ణం గా స‌ర‌కు ర‌వాణా రైలు వేగం కూడా మూడింత‌లు అయ్యి, రెట్టింపు స‌ర‌కుల రాశి ని మోసుకు పోగ‌లుగుతుంది.  స‌ర‌కు ర‌వాణా రైళ్ళు అనుకున్న స‌మ‌యానికే గ‌మ్యాన్ని చేరితే మ‌న లాజిస్టిక్స్ నెట్ వ‌ర్క్ వ్య‌యం చౌక‌ గా మారుతుంద‌ని ఆయ‌న అన్నారు.  మ‌న స‌రుకులు చౌక‌గా ఉన్న‌ప్పుడు, దాని ద్వారా మ‌న ఎగుమ‌తులు లాభ‌సాటిగా మారుతాయి అని చెప్పారు.  ఇది ఒక చ‌క్క‌ని వాతావ‌ర‌ణాన్ని ఏర్పరుస్తుంది, వ్యాపార నిర్వ‌హ‌ణ లో సౌల‌భ్యం అధిక‌మై, భార‌త‌దేశం పెట్టుబ‌డి పెట్టేందుకు ఒక ఆక‌ర్ష‌ణీయ‌మైన స్థానం గా మారుతుంది;  స్వ‌తంత్రోపాధి కల్ప‌న తాలూకు అనేక కొత్త అవ‌కాశాలు కూడా అందివ‌స్తాయి అని ఆయ‌న అన్నారు.

ప‌రిశ్ర‌మ‌, వ్యాపారులు, రైతులు, వినియోగ‌దారులు.. ప్ర‌తి ఒక్క‌రు ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ నుంచి ప్ర‌యోజ‌నాల‌ను పొందుతార‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.  ఫ్రైట్ కారిడర్ భార‌త‌దేశం లో పారిశ్రామికంగా వెనుక‌ప‌ట్టు ప‌ట్టిన తూర్పు ప్రాంత రాష్ట్రాల‌కు ఉత్తేజాన్ని అందించ‌గ‌లుగుతుంద‌ని ఆయ‌న అన్నారు.  ఈ కారిడర్ లో ఇంచుమించు 60 శాతం యుపి లో ఉంద‌ని ఆయ‌న చెప్పారు.  ఇది ఎన్నో ప‌రిశ్ర‌మ‌ల‌ను యుపి వైపున‌కు ఆక‌ర్షిస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.  ఈ ప్ర‌త్యేక ఫ్రైట్ కారిడర్ కార‌ణంగా కిసాన్ రైలుకు ల‌బ్ధి చేకూరుతుంద‌ని ఆయ‌న అన్నారు.  రైతులు వారి ఉత్ప‌త్తి ని రైలు ద్వారా దేశం అంత‌టా ఉన్న ఏ పెద్ద బ‌జారుల‌కైనా సుర‌క్షితంగా, త‌క్కువ ధ‌ర‌కు పంప‌వ‌చ్చ‌ని చెప్పారు.  ప్ర‌స్తుతం ఈ ఫ్రైట్ కారిడర్ ద్వారా వారి ఉత్ప‌త్తి మ‌రింత వేగం గా చేరుతుంద‌న్నారు.  ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో కిసాన్ రైల్ కార‌ణం గా ఎన్నో నిలవ సదుపాయాలు, శీత‌లీక‌ర‌ణ నిల‌వ సదుపాయాలు తెర మీద‌కు వ‌చ్చాయ‌ని చెప్పారు.

గ‌తం లో ప్ర‌త్యేక ఫ్రైట్ కారిడర్ అమ‌లు లో భారీ జాప్యాలు త‌లెత్త‌డం పట్ల ప్ర‌ధాన మంత్రి విచారం వ్య‌క్తం చేశారు.  2014 వ సంవ‌త్స‌రం వ‌ర‌కు ఒక కిలో మీట‌రు మార్గాన్ని అయినా వేయ‌లేక‌పోయార‌ని ఆయ‌న అన్నారు.  2014 వ సంవ‌త్స‌రం లో ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ, అన్ని భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో స‌మావేశం ల ఫ‌లితం గా సుమారు 1100 కిలో మీట‌ర్ల మేర ప‌ని రాబోయే కొద్ది నెల‌ల్లో పూర్తి కానుంద‌ని ఆయ‌న వివ‌రించారు.  రైళ్ళు న‌డిచే మార్గాల కంటే రైళ్ళ సంఖ్య‌ ను పెంచ‌డం పైనే దృష్టి పెట్టిన ఇదివ‌ర‌క‌టి హ‌యాముల మ‌న‌స్త‌త్వాన్ని ఆయ‌న విమ‌ర్శించారు.  రైల్ నెట్ వ‌ర్క్ ఆధునీక‌ర‌ణ పై ఏమంత పెట్టుబ‌డి పెట్ట‌లేద‌న్నారు.  ప్ర‌త్యేక రైలు బ‌డ్జెటు ను తొల‌గించి, రైలు మార్గం పై పెట్టుబ‌డి పెట్ట‌డం తో, ఈ స్థితి లో మార్పు వ‌చ్చింది అని ఆయ‌న అన్నారు.  ప్ర‌భుత్వం రైల్ నెట్ వ‌ర్క్ విస్త‌ర‌ణ‌ పై, విద్యుద్దీక‌ర‌ణ పై శ్ర‌ద్ధ తీసుకొందని, మాన‌వ‌ ర‌హిత రైల్ క్రాసింగ్ ల‌ను తీసివేసింద‌ని ఆయ‌న చెప్పారు.

రైల్వేల‌ లో ప్ర‌తి ఒక్క స్థాయి లో.. ఉదాహ‌ర‌ణ‌ కు ప‌రిశుభ్ర‌త‌, మెరుగైన ఆహారం, పానీయాలు, త‌దిత‌ర స‌దుపాయాల క‌ల్ప‌న వంటి అంశాల‌లో.. సంస్క‌ర‌ణ‌ల‌ ను చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  అదే మాదిరి గా రైల్వేల‌ కు సంబంధించిన త‌యారీ లో స్వ‌యంస‌మృద్ధి రంగం లో ఒక పెద్ద కార్య‌సాధ‌న చోటు చేసుకొంది అని ఆయ‌న అన్నారు.  భార‌త‌దేశం ప్ర‌స్తుతం ఆధునిక రైళ్ళ‌ను నిర్మిస్తూ, వాటిని ఎగుమ‌తి చేస్తోంది కూడా అని ఆయ‌న చెప్పారు.  వారాణ‌సీ విద్యుత్తు రైలు ఇంజ‌న్ ల‌కు ఒక ప్ర‌ముఖ కేంద్రం గా ఎదుగుతోంద‌ని, రాయ్ బ‌రేలీ లో త‌యార‌వుతున్న రైలు పెట్టెలు ప్ర‌స్తుతం విదేశాల‌కు ఎగుమ‌తి అవుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు.

దేశం లో మౌలిక స‌దుపాయాల అభివృద్ధి ని రాజ‌కీయాల‌కు దూరంగా ఉంచాల‌ని ప్ర‌ధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.  దేశ మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌ ను 5 సంవ‌త్స‌రాల రాజ‌కీయాల తాలూకు ల‌బ్ధి కి బ‌దులు, అనేక త‌రాల ల‌బ్ధి కి ఉద్దేశించిన ఒక కార్య‌క్ర‌మం గా చూడాలి అని ఆయ‌న అన్నారు.  రాజ‌కీయ ప‌క్షాలు గ‌నుక పోటీ ప‌డేట‌ట్ల‌యితే, మౌలిక స‌దుపాయాల నాణ్య‌త‌, వేగం, స్థాయి ల వంటి విష‌యాల‌లో పోటీ పడాలి అని ఆయ‌న అన్నారు.  ప్ర‌ద‌ర్శ‌న‌లు, ఉద్యమాల కాలం లో సార్వ‌జ‌నిక ఆస్తి ని ధ్వంసం చేయ‌కూడ‌దు అంటూ ఆయ‌న సూచించారు.  ఎవ‌రైనా వారి ప్ర‌జాస్వామిక హ‌క్కు ను చాటుకొనేట‌ప్పుడు దేశ ప్ర‌జ‌ల ప‌ట్ల వారికి గ‌ల బాధ్య‌త‌ ను మ‌ర‌చిపోకూడదు అని ఆయ‌న కోరారు.  




 

***
 


(Release ID: 1684380) Visitor Counter : 201