ఆయుష్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వైద్య సౌకర్యం కోసం - "ఆయుష్ డే కేర్ థెరపీ కేంద్రాలు"

Posted On: 02 DEC 2020 2:50PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆయుర్వేదం, యోగా, మరియు ప్రకృతి చికిత్సా వ్యవస్థల క్రింద "డే కేర్ థెరపీ" కేంద్రాల సౌకర్యం కల్పించాలనే ప్రతిపాదనను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సి.జి.హెచ్.ఎస్) కింద ఆమోదం పొందిన, సాధారణ అల్లోపతీ "డే కేర్ థెరపీ" కేంద్రాల మాదిరిగానే, త్వరలో, ఆయుర్వేదం, యోగా మరియు ప్రకృతి వైద్య చికిత్సా విధానానికి చెందిన ప్రైవేటు "డే కేర్ థెరపీ" కేంద్రాలు కూడా సి.జి.హెచ్.ఎస్. జాబితాలో చేరడానికి ఆమోదం పొందనున్నాయి. 

సి.జి.హెచ్.ఎస్. లబ్దిదారులందరూ, సర్వీసులో ఉన్నవారితో పాటు పింఛనుదారులందరూ, ఈ కేంద్రాల ద్వారా ప్రయోజనం పొందవచ్చు.  పెద్ద సంఖ్యలో ప్రజలతో పాటు, సి.జి.హెచ్.ఎస్. లబ్ధిదారులలో ఆయుష్  వైద్య విధానం మరియు ఔషధాల పట్ల పెరుగుతున్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని,  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  ఈ చర్య తీసుకుంది.

ముందుగా, ఢిల్లీ మరియు ఎన్.‌సి.ఆర్. ప్రాంతాలలో, ప్రయోగాత్మకంగా ఒక ఏడాది పాటు, "డే కేర్ థెరపీ" కేంద్రాలను ఆమోదించనున్నారు. ఆ తరువాత ఇతర ప్రాంతాలకు కూడా ఈ సౌకర్యాన్ని విస్తరించే అవకాశాన్ని పరిగణిస్తారు.  

ఈ పథకం కింద కొన్ని గంటల నుండి ఒక రోజు కన్నా తక్కువ సమయం, "డే కేర్ థెరపీ" కేంద్రాల్లో ఉండి, చికిత్స తీసుకునే అవసరం కలిగిన సి.జి.హెచ్.‌ఎస్. లబ్ధిదారులకు, ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.  రోగులకు ఆరోగ్యం,  శ్రేయస్సులను మెరుగుపరచడం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించడం, మెరుగైన సేవలను అందించడం, సామర్థ్యం, సౌకర్యాలను పెంపొందించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ చికిత్స విధానంలో, తెలియని వాతావరణంలో రాత్రిపూట బస చేయవలసిన అవసరం ఉండదు కాబట్టి, పిల్లలు మరియు వృద్ధులైన రోగులకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.  ఆయుష్ వైద్య విధానం యొక్క ప్రయోజనాన్ని విస్తరింపచేయడానికి, ఇది భారత ప్రభుత్వం చేపట్టిన మరొక ముఖ్యమైన చర్య. 

ప్రస్తుతం సి.జి.హెచ్.ఎస్. ఆమోదం పొందిన జాబితాలోని ఆసుపత్రుల్లో చేరిన తరువాత మాత్రమే పంచకర్మ మరియు అభయంగ వంటి ఆమోదించిన విధానాల ద్వారా చికిత్స ఇవ్వబడుతోంది.  దీనివల్ల వైద్య విధాన చార్జీలతో పాటు, ఆసుపత్రి రూమ్ ఛార్జీలు చెల్లించడం ద్వారా  సి.జి.హెచ్.‌ఎస్. పై అదనపు ఆర్ధిక భారం పడుతోంది.   "డే కేర్" కేంద్రాల సేవలను వినియోగించుకోవడం ద్వారా ఆసుపత్రిలో చేరే ఖర్చు తగ్గడంతో పాటు, రోగులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. 

కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు (సి.హెచ్.‌సి), ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు (పి.హెచ్.‌సి),  డిస్పెన్సరీలు, క్లినిక్ లు, పాలీక్లినిక్ లి లేదా స్థానిక అధికారులతో నమోదు చేయబడిన అటువంటి కేంద్రాలతో పాటు శస్త్ర చికిత్స / అనుబంధ శస్త్ర చికిత్సల వంటి సంబంధిత చికిత్సా విధానాలు, వైద్య కార్యక్రమాలను నిర్వహించడానికి తగిన సౌకర్యాలు కలిగి ఉండి, ఆసుపత్రిలో బస చేసి వైద్యం చేయించుకోవలసిన అవసరం లేకుండా, "డే కేర్"  ప్రాతిపదికన రిజిస్టర్డ్ ఆయుష్ మెడికల్ ప్రాక్టీషనర్ల పర్యవేక్షణలో, ఈ క్రింది పేర్కొన్న అంశాలకు లోబడి ఉన్న కేంద్రాలను "ఆయుష్ డే కేర్" కేంద్రాలుగా పరిగణిస్తారు.

i.           అర్హత కలిగిన రిజిస్టర్డ్ ఆయుష్ మెడికల్ ప్రాక్టీషనర్ కలిగి ఉండాలి; 

ii.           అవసరమైన ఆయుష్ థెరపీ విభాగాలను కలిగి ఉండాలి; 

iii.          రోగుల రోజువారీ రికార్డులను నిర్వహిస్తూ, వాటిని బీమా సంస్థ యొక్క అధీకృత ప్రతినిధికి అందుబాటులో ఉంచాలి;

iv.           ఎన్.ఏ.బి.హెచ్. అధికారికమైన గుర్తింపు ఉండాలి లేదా ప్రైవేట్ కేంద్రాల విషయంలో అయితే ప్రారంభ స్థాయి ధృవీకరణ ఉండాలి. 

*****



(Release ID: 1677836) Visitor Counter : 204