జల శక్తి మంత్రిత్వ శాఖ

'జాతీయ జల పురస్కారాలు-2020' కోసం దరఖాస్తులు ఆహ్వానించిన జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ దరఖాస్తుల సమర్పణకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు గడువు


Posted On: 09 DEC 2020 4:21PM by PIB Hyderabad

జల వనరుల రంగంలో ఆదర్శప్రాయ పనితీరు కనబరిచిన వ్యక్తులు, సంస్థలకు జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చేందుకు, 'జాతీయ జల పురస్కారాలు-2020' కోసం, జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'జల వనరులు, నదుల అభివృద్ధి, గంగ పునరుజ్జీవన' విభాగం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ క్రింది 11 విభాగాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు:

1) ఉత్తమ రాష్ట్రం

2) ఉత్తమ జిల్లా (ఐదు జోన్లలో, జోనుకు 2 చొప్పున అవార్డులు; మొత్తం 10 పురస్కారాలు)

3) ఉత్తమ గ్రామ పంచాయతీ (ఐదు జోన్లలో, జోనుకు 3 చొప్పున అవార్డులు; మొత్తం 15 పురస్కారాలు)

4) ఉత్తమ పట్టణ స్థానిక సంస్థ

5) ఉత్తమ మీడియా (ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌)

6) ఉత్తమ పాఠశాల

7) ఉత్తమ సంస్థ/ఆర్‌డబ్ల్యూఏ/ప్రాంగణ జల వినియోగంలో మత సంస్థ

8) ఉత్తమ పరిశ్రమ

9) ఉత్తమ ప్రభుత్వేతర సంస్థ

10) ఉత్తమ నీటి వినియోగ సంఘం

11) సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల్లో ఉత్తమ పరిశ్రమ

ఉత్తమ జిల్లా, ఉత్తమ గ్రామ పంచాయతీ పురస్కారాలను తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఈశాన్య ప్రాంతాలకు విడివిడిగా ప్రకటిస్తారు.

ఈ 11 విభాగాల కింద మొత్తం 52 అవార్డులు ప్రదానం చేస్తారు. ఉత్తమ రాష్ట్ర, ఉత్తమ జిల్లా పురస్కారాలు కాకుండా; మిగిలిన 9 విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు వరుసగా 2 లక్షలు, లక్షన్నర, లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు.

వర్షపు నీటి సంరక్షణ, కృత్రిమ రీఛార్జ్ ద్వారా భూగర్భ జలాల పెంపు కోసం, సమర్థ నీటి వినియోగం, రీసైక్లింగ్‌, పునర్వినియోగ ప్రోత్సాహం కోసం వినూత్న పద్ధతులను అవలంబించేలా ప్రభుత్వేతర సంస్థలు, గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, నీటి వినియోగ సంఘాలు, సంస్థలు, కార్పొరేట్‌ రంగం, వ్యక్తులు వంటి వర్గాలన్నింటినీ ప్రోత్సహించం ఈ పురస్కారాల లక్ష్యం. లక్షిత అంశాల్లో ప్రజా ప్రాతినిధ్యం ద్వారా అవగాహన పెంచడం కూడా లక్ష్యం. జల వనరుల స్థిర నిర్వహణకు ఇవి కారణమవుతాయని భావిస్తున్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ లోపు జాతీయ జల పురస్కారాల దరఖాస్తులు సమర్పించవచ్చు. https://mygov.in ద్వారా గానీ, nationalwaterawards[at]gmail[dot]com ద్వారా ఈ మెయిల్‌లో గానీ కేంద్ర భూగర్భ జల బోర్డుకు దరఖాస్తులు పంపవచ్చు. ఆన్‌లైన్‌లో అందిన దరఖాస్తులను మాత్రమే కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది.

****



(Release ID: 1679467) Visitor Counter : 137