ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

స్వరాజ్యం కోసం, దేశాభివృద్ధి కోసం పాటు పడిన మహనీయుల జీవితాలను యువత అధ్యయనం చేయాలి - ఉపరాష్ట్రపతి

- శ్రీ పి.వి. నరసింహారావు గారి నుంచి ఉదారవాద భావాలను, నిరాడంబరతను యువత అలవరచుకోవాలి

- ప్రజాజీవితంలోకి రావాలనుకుంటున్న వారు శ్రీ పీవీ జీవితం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి

- దేశ భవిష్యత్ ను విశాల దృష్టితో వీక్షించి ఓ తపస్విలా దేశాభివృద్ధిని వేగవంతం చేసిన శ్రీ పీవీ

- స్వావలంబన, స్వయం సమృద్ధికి శ్రీ పీవీ నరసింహారావు గారు పెద్ద పీట వేశారు

- శ్రీ పీవీ చేపట్టిన సంస్కరణలు దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు వేశాయి

- శ్రీ పి.వి.నరసింహారావు గారి జీవితంలోని కీలక ఘట్టాల సంకలనంగా రూపుదిద్దుకున్న విప్లవతపస్వి – పీవీ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

Posted On: 27 DEC 2020 2:38PM by PIB Hyderabad

దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టిన దేశ భక్తుల చరిత్రలతో పాటు దేశాభివృద్ధికి పాటు పడిన మహనీయుల జీవితాలను యువత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి శ్రీ మప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. భారతదేశ మాజీ ప్రధాన మంత్రి శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు గారి జీవితంలోని కీలక ఘట్టాల సంకలనంగా ప్రముఖ పాత్రికేయుడు, కవి, రచయిత శ్రీ కృష్ణారావు గారు రచించిన “విప్లవ తపస్వి – పీవీ” పుస్తకాన్ని హైదరాబాద్ లో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. 

భారతదేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో దేశ ప్రధానిగా శ్రీ పీవీ నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టారన్న ఉపరాష్ట్రపతి, మైనారిటీ ప్రభుత్వంలో కొనసాగుతూనే రాజకీయ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ, అయిదు సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగడమే గాక, దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేశారని తెలిపారు. శ్రీ పీవీ అధికార పగ్గాలు చేపట్టిన సమయంలో దేశంలోని రాజకీయ అస్థిరత, అంతకు ముందు ప్రభుత్వాలు దేశ అవసరాలకు తగ్గట్టు వేగంగా చర్యలు తీసుకోకపోవడం లాంటివి తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి దారి తీసాయన్న ఆయన, ఆర్థిక సంస్కరణలు అమలు చేయాల్సిన బాధ్యత శ్రీ పీవీ భుజస్కందాల మీద పడిందని, వాటిని ఆయన సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు.

కేవలం ఆర్థిక సంస్కరణలు మాత్రమే కాకుండా బలమైన పారిశ్రామిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత శ్రీ పీవీ నరసింహారావు గారిదేనన్న ఉపరాష్ట్రపతి, లైసెన్స్ రాజ్ ను రద్దు చేసి, ప్రభుత్వానికి ఉన్న విచక్షణాధికారాలు తొలగించి ఎగుమతులకు ప్రోత్సాహం ఇవ్వడమే గాక, దిగుమతుల విధానాలను సరళం చేశారని తెలిపారు. విదేశీ పెట్టు బడుల బోర్డు, బ్యాంకింగ్ సంస్కరణలు, టెలికామ్ రంగ ఆధునీకరణ, విద్యుత్ రంగ ప్రైవేటీకరణ, కరెన్సీ మరియు క్యాపిటల్ మార్కెట్లకు స్వేచ్ఛ కల్పించడమే గాక విమానయాన రంగంలో ప్రైవేటీ కరణ, ప్రైవేట్ బ్యాంకులకు అనుమతి లాంటి వాటి ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యానికి గట్టి పునాదులు వేశారని తెలిపారు. 

వ్యవసాయం రంగంలో శ్రీ పి.వి.నరసింహారావు చేపట్టిన సంస్కరణలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఆహారధాన్యాల రవాణాపై ఆంక్షలు ఎత్తేసేందుకు కీలక చర్యలు తీసుకుని సేకరణ ధరలు పెరగడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడమే గాక, ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యుటీవో)లో భారతదేశాన్ని సంస్థాపక దేశంగా చేర్చి, దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేయగల చర్యలకు శ్రీ పీవీ శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు. 

కొన్ని అంశాల్లో పీవీగారితో విభేదించినప్పటికీ.. స్వావలంబన, స్వయం సమృద్ధికి శ్రీ పీవీ గారు పెద్ద పీట వేశారన్న ఉపరాష్ట్రపతి, ఆ కారణంగానే నేడు పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం అంతర్జాతీయ దేశాల సరసన నిలబడేందుకు మార్గం సుగమమైందని తెలిపారు. ప్రారంభంలో అనేక రాజకీయ సవాళ్ళు ఎదురైనా, ఎంతో సాహసంతో అధిగమించి దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రైవేట్ రంగం, మానవవనరులకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. దేశం తన కాళ్ళ మీద తాను నిలబడాలంటే కఠిన నిర్ణయాలు తప్పవన్న శ్రీ పీవీ మాటలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, శ్రీ నరసింహారావు గారు అనేక మొక్కలు నాటారని, ఇప్పుడు అవి బలమైన వృక్షాలు ఎదుగుతున్నాయన్నారు. ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదురైనా, ఒక్కసారి మొక్కలు వృక్షాలుగా ఎదిగితే ఏనుగులు కూడా వాటిని పెకిలించడం కష్టసాధ్యమన్న శ్రీ పీవీ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పంచాయితీల నుంచి మున్సిపాలిటీల వరకూ ఎన్నికలు జరిగేందుకు వీలుగా 73, 74వ రాజ్యాంగ సవరణలు, వీటిలో 33 శాతం రిజర్వేషన్ ద్వారా రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యతను పెంచే చర్యలు సైతం పీవీ హయాంలోనే జరిగిన విషయాన్ని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, పార్లమెంట్ స్థాయీ సంఘాల వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చెయ్యడం, పార్లమెంట్ సభ్యుల నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎంపీ లాడ్స్ పథకాన్ని ప్రారంభించడం లాంటివి ఆయన క్రాంతదర్శనానికి నిదర్శనమని తెలిపారు. దేశ భవిష్యత్ ను విశాలమైన దృష్టితో వీక్షించి, తనకు ఘనత దక్కపోయినా సరే ఒక యోగిలా దేశానికి ఏది అవసరమో ఆయా కార్యక్రమాలను చేపట్టిన ద్రష్ట శ్రీ పీవీ గారు అనడంలో  ఎలాంటి సందేహం లేదని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 

అవకాశాలను ఒడిసి పట్టడం, ప్రాచీన భారత ఆలోచనా విధానం ద్వారా మనిషి ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవడం గురించి శ్రీ పీవీ గతంలో చెప్పిన అనేక అంశాలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, వారి జీవితం నుంచి ఉదారవాద భావాన్ని, నిరాడంబరతను యువత అలవరచుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రజా జీవితంలోకి రావాలనుకుంటున్న వారు, శ్రీ పీవీ జీవితం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని తెలిపారు. బహుభాషా కోవిదుడు, సాహితీ వేత్త, పండితుడు. స్వాతంత్ర్య సమరయోధుడు అయిన శ్రీ పీవీ గారు నిజమైన దేశ భక్తుడని, అలాంటి వ్యక్తి తెలుగువారు కావడం జాతికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. 

శ్రీ పీవీ గారి కాలం నుంచి ఢిల్లీలో పని చేస్తున్న పుస్తక రచయిత శ్రీ ఎ.కృష్ణారావు గారు అనేక ఘట్టాలను దగ్గర నుంచి పరిశీలించారని, వాటన్నింటినీ సంకలనం చేసి ఈ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. పాత్రికేయ వృత్తిలో రాణిస్తూనే కవిగా, రచయితగా తన కలానికి పదును పెట్టి అనేక రచనలు చేస్తున్న వారి సాహితీ వ్యాసాంగాన్ని ఇలానే కొనసాగించి, మరిన్ని రచనలు తీసుకు రావాలని ఆకాంక్షించారు. శ్రీ పీవీ గారి శతజయంతిని పురస్కరించుకుని ఈ పుస్తకాన్ని ప్రచురించే చొరవ తీసుకున్న రాఘవేంద్ర పబ్లికేషన్స్ అధినేత శ్రీ రాఘవేంద్రరావు గారిని ఉపరాష్ట్రపతి అభినందించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు శ్రీ కె.కేశవరావు, పుస్తక రచయిత శ్రీ ఎ.కృష్ణారావు, పుస్తకర ప్రచురణకర్తలు శ్రీ రాఘవేంద్రరావు, శ్రీ రాఘవ, పాత్రికేయులు శ్రీ ఎ.శ్రీనివాసరావు, శ్రీ మా శర్మ పాల్గొన్నారు.

 

***


(Release ID: 1683982) Visitor Counter : 205