పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

ముడిచమురు ధరల నిర్ణయంలో హేతబద్ధత భారత్ అభిమతం: ధర్మేంద్ర ప్రధాన్

2022కు ముడి చమురు దిగుమతులను 10శాతానికి

తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమన్న కేంద్రమంత్రి

సులభతర వాణిజ్య నిర్వహణకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని వెల్లడి

Posted On: 02 DEC 2020 1:40PM by PIB Hyderabad

   ముడి చమురు ధర నిర్ణయం విషయంలో హేతుబద్ధంగా, ప్రతిస్పందనతో వ్యవహరించడమే భారత్ అభిమతమని పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఆత్మనిర్భర భారత్ అంశంపై ఈ రోజు జరిగిన స్వరాజ్య వెబినార్ సదస్సులో కేంద్రమంత్రి మాట్లాడారు.  గుత్తాధిపత్యం పెత్తనానికి రోజులు ఎప్పుడో ముగిశాయని, ఉత్పాదకులు వినియోగదారుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ప్రపంచంలో అందుబాటులో ఉన్న ప్రధాన ఇందనంలో 6శాతాన్ని మాత్రమే భారత్ ప్రస్తుతం వినియోగిస్తోందని, ప్రపంచ సగటు వినియోగంలో భారత్ తలసరి వినియోగం ఇప్పటికీ మూడవ వంతు మాత్రమేనని అన్నారు. అయితే, పరిస్థితి వేగంగా మారుతోందని, ప్రపంచవ్యాప్తంగా ఇంధనానికి ఉన్న డిమాండ్ లో భారత్ కీలకపాత్ర పోషించే సూచనలు ఉన్నాయని, 2040వ సంవత్సరానికల్లా  భారత్ ఇంధన వినియోగం సంవత్సరానికి 3శాతం చొప్పున పెరగవచ్చని అన్నారు. ప్రపంచంలోని బలమైన దేశాలన్నింటిలో కంటే భారత్ లోనే ఎక్కువ వేగంగా ఇంధన వినియోగం పెరుగుతోందన్నారు. 20140కల్లా  ప్రపంచ ఇంధన డిమాండులో భారత్ వాటా 6నుంచి దాదాపు రెట్టింపై 11శాతానికి చేరుకోవచ్చునన్నారు.

  భారత్ లో ఇంధన న్యాయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఐదు అంశాలతో స్పష్టమైన ప్రణాళికను ప్రబోధించారని, అందరికీ ఇంధనం అందుబాటులో ఉండాలని, నిరుపేదలకు కూడా అందుబాటు ధరల్లో లభించాలని, ఇంధన ఉత్పత్తి సామర్థ్యం పెరగాలని, ఇంధన సుస్థిరత అవసరమని, ఇంధనం వనరులపై నిఘా ఉండాలని..ఇలా 5 అంశాలను ప్రధాని సూచించినట్టు చెప్పారు. భారతదేశం ఇంధన వ్యూహాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకతను కూడా ప్రధాని ప్రధానంగా ప్రస్తావించారన్నారు. “2030కల్లా 450 గిగావాట్ల పునరుత్పత్తి ఇంధన ఉత్పాదనా లక్ష్యాన్ని సాధించడంతోపాటుగా, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను, స్వచ్ఛమైన శిలాజ ఇంధనాల వినియోగాన్ని, స్వదేశీ ఇంధనాలు ప్రాతిపదికగా జీవ ఇంధనాలకోసం ప్రత్యేక చర్యలు, విద్యుత్ సేవల పెరుగుదలకు చర్యలు, హైడ్రోజన్ వంటి కొత్తరకం ఇంధనాలవైపు దృష్టిని మళ్లించడం, ఇంధన తయారీ వ్యవస్థల్లో డిజిటల్ పరిజ్ఞానంతో సృజనాత్మకతను ప్రోత్సహించడం వంటి అంశాలపై భారత్ దృష్టిని కేంద్రీకరిస్తుంది. మార్కెట్ ఆధారితంగా, వాతావరణ మార్పులకు ప్రతిస్పందించే రీతిలో మన మన ఇంధన కార్యక్రమం ఉంటుంది. ఇంధన సరఫరా కోసం బహుముఖ మార్గాన్ని మనం అనుసరిస్తున్నాం.” అని ఆయన అన్నారు.

   ఇంధన సంబంధమైన పేదరికాన్ని అంతం చేసే లక్ష్య సాధనకోసం సాగుతున్న పయనంలో భారత్ ప్రస్తుతం పూర్తి పరివర్తనా దశలో ఉందని మంత్రి ప్రధాన్ అన్నారు. “ఈ నేపథ్యంలో స్వచ్ఛమైన శిలాజ ఇంధనాలను, హరిత ఇంధనాలను అందుబాటులో ఉంచడం, అవి అందుబాటు ధరల్లో దొరికేలా చూడటం,...వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న ఇంధన వనరులను ఆమోదయోగ్యమైన రీతిలో మిళతం చేస్తూ వాతావరణంలో కర్బన అవశేషాలను తగ్గించడం.. మన జంట లక్ష్యాలు. ఇందుకోసం విధానపరంగా క్రమం తప్పకుండా చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. రేపటి తరంకోసం మౌలిక సదుపాయాల ఆధారితంగా తీసుకోవలసిన చర్యలను కూడా రూపొందిస్తున్నాం. ఇంధన న్యాయంకోసం ఐదు కీలకమైన అంశాల మార్గదర్శక ప్రణాళికను అనుసరిస్తూ వస్తున్నాం.” అని ఆయన అన్నారు.

  ఆత్మనిర్భర్ భారత్ గురించి ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తావిస్తూ, కోవిడ్-19 సంక్షోభాన్ని భారత్ ఎంతో స్వావలంబన స్ఫూర్తితో పటిష్టంగా ఎదుర్కొందన్నారు. ఆత్మనిర్భర భారత్ కు ఐదు మూల స్తంబాలైన ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ, చైతన్యవంతమైన జనాభా, గిరాకీ వంటి వాటిపై దృష్టిని కేంద్రీకరించనట్టు చెప్పారు. “ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన వంటివి,.. కోవిడ్ సంక్షోభంలో అన్ని సామాజిక వర్గాలకూ తోడ్బాటును అందించాయి. స్వావలంబన స్థాయికి చేరుకోవాలని భారతీయులు ప్రతిన బూనారు. 'ఆత్మనిర్భర భారత్' నినాదం భారతీయుల మనసుల్లో నాటుకుంది. భారతీయుల అభివృద్ధి చరిత్రలో తదుపరి అధ్యాయాన్ని లిఖించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. భారతీయలు కన్న కల ఇప్పడు ప్రతినగా మారుతోంది. ఆత్మనిర్భర భారత్ నినాదం 130కోట్లమంది భారతీయులకు పరిష్కార మంత్రంగా మారిపోయింది.” అని అన్నారు.

  ప్రస్తుతం పూర్తిగా నిష్క్రియాపరత్వంతో ఉన్న భారతీయ మార్కెట్.ను ప్రపంచ విలువల వ్యవస్థలో క్రియాశీలకమైన ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు ఆత్మనిర్భర భారత్ నినాదం దోహదపడుతుందన్నారు. “పటిష్టమైన ఉత్పాదనా రంగంతో, స్వావలంబనతో కూడిన, ప్రపంచ సమీకృతమైన ఆర్థిక వ్యవస్థతో కూడిన బలమైన దేశ నిర్మాణమే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం. అలాంటి భారతదేశం మాత్రమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకోసం బహుముఖ శక్తిగా రూపుదాల్చుతుంది.  'స్థానిక, స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యం' అన్నది భారత్ నినాదం కావాలి. మన స్థానిక ఉత్పాదనలను మనం గౌరవించని పక్షంలో ఆ ఉత్పాదనకు తగిన ప్రోత్సాహం ఎప్పటికీ లభించదు. ఇపుడు ప్రపంచంలోని పలు దేశాలనుంచి బహుళజాతి సంస్థలు మన దేశానికి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో -భారతదేశంలో తయారీ, ప్రపంచం కోసం తయారీ- అన్న మంత్రాన్ని మనం అనుసరించాలి” అని మంత్రి ప్రధాన్ అన్నారు.

    గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం లక్ష్యంగా మనదేశం ముందుకు సాగుతోందని ఆయన  చెప్పారు. “ఇప్పటికే, 16,800 కిలోమీటర్లకు పైగా నిడివితో గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేశాం. అదనంగా 14,700 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది. సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా, దేశన్యాప్తంగా నగరాల్లో గ్యాస్ పంపిణీకోసం భారీ వ్యవస్థల నిర్మాణాన్ని చేపట్టాం. దేశంలోని చాలావరకు ప్రాంతాల్లో కంప్రెస్ట్ నేచురల్ గ్యాస్ (సి.ఎన్.జి.), పైపుల ద్వారా సహజవాయువు (పి.ఎన్.జి.) ఆధారంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకోసం ప్రణాళికలు రూపొందించుకున్నాం. దేశంలోని 407 జిల్లాలకు సి.ఎన్.జి, పి.ఎన్.జి. మౌలిక సదుపాయాలను అందిస్తాం. ఇళ్లకు అందించే పి.ఎన్.జి కనెక్షన్ల సంఖ్య 2014లో 25 లక్షలుకాగా, ఇపుడు 63లక్షలకు పెంచాం.  ఇకముందు 4కోట్లకు పెంచబోతున్నాం.  అలాగే,..2014వ సంవత్సరంలో 938గా ఉన్న సి.ఎన్.జి. కనెక్షన్లను ఇపుడు 10వేల సి.ఎన్.జి. స్టేషన్లకు పెంచాం. ఈ సదుపాయాల విస్తరణ తర్వాత, 70శాతం జనాభాకు స్వచ్ఛమైన ఇంధనం లభిస్తుంది. మొబైల్ లావాదేవీలతో ఇళ్ల ముంగిటికి నేచురల్ గ్యాస్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. స్వర్ణ చతుర్భుజి రహదారులు, జాతీయ రహదారుల వెంబడి 50 ద్రవీకృత వంటగ్యాస్ ఇంధన కేంద్రాల నిర్మాణానికి ఇటీవలే శంకుస్థాపన జరిగింది. మూడేళ్లలో వెయ్యివరకూ ఎల్.పి.జి. కేంద్రాల ఏర్పాటు మా లక్ష్యం. ఇందుకోసం 6.6కోట్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడికి చర్యలు తీసుకున్నాం.” అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

  పునరుత్పాదక ఇంధనాలు, ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలవైపు దృష్టిని మరలిస్తూ అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, 2040కల్లా దేశంలో చమురుకు గిరాకీ రెట్టింపవుతుందని, గ్యాస్ గిరాకీ 3 రెట్లకు పెరుగుతుందని అన్నారు. “మన ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ఇంధన భద్రత సాధించేందుకు మన చమురు శుద్ధి సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తున్నాం. ఇది ప్రస్తుతం సంత్సరానికి 25 కోట్ల మెట్రిక్ టన్నులు ఉండగా,  దాన్ని45కోట్ల మెట్రిక్ టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనితో పెట్రోలియం ఉత్పాదనల సరఫరాలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధిస్తుంది.” అని అన్నారు.

  వాహన కాలుష్య నియంత్రణకు సంబంధించి భారత్-6 నిబంధనలను 2020 ఏప్రిల్ నుంచి విజయవంతంగా అమలు చేశామన్నారు. రోడ్డు రవాణా రంగంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీనితో దేశవ్యాప్తంగా పౌరులకు మెరుగైన గాలి అందుబాటులో ఉంటుందన్నారు. జీవ ఇంధనాలను భారీఎత్తున ప్రోత్సహించేందుకు సంబంధించి 2018వ సంవత్సరపు జాతీయ జీవ ఇంధనాల విధానాన్ని (ఎన్.బి.పి.ని) మంత్రి ప్రస్తావించారు. 2030కల్లా పెట్రోల్ లో 20శాతం ఇథనాల్ ను మిళితం చేయడం, 5శాతం బయో డీజిల్.ను కలపడం ఈ విధానం లక్ష్యమన్నారు. రోజుకు 1,100కిలోలీటర్ల సామర్థ్యంతో 12 టూజీ ఇథనాల్ బయో రిఫైనరీలను 12 రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వాడేసిన వంటనూనెను బయోడీజిల్ గా మార్చే వ్యవస్థలను ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో స్ధాపించాలని భావిస్తున్నట్టు మంత్రి చెప్పారు.

  వినియోగయోగ్యమైన సుస్థిరమైన ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థ (ఎస్.టి.ఎ.టి.) ప్రణాళిక,.. ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమమని చెప్పారు. ఈ ప్రణాళిక కింద రెండువేల కోట్ల అమెరికన్ డాలర్ల వ్యయంతో కోటిన్నర మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన 5వేల కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు.

  భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇందుకోసం ప్రైవేటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ధరలపై ఆఫ్ టేక్ గ్యారంటీ ఇస్తున్నాయని. ఆత్మనిర్భర భారత్, స్వచ్ఛ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా, సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థల (ఎం.ఎస్.ఎం.ఇ.ల) రంగానికి ప్రోత్సాహకరంగా ఎస్.ఎ.టి.ఎ.టి. కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి పథకాలను రిజర్వ్ బ్యాంకు కూడా ప్రాధాన్యతా రంగాల్లో చేర్చిందని. దీనితో ప్లాంట్ల ఏర్పాటుకు రుణ సదుపాయం సులభమవుతుందని, దేశంలో మొత్తం 1,500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని కేంద్రమంత్రి తెలిపారు.

  హైడ్రోజన్ మిళితమైన గ్యాస్ తయారీని ప్రోత్సహించవలసిన అవసరం ఉందని ప్రధాన్ చెప్పారు. హైడ్రోజన్ మిళితమైన కంప్రెస్డ్ నేచరురల్ గ్యాస్ (హెచ్.సి.ఎన్.జి.) ప్లాంటను, సరఫరా కేంద్రాన్ని ఢిల్లీలో గత నెలలోనే ప్రారంభించామన్నారు. హెచ్.సి.ఎన్.జి.తో నడిచే తొలి విడత బస్సులను కూడా ప్రవేశపెట్టామని చెప్పారు.

  2022వ సంవత్సరానికి ముడి చమురు దిగుమతులను పదిశాతం తగ్గించాలన్న ప్రణాళికను  ప్రభుత్వం చేపట్టిందని, ఈ లక్ష్య సాధనకోసం కొత్త వ్యూహాలను, కార్యక్రమాలను రూపొందిస్తున్నామని చెప్పారు. స్వదేశీయంగా ఆయిల్, గ్యాస్ ఉత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. అన్వేషణ, ఉత్పాదనకు సంబంధించిన వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడం, వాణిజ్యానికి సానుకూలమైన వాతావరణం కల్పించడం వంటి లక్ష్యాలతో సంస్కరణలు చేపట్టినట్టు చెప్పారు. చమురు, గ్యాస్ రంగంలో ఉత్పాదనకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. “నేచురల్ గ్యాస్ కు సంబంధించి స్వేచ్ఛాయుతమైన మార్కెటింగ్, ధరల నిర్ణాయకవ్యవస్థ వైపుగా ప్రభుత్వం 2014నుంచి పురోగమిస్తోంది. 2019 తర్వాత స్వదేశీయంగా కనుగొన్న గ్యాస్ మార్కెటింగ్, ధరల నిర్ణయంపై సంపూర్ణ స్వేచ్ఛను అనుమతించాం. అలాగే, జటిలమైన క్షేత్రాలనుంచి (డీప్ వాటర్, అల్ట్రా డీప్, హెచ్.పి-హెచ్.టి.) తీసిన గ్యాస్ కు ప్రీమియం ధరను నిర్ణయించుకునే స్వేచ్ఛను కూడా కల్పించాం“ అని అన్నారు. 

  చమురు, గ్యాస్ రంగంలో స్టార్టప్ సంస్థలకు అవకాశం ఇచ్చామన్నారు. ఇంధన బ్యాటరీలు, సౌరశక్తి ఇంధనం, హైడ్రోజన్, ప్రత్యమ్నాయ ఇంధన వనరులు, విద్యుత్ వాహనాలు తదితర అంశాల్లో కూడా స్టార్టప్ కంపెనీలకు అవకాశం ఇస్తున్నామన్నారు.. ప్రస్తతం చమురు, గ్యాస్ సంబంధిత ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో రూ. 200కోట్ల నిధుల కేటాయింపుతో 175 స్టార్టప్ కంపెనీలు వివిధ పరిణామ దశల్లో ఉన్నాయన్నారు. వివిధ విద్యా సంస్థలు, ఐ.ఐ.టి.లు, ఐ.ఐ.ఎం.లు, ఎన్.ఐ.టి.లు వంటి సాంకేతిక పరిజ్ఞాన వృత్తి నైపుణ్య సంస్థలనుంచి స్టార్టప్ కంపెనీలకు కావలసిన మద్దతు అందిస్తున్నట్టు చెప్పారు. స్టార్టప్ కంపెనీలకు సంబంధించి వచ్చే మూడేళ్లకూ రూ. 300కోట్లు అందించేందుకు చమురు గ్యాస్ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు హామీ ఇచ్చాయని తెలిపారు.

   పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి, హరిత ఇంధనాల తయారీ ప్రాజెక్టులపై దృష్టిని కేంద్రీకరించడానికి ప్రభుత్వ రంగ సంస్థలతో సహా చమురు, గ్యాస్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి ప్రధాన్ చెప్పారు.

  ప్రధానమంత్రి పేర్కొన్నట్టుగా పునరుత్పాదక ఇంధన పథకాలతో సహా, చమురు గ్యాస్ రంగంలో పెట్టుబడులకు ఎక్కువ సానుకూత ఉన్న దేశంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. “సులభతర వాణిజ్య నిర్వహణ” జరిగేలా చూసేందుకు ప్రభుత్వ పూర్తి ప్రాధాన్యం ఇస్తోందని, కాంట్రాక్టులకు కట్టుబడి ఉండటం, పెట్టుబడులకు తగిన రక్షణ కల్పించడం తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరిస్తూనే ఉంటుందని మంత్రి చెప్పారు. స్వదేశీ పెట్టుబడి దార్లకు, విదేశీ పెట్టుబడి దార్లకు తగిన సదుపాయాలు కల్పించేందుకు అన్ని మంత్రిత్వ శాఖల్లో ప్రాజెక్టు అభివృద్ధి విభాగాలను (పి.డి.సి.లను), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్.డి.ఐ.ల) విభాగాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో వాణిజ్య సంస్థల, పెట్టుబడిదార్ల ఆందోళనలను పరిష్కరించేందుకు తగిన రక్షణ చర్యలు తీసుకున్నట్టు  కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.

****(Release ID: 1677838) Visitor Counter : 307