సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఎ.వి.జి.సి. నిపుణులు భారతీయ సినిమాలకు పనిచేయాలి: కేంద్రమంత్రి జవదేకర్
“2021లో గ్లోబల్ మీడియా, చలనచిత్ర శిఖరాగ్ర సదస్సును
నిర్వహించబోతున్న భారత్”
Posted On:
16 DEC 2020 1:41PM by PIB Hyderabad
భారతీయ పరిశ్రమల సమాఖ్య (సి.ఐ.ఐ.) ఆధ్వర్యంలో ఈ రోజు బిగ్ పిక్చర్ సమ్మిట్ పేరిట డిజిటల్ పద్ధతిలో మొదలైన శిఖరాగ్ర సమావేశానికి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఒక సందేశమిచ్చారు. బిగ్ పిక్చర్ సమ్మిట్.ను నిర్వహించిన సి.ఐ.ఐ.కి కేంద్రమంత్రి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ “కమ్యూనికేషన్ టెక్నాలజీ అసాధారణంగా అభివృద్ధి చెందిన దేశం మనది. దేశంలో వినోద రంగానికి, మీడియా పరిశ్రమకు విస్తృతమైన అవకాశాలు లభిస్తాయి” అని అన్నారు."యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ (ఎ.వి.జి.సి.)రంగాల్లో సత్వర అభివృద్ధికి అవకాశం ఉంది. ఈ రంగాల్లో మన నిపుణులు ప్రపంచంలోని అగ్రశ్రేణి చలనచిత్ర నిర్మాతలకు సంపూర్ణ మద్దతును అందిస్తున్నారు" అని మంత్రి అన్నారు. అయితే, వీరు ఇకపై మన చిత్రాలకు పనిచేయాల్సిన తరుణం వచ్చేసిందని, భారతీయ చిత్రాలలో యానిమేషన్ మరియు గ్రాఫిక్స్ వాడకం గణనీయంగా పెరిగేలా ఈ నిపుణులు చొరవ చూపాలని అన్నారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బాంబే సహకారంతో ప్రతిభాపాటవాల కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, ఈ కేంద్రంలో ఎ.వి.జి.సి. అధ్యయనంకోసం తగిన కోర్సులు అందుబాటులో ఉంటాయని ఆయన ప్రకటించారు. ఈ రంగంలో ఔత్సాహికులను, స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడానికి కేంద్రం చొరవ తీసుకుంటుందన్నారు.
2021 జనవరిలో గోవాలో జరగనున్న 51 వ భారతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐ.ఎఫ్.ఎఫ్.ఐ.)లో పాల్గొనాలని సభలోని ప్రేక్షకులను మంత్రి ఆహ్వానించారు. 2022లో కేన్స్ చలన చిత్రోత్సవం 75 వసంతాల వేడుకను జరుపుకుంటున్నందున అక్కడ మనదేశం ప్రత్యేక పెవిలియన్.ను ఏర్పాటు చేస్తుందన్నారు. వచ్చే ఏడాది ప్రపంచ స్థాయిలో మీడియా, చలచిత్రాలపై శిఖరాగ్ర సమ్మేళనాన్ని భారత్ నిర్వహిస్తుందని ప్రకటించారు.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ ఖరే మాట్లాడుతూ, కేటాయింపు నిబంధనలకు నవంబరులో జరిగిన సవరణను ప్రస్తావించారు. చలనచిత్రరంగంలో సదుపాయాల కల్పనా పాత్రను మాత్రమే ప్రభుత్వం పోషిస్తుందన్నారు. అన్ని మంత్రిత్వ శాఖలపై సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకే అత్యధిక ప్రభావం ఉందని, అదికూడా ప్రైవేటు రంగం ద్వారానే వస్తోందని ఆయన అన్నారు. దేశంలో దాదాపు అన్ని చిత్ర నిర్మాణాలు ప్రైవేటు రంగంలోనే జరిగాయని, ప్రసార భారతి మినహా మిగతా ఛానెళ్లు అన్నీ ప్రైవేటు సంస్థలవేనని, వీక్షకులకు నేరుగా అందుబాటులో ఉన్న ఒవర్ ది టాప్ (ఒ.టి.టి.) మాధ్యమం కూడా పూర్తిగా ప్రైవేటు రంగంలోనే ఉందని అన్నారు.
మీడియా, వినోద పరిశ్రమ ఎంతో అభివృద్ధి సాధించిందని, ఆ పరిశ్రమకు తగిన సదుపాయాలను మనం తప్పనిసరిగా అందించవలసి ఉందని ఖరే అన్నారు. కోవిడ్ మహమ్మారి సంక్షోభంతో విద్యాపరమైన సాంకేతిక పరిజ్ఞానం వంటి కొత్తతరహా మార్గాలు అందుబాటులోకి వచ్చాయని, ఇండియన్ గేమింగ్ రంగానికి ఎగుమతి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.
2022లో మనం 75వ స్వాతంత్ర్య వేడుకలను స్వదేశంలోనూ, విదేశాల్లోనూ జరుపుకుంటున్న నేపథ్యంలో సాఫ్ట్ టెక్నాలజీలో భారతదేశం శక్తి సామర్థ్యాలను మీడియా, వినోద మార్గాల ద్వారా చూపించాలని ఆయన మీడియా, వినోద పరిశ్రమకు పిలుపునిచ్చారు.
ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.) శశిశేఖర్ వెంపటి మాట్లాడుతూ, కోవిడ్ వైరస్ వ్యాప్తి సంక్షోభ సమయంలో ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించే అంశాలను పలు చానళ్లద్వారా ప్రసారం చేసినట్టు తెలిపారు. ఇది దూరదర్శన కృషిని ప్రతిఫలింపజేసిందన్నారు. రామాయణ్, మహాభారత్ వంటి సీరియల్స్ ప్రసారంతో యావత్ కుటుంబానికి అవసరమైన ప్రసారాంశాలకు ఇప్పటికీ వీక్షకులున్నారని తేటతెల్లమైందన్నారు. డి.డి. ఫ్రీ డిష్ ప్రపంచంలోనే గొప్ప చెప్పుకోదగిన ప్రయత్నమన్నారు. ఫైవ్-జి (5-జి) వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానం ప్రసారాలను స్మార్ట్ ఫోన్ల స్థాయికి తీసుకెళ్లిందని, ఈ అవకాశాన్ని దేశంలోని స్టార్టప్ కంపెనీలు సద్వినియోగం చేసుకుంటున్నాయని అన్నారు.
నేపథ్యం:
ది బిగ్ పిక్చర్ సమ్మిట్ అనేది కేంద్ర ఎలెక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రధాన కార్యక్రమం. ప్రభుత్వానికి, పరిశ్రమకు, అంతర్జాతీయ నిపుణులకు సంబంధించిన భాగస్వామ్య వర్గాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు పరిజ్ఞానాలు కీలకపాత్ర పోషిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో విజయవంతమైన అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
సి.ఐ.ఐ. ఆధ్వర్యంలో బిగ్ పిక్చర్ సమ్మిట్ పేరిట శిఖరాగ్ర సమావేశం ఈ రోజునుంచి 18వ తేదీవరకూ డిజిటల్ వేదికపై జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించే పలు సదస్సుల్లో మీడియా, వినోద పరిశ్రకు సంబంధించిన కంటెంట్ క్రియేటర్లు, ప్రసార సంస్థలు, కొనుగోలుదారులు, స్డూడియో నిర్వహణా సంస్థలు, చిత్ర నిర్మాణ సంస్థలు, ప్రచురణ కర్తలు, పంపిణీదార్లు, పాలుపంచుకుంటున్నారు.
****
(Release ID: 1681126)
Visitor Counter : 206
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada