ప్రధాన మంత్రి కార్యాలయం

జమ్ము- కశ్మీర్ నివాసులు అందరికీ వర్తించేటట్లుగా ఆయుష్మాన్ భారత్ పిఎమ్-జెఎవై సేహత్ ను డిసెంబర్ 26 వ తేదీ న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

Posted On: 24 DEC 2020 6:13PM by PIB Hyderabad

కేంద్ర పాలిత ప్రాంతం అయిన జమ్ము- కశ్మీర్ లోని నివాసులు అందరికీ వర్తించే విధంగా ఆయుష్మాన్ భారత్ పిఎమ్-జెఎవై సేహత్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2020 వ సంవత్సరం డిసెంబర్ 26 వ తేదీ న మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.  ఈ పథకం సార్వజనిక ఆరోగ్య రక్షణ కు పూచీపడటం తో పాటు అందరు వ్యక్తులకు, సముదాయాలకు నాణ్యమైన అత్యవసర ఆరోగ్య సేవ లు తక్కువ ఖర్చు లో అందేటట్టు చూస్తూ, ఆర్థికపరంగా వాటిల్లగల నష్ట భయం నుంచి రక్షణ ను కూడా అందించడంపైన శ్రద్ధ తీసుకోనుంది.  ఈ కార్యక్రమం లో కేంద్ర హోం శాఖ మంత్రి, జమ్ము- కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ లు కూడా పాలుపంచుకోనున్నారు.  

ఈ పథకం జమ్ము- కశ్మీర్ నివాసులు అందరికీ బీమా రక్షణ ను ఉచితం గా అందిస్తుంది.  ఇది జమ్ము- కశ్మీర్ నివాసులు అందరికీ ఫ్లోటర్ బేసిస్ పై ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక కవచాన్ని సమకూర్చుతుంది.  ఇది అదనం గా దాదాపు గా 15 లక్షల కుటుంబాలకు పిఎమ్- జెఎవై కార్యక్రమ ప్రయోజనాలు దక్కే అవకాశాన్ని సైతం కల్పిస్తుంది.  ఈ పథకం పిఎమ్- జెఎవై తో పాటు బీమా  పద్ధతి లో అమలులోకి రానుంది.  ఈ  పథకం తాలూకు లబ్ధి ని దేశం అంతటా వినియోగించుకొనేందుకు వీలు ఉంటుంది.  పిఎమ్- జెఎవై పథకం లో భాగం గా సేవలను అందించేందుకు ఆమోదం లభించిన ఆసుపత్రులు ఈ పథకం లో భాగంగా కూడా సేవలను అందజేస్తాయి.

సార్వజనిక ఆరోగ్య రక్షణ లక్ష్యాన్ని సాధించడం

ఆరోగ్యంగా ఉండడాన్ని ప్రోత్సహించడం మొదలుకొని ముందుజాగ్రత్త చర్యలు, చికిత్స, పునరావాసం, ఉపశమనకారి సంరక్షణ వరకు అత్యవసరమైన, నాణ్యమైన ఆరోగ్య సేవలన్నీ సార్వజనిక ఆరోగ్య రక్షణ (యూనివర్సల్ హెల్థ్ కవరేజి.. యుహెచ్ సి) లో కలసి ఉంటాయి.  అంతేకాక ప్రతి ఒక్కరికి సేవలు దక్కే అవకాశాన్ని కల్పిస్తూ, ఆరోగ్య సేవలను పొందడానికి ప్రజలు వారి సొంత డబ్బు ను ఖర్చుపెట్టడానికి సంబంధించిన చిక్కుల నుంచి వారిని కాపాడుతుంది కూడాను.  తద్వారా ప్రజలు పేదరికం లో మగ్గిపోయే రిస్కు ను యుహెచ్ సి తగ్గిస్తుందన్న మాట.  హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్స్, ‘ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన’.. ఈ రెండూ మూలాధారాలు గా ‘ఆయుష్మాన్ భారత్ కార్యక్రమా’న్ని సార్వజనిక ఆరోగ్య రక్షణ లక్ష్య సాధన కోసం రూపొందించడం జరిగింది.


***(Release ID: 1683504) Visitor Counter : 187