ప్రధాన మంత్రి కార్యాలయం

క్లైమేట్ యాంబిషన్ సమిట్ కు ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం పాఠం

Posted On: 12 DEC 2020 9:21PM by PIB Hyderabad

శ్రేష్ఠులారా,

ఈ శిఖర సమ్మేళనం ప్యారిస్ ఒప్పందానికి అయిదో వార్షికోత్సవాన్ని సూచిస్తోంది.  ప్యారిస్ ఒప్పందం జల వాయు పరివర్తన కు వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటం లో అత్యంత మహత్త్వాకాంక్షతో కూడిన చర్య గా ఉంది.  ఈ రోజు న మనం మన లక్ష్యాన్ని మరింత ఉన్నతంగా నిర్దేశించుకోవాలని ప్రయత్నిస్తున్నాము. మనం గతంలో ఏమి జరిగిందనే దానిని మరచిపోకూడదు.  మనం మన ఆకాంక్షలను సవరించుకోవడం ఒక్కటే కాదు, మనం ఇప్పటికే నిర్దేశించుకొన్న లక్ష్యాలతో మన కార్యసాధనలను పోల్చి సమీక్షించుకోవలసిన అవసరం ఉంది.  అలా చేసినప్పుడే భావి తరాల వారి కోసం మనం చెప్పే మాటలకు విశ్వసనీయత దక్కుతుంది.

శ్రేష్ఠులారా,

భారతదేశం తన ప్యారిస్ ఒప్పంద లక్ష్యాలను సాధించే మార్గంలో పయనిస్తూ ఉండడమే కాకుండా వాటిని  సాధించే విషయంలో అంచనాలను అధిగమించనుంది కూడా.  మేము మా ఉద్గారాల తీవ్రత ను 2005వ సంవత్సరం  స్థాయిల కంటే 21 శాతం మేరకు తగ్గించాము.  మా సౌర సామర్థ్యం 2014వ సంవత్సరం లో గల 2.63  గీగావాట్స్ నుంచి, 2020వ సంవత్సరంలో 36 గీగావాట్స్ కు పెరిగింది.  మా నవీకరణయోగ్య శక్తి సామర్థ్యం ప్రపంచం లో నాలుగో అతి పెద్ద సామర్థ్యంగా ఉంది.

అది 2022వ సంవత్సరం కంటే ముందుగానే 175 గీగావాట్స్ కు చేరుకోనుంది.  మరి, మేము ప్రస్తుతం మరింత మహత్వాకాంక్ష తో కూడిన లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకొన్నాము.  అది ఏమిటంటే, 2030వ సంవత్సరానికల్లా 450 గీగావాట్స్ సామర్థ్యం కలిగివుండే నవీకరణయోగ్య శక్తి ని సాధించుకోవడం అనేదే.  మేము మా వన కవచాన్ని విస్తరించుకోవడంలోను, మా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవడంలోను సఫలం అయ్యాము.  అంతేకాకుండా, ప్రపంచ వేదిక మీద భారతదేశం రెండు ప్రధానమైన కార్యక్రమాలకు కూడా మార్గదర్శి గా నిలచింది.  ఆ రెండు కార్యక్రమాలలో..:
 
• ఒకటోది అంతర్జాతీయ సౌర కూటమి (ఇంటర్నేషనల్ సోలర్ అలయన్స్- ఐఎస్ఎ) కాగా, 
• రెండోది విపత్తుల ను తట్టుకొని నిలచే మౌలిక సదుపాయాల కల్పన కు ఉద్దేశించిన సంకీర్ణం (కొఎలిషన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్.. సిడిఆర్ఐ) ల స్థాపన.

శ్రేష్ఠులారా,

2047వ సంవత్సరంలో, భారతదేశం ఒక ఆధునికమైన, స్వతంత్ర దేశం గా 100 సంవత్సరాల వేడుక ను జరుపుకోనుంది.  ఈ భూ గ్రహం లోని నా తోటి నివాసులు అందరికీ, ఈ రోజు న నేను ఒక పవిత్రమైన వాగ్దానాన్ని చేస్తున్నాను.  శత వర్ష భారతదేశం తన స్వీయ లక్ష్యాలను సాధించడం ఒక్కటే కాకుండా, మీ అంచనాలను అధిగమిస్తుంది కూడా  అనేదే ఆ వాగ్దానం. 
 
మీకు ఇవే ధన్యవాదాలు.


***


(Release ID: 1680330) Visitor Counter : 250