రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

నాగాలాండ్.లో ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టుకు గడ్కరీ శ్రీకారం

రూ.4,127కోట్ల వ్యయంతో 266కిలోమీటర్ల
జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన.
గత ఆరేళ్లలో 1063.41కిలోమీటర్ల నిడివితో
55 అభివృద్ధి పనులకు ఆమోదం

Posted On: 04 DEC 2020 1:44PM by PIB Hyderabad

నాగాలాండ్ రాష్ట్రంలో ఒక ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టును కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, సూక్ష్మ, చిన్న మధ్య సంస్థల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు ప్రారంభించారు. రూ. 4,127 కోట్ల వ్యయంతో, 266 కిలోమీటర్ల నిడివితో కూడిన 14 జాతీయ రహదారి పథకాలకు ఆయన శంకుస్థాపన కూడా చేశారు. ఈ కార్యక్రమాలన్నీ వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు.  నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫీయూ రియో, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్, ఎం.పి.లు, ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. *ఈ జాతీయ రహదారుల నిడివి 266కిలోమీటర్లు ఉంది. దాదాపు రూ. 4,127 ఖర్చుతో వీటిని చెపట్టారు.*

   ఈ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి, నాగాలాండ్ ప్రగతికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. గత ఆరేళ్లలో నాగాలాండ్ జాతీయ రహదారుల వ్యవస్థకు 667కిలోమీటర్ల దూరాన్ని అదనంగా చేర్చినట్టు చెప్పారు. ఇది దాదాపు 76శాతం అభివృద్ధిని సూచిస్తోందన్నారు. నాగాలాండ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల వ్యవస్థ 2014వ సంవత్సరం వరకూ 880.68కిలోమీటర్లు ఉండగా, దాన్ని ఇపుడు 1,547కిలోమీటర్ల స్థాయికి విస్తరింపజేసినట్టు చెప్పారు. నాగాలాండ్ లో దాదాపు అన్ని జిల్లాలు ఇపుడు పటిష్టమైన జాతీయ రహదారుల వ్యవస్థతో అనుసంధానమై ఉన్నాయని, కొన్ని ప్రాంతాలు మాత్రమే అనుసంధానం కావలసి ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం జాతీయ రహదారుల సగటు ప్రతి వెయ్యి చదరపు కిలోమీటర్లకు 39.90కిలోమీటర్లు ఉండగా, నాగాలాండ్ లో ప్రతి వెయ్యి చదరపు కిలోమీటర్లకూ 93.30 కిలోమీటర్లుగా ఉందని గడ్కరీ అన్నారు. జనాభా రీత్యా చూసినపుడు,..నాగాలాండ్ లో ప్రతి లక్ష జనాభాకు 77.73 కిలోమీటర్ల జాతీయ రహదారుల వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇదే జాతీయ సగటు ప్రకారం, 10.80కిలో మీటర్ల జాతీయ రహదారుల వ్యవస్థ అందుబాటులో ఉంది.  

  ముఖ్యమైన జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా, గత ఆరేళ్లలో రూ. 11,711కోట్ల వ్యయంతో, మొత్తం 1,063.41కిలోమీటర్ల పొడవుతో కూడిన 55 ప్రాజెక్టులకు ఆమోదం లభించినట్టు తెలిపారు. వీటిలో, దిమాపూర్ సిటీ రహదారుల మెరుగుదల పనుల్లో భాగంగా రూ. 1,598 48కోట్ల వ్యయంతో 48కిలోమీటర్లతో చేపట్టిన 3 కాంక్రీట్ రోడ్డు ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. రూ. 7,955కోట్ల వ్యయంతో చేపట్టిన 690కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి సంబంధించి 16 పనులు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయన్నారు. రూ. 966.75కోట్ల వ్యయంతో 105కిలోమీటర్ల రహదారి నిర్మాణం పనులు ప్రస్తుతం టెండర్ల దశలో సాగుతున్నాయని అన్నారు. రూ. 2,127కోట్లతో 178కిలోమీటర్ల నిడివితో కూడిన 11 పనులకు 2020-21వ సంవత్సరంలో ఆమోదం లభించాల్సి ఉందన్నారు. ఆరు వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టవలసిన 524కిలోమీటర్లతో కూడిన ఐదు పనులు ఇపుడు సవివర ప్రాజెక్టు నివేదిక (డి.పి.ఆర్.) దశలో ఉన్నాయని చెప్పారు. కేంద్ర రహదారుల నిధి (సి.ఆర్.ఎఫ్.) కింద 2002వ సంవత్సరంనుంచి ఇప్పటివరకూ రూ. 1,334.3 కోట్ల మొత్తం మంజూరు కాగా, రూ. 487.14కోట్లు విడుదలైందని కేంద్రమంత్రి చెప్పారు.  నాగాలాండ్ రాష్ట్రంకోసం త్వరలో రూ. 45కోట్లు విడుదల చేయబోతున్నట్టు చెప్పారు.

  నాగాలాండ్ లో కోహిమా బైపాస్ రహదారి నిర్మాణంలో స్థలపరిహారం, నష్టపరిహారానికి సంబంధించి అంచనాలను సత్వరం పంపించాలని నాగాలాండ్ ముఖ్యమంత్రిని గడ్కరీ కోరారు. నాగాలాండ్ లోని కోహిమా-మావో రోడ్డును రెండు వరుసల రహదారిగా తీర్చిదిద్దే పనిని జాతీయ రహదారుల, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్.హెచ్.ఐ.డి.సి.ఎల్.) చేపట్టిందని,.. 2020 సెప్టెంబరు 30న ఈ ప్రాజెక్టు సివిల్ పనులకు ఆమోదం లభించిందని, 2020 అక్టోబరు 20ని అప్పాయింటెడ్ తేదీగా ప్రటించామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సివిల్ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు నాగాలాండ్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

  నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫీయ రియో మాట్లాడుతూ, రాష్ట్రంలోని పర్వతసానువుల్లో రోడ్ల అభివృద్ధి అంశాన్ని పరిశీలించాలని రియో కేంద్రమంత్రిని కోరారు. ఆ ప్రతిపాదన ఇప్పటికే పరిశీలనలో ఉందని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు.  దిమాపూర్-కోహిమా రహదారి నాగాలాండ్ రాష్ట్రానికి జీవనరేఖ వంటిదని ముఖ్యమంత్రి అన్నారు. దీనికి గడ్కరీ ప్రతిస్పందిస్తూ, ఈ రహదారి పని 70-80శాతం పూర్తయిందన్నారు.  ఈ పనులన్నింటినీ వేగవంతం చేసేందుకు ఎన్.హెచ్.ఐ.డి.సి.ఎల్. ముమ్మరంగా కృషి చేస్తోందని, పనులు మరింత వేగంగా ముగించేందుకు ఉన్నత స్థాయిలో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నామని గడ్కరీ చెప్పారు. ఈ రోజు శంకుస్థాపన జరిగిన 26.25కిలోమీటర్ల కోహిమా-మావో రోడ్డు కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్టు అని అన్నారు. మయన్మార్.తో అనుసంధానం చేసే ఆసియన్ రహదారి (ఎ.హెచ్.-1) ఇది ఒక ముఖ్యమైన భాగమవుతుందని, కోహిమా నగరానికి మణిపూర్ సరిహద్దుతో అనుసంధానం మరింతగా మెరుగవుతుందని గడ్కరీ చెప్పారు. నాగాలాండ్ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో ఇది కీలకపాత్ర పోషిస్తుందన్నారు. పరిశ్రామిక, వాణిజ్య అభివృద్ధికి, వెదురు వంటి అనే స్థానిక ఉత్పాదనల మార్కెటింగ్ కార్యకలాపాల విస్తృతికి మెరుగైన రహదారులు ఎంతో దోహదపడతాయన్నారు. 

   కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి (డాక్టర్) వి.కె. సింగ్ మాట్లాడుతూ, నాగాలాండ్ ఎంతో సుందరమైన ప్రదేశమని, కొత్త జాతీయ రహదారుల ప్రాజెక్టులతో మరింత ఎక్కువమంది పర్యాటకులు నాగాలాండ్ పట్ల ఆకర్షితులవుతారని అన్నారు. ఈ రోజు శంకుస్థాపన జరిగిన 14 రోడ్డు ప్రాజెక్టుల్లో 11 పనులను ఎన్.హెచ్.ఐ.డి.సి.ఎల్. అమలు చేస్తుందని, 3 ప్రాజెక్టులను నాగాలాండ్ ప్రజాపనుల శాఖ చేపడుతుందని, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిత్వ శాఖకు చెందిన రహదారుల విభాగం ద్వారా ఈ పనులు చేపడతారని అన్నారు.

యూట్యూబ్ లింక్: https://youtu.be/Ig9MAINaInc

******

 


(Release ID: 1678348) Visitor Counter : 201