ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020 లో ప్రసంగించిన ప్ర‌ధాన మంత్రి

భారతదేశాన్ని టెలికమ్ సామగ్రి, డిజైను, అభివృద్ధి, తయారీ లకు ప్రపంచ కేంద్రం గా తీర్చిదిద్దడానికి మనమంతా కలసి పనిచేద్దాం రండి: ప్ర‌ధాన మంత్రి

భవిష్యత్తు లోకి దూసుకుపోయేందుకు 5జి సకాలం లో ప్రారంభం అయ్యేటట్టు మనం శ్రద్ధ వహించాలి: ప్ర‌ధాన మంత్రి

ఇలెక్ట్రానిక్ వ్యర్ధాలను మెరుగైన రీతి లో పరిష్కరిస్తూ, ఒక సర్క్యులర్ ఇకానమి ని ఏర్పాటు చేసేందుకుగాను ఓ టాస్క్ ఫోర్స్ అవసరం అంటూ ఆయన పిలుపునిచ్చారు

Posted On: 08 DEC 2020 11:45AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వ‌ర్చువ‌ల్ పద్ధతి లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్‌సి) లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభోప‌న్యాసాన్ని ఇచ్చారు.  ఐఎమ్‌సి 2020 స‌మావేశాల‌కు ‘‘ఇన్‌ క్లూసివ్ ఇన్నోవేష‌న్ - స్మార్ట్, సెక్యూర్,  స‌స్‌టేన‌బుల్‌’’ అనే అంశం ఇతివృత్తం గా ఉంది.  ఈ కార్య‌క్ర‌మం ‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌’, ‘డిజిట‌ల్ ఇన్‌ క్లూసివిటీ’, ‘స‌స్‌ టేన‌బుల్‌  డెవెల‌ప్‌మెంట్, ఆంట్రప్రన్యూర్‌ శిప్ & ఇన్నోవేష‌న్‌’ల‌ను ప్రోత్స‌హించాల‌న్న ప్ర‌ధాన మంత్రి దార్శ‌నిక‌త‌ తో తుల తూగాలని లక్ష్యం గా పెట్టుకొంది.  అంతేకాకుండా స్థానిక పెట్టుబ‌డుల‌ను, విదేశీ పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించాల‌ని, టెలికం రంగంలో, కొత్త‌ గా రూపుదాల్చుకున్న సాంకేతిక విజ్ఞాన రంగాల‌లో ప‌రిశోధ‌న, అభివృద్ధి కార్య‌క‌లాపాల‌ను ప్రోత్స‌హించాల‌ని కూడా లక్షిస్తోంది.

ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశాన్ని టెలికమ్ సామగ్రి, డిజైను, అభివృద్ధి, తయారీ లకు ప్రపంచ కేంద్రం గా తీర్చిదిద్దడానికి కలసి పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు.  సాంకేతికత పరంగా చోటు చేసుకొంటున్న ఉన్నతీకరణ కారణంగా మనం హ్యాండ్ సెట్స్ కు, యంత్ర సాధనాలకు తరచుగా ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడానికి అలవాటుపడ్డామని ఆయన అన్నారు.  ఈ ఇలెక్ట్రానిక్ వ్యర్ధాలను మెరుగ్గా పరిష్కరించి, ఒక సర్క్యులర్ ఇకానమి ని ఏర్పాటుచేసేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను పరిశ్రమ ఏర్పాటు చేయగలుగుతుందా అనే అంశాన్ని ఆలోచించండి అంటూ ప్రతినిధులకు ఆయన సూచించారు.  భవిష్యత్తు లోకి దూసుకుపోయేందుకు, లక్షలాది భారతీయులకు సాధికారితను కల్పించడానికి 5జి ని సకాలం లో ప్రారంభించేటట్టు పూచీపడేందుకు కలసికట్టుగా కృషి చేయవలసిందిగా ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.  
 
రాబోయే సాంకేతిక విప్లవం ద్వారా జీవితాలను ఎలా మెరుగుపరచవచ్చో ఆలోచించి తగిన ప్రణాళికలను సిద్ధం చేయడం ముఖ్యం అని ప్రధాన మంత్రి అన్నారు.  ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ, ఉత్తమమైన విద్య, ఉత్తమమైన సమాచారం, మన రైతులకు ఉత్తమ అవకాశాలు, చిన్న వ్యాపారులకు ఉత్తమమైన మార్కెట్ లభ్యత వంటి కొన్ని లక్ష్యల సాధన దిశ లో ముందుకుపోవచ్చని కూడా ఆయన అన్నారు.

మహమ్మారి ప్రబలిన నేపథ్యంలోనూ ప్రపంచం తన కార్యకలాపాలను నెరవేర్చుకొందంటే అందుకు టెలికమ్ రంగ ప్రతినిధుల ప్రయత్నాలు, నూతన ఆవిష్కరణలే కారణం అంటూ ప్రధాన మంత్రి వారిని ప్రశంసించారు.  వారి కృషి ఫలితంగానే ఒక వేరే నగరంలో కుమారుడు తన మాతృమూర్తి తో సంప్రదింపులు జరపగలిగాడు, ఒక విద్యార్థి తరగతి గది కి వెళ్లకుండా కూడా తన టీచర్ వద్ద నుంచి జ్ఞ‌ానార్జన చేయగలిగాడు, ఒక రోగి తన ఇంటి వద్దే ఉన్నా వైద్య సేవ అందుకోగలిగాడు, ఒక వ్యాపారి ఒక వినియోగదారుతో/ అన్య భౌగోళిక ప్రాంతం తో లావాదేవీలను జరపగలిగారని ప్రధాన మంత్రి అన్నారు.

చాలా మంది యువ సాంకేతికులకు ఒక ఉత్పత్తి ని ప్రత్యేకంగా నిలిపేది కోడ్ అయితే కొందరు నవ పారిశ్రామికులకు బాగా పట్టింపు ఉండేది కాన్సెప్ట్ విషయం లోనే అని, అదే ఇన్వెస్టర్ లు మాత్రం ఒక ఉత్పత్తి సత్తా ను తేల్చడానికి మూలధనం మరింత ప్రధానమైందని చెబుతూ ఉంటారని ప్రధాన మంత్రి అన్నారు.  చాలా సందర్భాలలో అన్నిటి కంటే ఎక్కువ ప్రాముఖ్యం కలిగింది ఏమిటి అనే ప్రశ్న ఉదయించినప్పుడు యువకులకు వారి ఉత్పత్తి మీద వారికి ఉండే దృఢమైన విశ్వాసమేనని ఆయన నొక్కిచెప్పారు.  ఒక్కొక్క సారి ఒక లాభసాటి నిష్క్రమణ కు, ఒక యూనికార్న్ అవతరణ కు మధ్య నిలచేది దృఢ విశ్వాసమే అని కూడా ఆయన అన్నారు.

మొబైల్ సాంకేతికత కారణంగానే కరోనా కాలంలో మనం లక్షల కొద్దీ భారతీయులకు కోట్ల కొద్దీ డాలర్ ల ప్రయోజనాలను అందించగలుగుతున్నాం, పేదలకు, దుర్బల వర్గాలకు సాయపడగలిగాం, కోట్ల కొద్దీ నగదురహిత లావాదేవీలను- ఏవయితే పారదర్శకత్వాన్ని, ఫార్మలైజేశన్ ను ప్రోత్సహిస్తున్నాయో- మనం గమనించగలుగుతున్నాం; అంతేకాదు, దారి సుంకాన్ని వసూలు చేసే కేంద్రాలలో మానవ ప్రమేయానికి తావు లేనటువంటి విధంగా సాఫీ గా కార్యకలాపాలను జరుపుకోగలుగుతున్నాం అని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.
 
భారతదేశంలో మొబైల్ మేన్యుఫాక్చరింగ్ లో సాఫల్యాన్ని సాధిస్తుండటం పట్ల ప్రధాన మంత్రి సంతృప్తి ని వ్యక్తం చేశారు.  భారతదేశం మొబైల్ ఫోన్ ల తయారీ కి అత్యంత ప్రాధాన్య గమ్యస్థానాలలో ఒకటి గా ఎదుగుతోందని ఆయన అన్నారు.  భారతదేశం లో టెలికమ్ సామగ్రి తయారీ ని పెంచడానికి ఉత్పాదకత తో ముడిపెట్టిన ప్రోత్సాహకం పథకాన్ని సైతం పరిచయం చేసినట్లు ఆయన చెప్పారు.  రాబోయే మూడు సంవత్సరాలలో, ప్రతి గ్రామంలో హై స్పీడ్ ఫైబర్-ఆప్టిక్ కనెక్టివిటీ ని ప్రవేశపెట్టాలనేది ప్రభుత్వ ధ్యేయంగా ఉందని ఆయన తెలిపారు.  ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో, ఆ కోవకు చెందిన కనెక్టివిటీ ద్వారా అత్యుత్తమ ఫలితాలను రాబట్టగలిగే ప్రాంతాలపై- అంటే మహత్త్వాకాంక్షయుత జిల్లాలు, వామపక్ష ఉగ్రవాద బాధిత జిల్లాలు, ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, లక్షద్వీప్ దీవులు వంటి  ప్రాంతాలపై- ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు వివరించారు.  ఫిక్స్ డ్ లైన్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ ని, సార్వజనిక వై-ఫై హాట్ స్పాట్ లను మరిన్నిటిని విస్తరించగలమని ఆయన తెలిపారు. 

***(Release ID: 1679049) Visitor Counter : 45