వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

విదేశీ పెట్టుబడిదారులు భారత వృద్ధి ప్రస్థానంలో భాగం కావాలని శ్రీ పియూష్ గోయల్ ఆహ్వానించారు

ప్రపంచంలో అత్యంత సులభమైన ఎఫ్‌డిఐ విధానాలలో భారతదేశం ఒకటి- అని చెప్పారు

Posted On: 15 DEC 2020 1:54PM by PIB Hyderabad

రైల్వే, వాణిజ్యం & పరిశ్రమ, వినియోగదారుల వ్యవహారాలు మరియు ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ విదేశీ పెట్టుబడిదారులను భారతదేశ వృద్ధి ప్రస్థానంలో ఒక భాగం కావాలని ఆహ్వానించారు. ఈ రోజు వర్చువల్ మార్గాల ద్వారా సిఐఐ భాగస్వామ్య సదస్సు 2020 ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన ఆయన, వారిని విశాల హృదయంతో, అత్యంత గౌరవమర్యాదలతో ఆహ్వానిస్తూ, ఈ అవకాశాలకు నెలవైన ఈ గడ్డపైకి మీరు చేసే ప్రయాణానికి పూర్తి భాగస్వామ్యం, తోడ్పాటు, పరిపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. 

"మా ఆర్థిక వ్యవస్థలో కొత్త రంగాలను ప్రపంచ పెట్టుబడిదారులకు భారతదేశం క్రమపద్ధతిలో తెరుస్తోంది, వివిధ పెట్టుబడి భాగస్వాములతో వ్యూహాత్మక సంబంధాల ద్వారా వ్యాపారాలను ప్రోత్సహిస్తుంది, భవిష్యత్తు కోసం మన ఆర్థిక ప్రణాళికలను బలోపేతం చేస్తుంది. భారతదేశంలో ఎఫ్‌డిఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) ప్రవాహాలు నిరంతరం పెరుగుతున్నాయి" అని ఆయన అన్నారు. "ఈ సంవత్సరం మొదటి 9 నెలల్లో, కోవిడ్-19 మహమ్మారి గరిష్ట స్థాయిలో ఉన్న సమయంలో కూడా మా ఎఫ్డిఐ పెరిగింది.  ప్రపంచంలో అత్యంత సులభమైన ఎఫ్‌డిఐ విధానాలలో మాది ఒకటి. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో, ఎఫ్డిఐల ప్రవాహం 40 బిలియన్ డాలర్లు, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 13% ఎక్కువ. గత సంవత్సరం, ప్రపంచంలో ఎక్కడైనా అందుబాటులో ఉన్న అత్యంత ఆకర్షణీయమైన పన్ను రేట్లలో ఒకటి భారతదేశంలోని వ్యాపారాలకు 22% పన్ను మరియు అక్టోబర్ 2019 తరువాత ఏర్పాటు చేసిన కొత్త తయారీ పరిశ్రమలకు 15% పన్ను అని ప్రకటించాము” అని మంత్రి చెప్పారు. 

భారతదేశానికి వచ్చే పరిశ్రమలను ఆకర్షించడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో సహా అనేక కొత్త పథకాలను ప్రవేశపెట్టినట్లు శ్రీ గోయల్ చెప్పారు. "మాకు అన్ని మంత్రిత్వ శాఖలలో పెట్టుబడి ప్రోత్సాహక సెల్స్ ఉన్నాయి. మహమ్మారి ప్రారంభానికి ముందే పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయి, ఆర్థిక వ్యవస్థ మరియు ఉత్పాదకత స్థాయిలను మెరుగుపరచడం లక్ష్యంగా సంస్కరణ చర్యలను భారత్ వేగంగా ప్రకటించింది. మా V- ఆకారపు రికవరీలో ఎక్కువ ప్రపంచ ప్రమేయాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం అనుకూలమైన సంస్కరణలు మరియు సులభతరం చేసే చర్యలను ప్రవేశపెడుతోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడి ఆలోచనతో భారత ప్రజల కోసం రూపొందిన అభివృద్ధి, వృద్ధి మరియు శ్రేయస్సుతో కలిసి పయనం చేయడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను” అని కేంద్ర మంత్రి పిలుపు ఇచ్చారు. 

జీవితాలు, జీవనోపాధులు, వృద్ధికి సంబంధించిన భాగస్వామ్యాల గురించి భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సులో శ్రీ గోయల్ మాట్లాడుతూ, మన ఆర్థిక వ్యవస్థలను వృద్ధి మార్గంలో తిరిగి తీసుకురావడానికి మరియు కొత్త అవకాశాలను ప్రోత్సహించడానికి ఇది మా ఉమ్మడి ప్రయత్నంలో మనందరికీ సహాయపడుతుందని అన్నారు. "మా లక్ష్యం అధిక స్థాయిలో స్థిరంగా వృద్ధి చెందడమే కాదు, 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే లక్ష్యాన్ని సాధించడం. వివిధ రంగాలలో చారిత్రక సంస్కరణలు ప్రజల శ్రేయస్సు స్థాయిలను మెరుగుపరిచే ప్రయత్నంలో దేశాన్ని మంచి స్థితిలో ఉంచుతాయి. క్రొత్త ప్రపంచంలో కొత్త ఆలోచన, వృద్ధికి కొత్త అవకాశాలు ఉంటాయని మేము నమ్ముతున్నాము. ఒక్కరమే అయితే కొంచమే సాధించగలం, కాని కలిసి మన ఊహకు మించి సాధించగలం. ఇది భారతదేశంలో ఉండవలసిన సమయం, భారతదేశంలో మీ ఉనికిని మరియు పెట్టుబడులను విస్తరించే సమయం ఇది. భారతదేశం అవకాశాల భూమి” అని కేంద్ర మంత్రి శ్రీ పియూష్ గోయల్ తెలిపారు. 

*****



(Release ID: 1680939) Visitor Counter : 138