పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

"పరిశ్రమల స్వచ్ఛంద భాగస్వామ్యం - తక్కువ కార్బన్ పరిశ్రమల పరివర్తనకు కీలకమైనది" : శ్రీ ప్రకాష్ జవదేకర్

Posted On: 01 DEC 2020 5:46PM by PIB Hyderabad

వాతావరణ మార్పులను తగ్గించే దిశగా మన ప్రయత్నాలలో ప్రజలు, పరిశ్రమలు కీలకమని, కేంద్ర పర్యావరణ, వాతావరణ మార్పు, అటవీ శాఖల మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. 

పారిశ్రామిక పరివర్తన నాయకత్వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా, ఉన్నత స్థాయి విభాగంలో, కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలోని మొత్తం కర్బన్ ఉద్గారాలలో దాదాపు 30 శాతం కర్బన ఉద్గారాలు పరిశ్రమల ద్వారా వెలువడుతున్నాయనీ, వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి తక్కువ కార్బన్ మార్గాల వైపు పరిశ్రమల్లో గట్టి పరివర్తన తీసుకురావడం ముఖ్యమనీ, పేర్కొన్నారు.

దేశంలోని అగ్రశ్రేణి పరిశ్రమలు స్వచ్ఛందంగా ఎటువంటి ఆదేశాలు లేకుండా, కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు, దేశంలోని అనేక సంస్థలు, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని చురుకుగా ప్రోత్సహిస్తున్నాయని, శ్రీ జవదేకర్ తెలియజేశారు.

"ఇది ఒక పెద్ద ముందడుగు, కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా పరిశ్రమల స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.", అని కేంద్ర పర్యావణ శాఖ మంత్రి సూచించారు.

ఈ విషయంలో ఆర్ధిక వనరుల ఆవశ్యకత గురించి శ్రీ జావదేకర్ మాట్లాడుతూ, ఇందు కోసం నిధులను పెద్ద ఎత్తున సమీకరించడంతో పాటు, వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని కోరారు.

పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా పనిచేయడానికి వీలుగా సరసమైన సాంకేతిక పరిజ్ఞానాలతో పాటు, పరిశోధన అధ్యయనాలను  అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. 

ప్రతి వాతావరణ చర్యకు ఖర్చు ఉందని దేశాలు మర్చిపోకూడదనీ, అయితే, వాతావరణ మార్పును ఒక విపత్తుగా భావిస్తే, ఈ విపత్తు నుండి ఎవరూ లాభపడకూడదన్న విషయాన్ని శ్రీ జవదేకర్ ప్రముఖంగా పేర్కొన్నారు. ఇది వాతావరణ పరంగా న్యాయం కాదనీ, అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన పేదలపై ఇది ఒక రకంగా, రెట్టింపు పన్ను విధించటానికి సమానమని, కేంద్ర మంత్రి అన్నారు.

అదే సమయంలో, ప్రతి వాతావరణ చర్యకు ( #ClimateAction ) ఖర్చు ఉంటుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదని, ఆయన అన్నారు. 

వాతావరణ మార్పును ( #ClimateChange ) ఒక విపత్తుగా మనం భావించినట్లైతే, అప్పుడు ఆ విపత్తు నుండి ఎవరూ లాభపడకూడదు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల పేదలపై రెట్టింపు పన్ను విధించటానికి సమానం ( #ClimateJustice pic.twitter.com/GwrXB4pULO ) అయితే, ఇది సరైనది కాదు. 

  ----- ప్రకాష్ జావదేకర్ (@PrakashJavdekar) డిసెంబర్, 1, 2020

శిఖరాగ్ర సమావేశంలో స్వీడన్ ఉప ప్రధాన మంత్రి ఇసాబెల్లె లెవిన్ మాట్లాడుతూ,  వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించడానికి భారత, స్వీడన్ దేశాలు కలిసి పనిచేయాలని చెప్పారు.  కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఉత్తమ పద్ధతులు మరియు అనుభవాలను పంచుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.  కర్బన ఉద్గారాలను ఎదుర్కోవటానికి ఆర్థిక సమీకరణ కోసం, స్వీడన్ ఉప ప్రధాన మంత్రి కూడా సూచించారు. స్వీడన్ ప్రభుత్వం ఈ దిశగా పనిచేయడానికి కట్టుబడి ఉందని, ఆమె అన్నారు.

పారిశ్రామిక పరివర్తన కోసం నాయకత్వ బృందం (లీడ్.ఐ.టి) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.  ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ వాతావరణ కార్యాచరణ సదస్సు సందర్భంగా 2019 లో స్టాక్ ‌హోమ్ పర్యావరణ సంస్థ సహకారంతో అంతర్జాతీయ ఆర్ధిక మండలి ‌తో పాటు భారత్, స్వీడన్ దేశాలు లీడ్.ఐ.టి ని ప్రారంభించాయి. ప్రస్తుతం, ఈ బృందంలో భారతదేశానికి చెందిన డాల్మియా సిమెంట్, మహీంద్రా గ్రూప్, స్పైస్ జెట్ తో సహా 15 కంపెనీలు, 13 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇవి,  తక్కువ కార్బన్ పరిశ్రమ పరివర్తనకు కట్టుబడి ఉన్నాయి.

పారిస్ ఒప్పందానికి ఐదేళ్ళు పూర్తయిన విషయాన్ని ప్రపంచం సూచిస్తున్న సందర్భంగా,  పరిశ్రమ పరివర్తన ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో "లీడ్.ఐ.టి." సంస్థ, ఈ పరిశ్రమ పరివర్తన నాయకత్వ శిఖరాగ్ర సమావేశాన్ని దృశ్య మాధ్యమం ద్వారా ఏర్పాటుచేసింది.  పరిశ్రమ పరివర్తన కోసం డిమాండ్ మరియు విస్తరణతో పాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగవంతం చేయడం కోసం ప్రయోగాత్మకంగా ఒక వ్యాపార నమూనా ను చేపట్టాలని ఈ సదస్సు ప్రధానంగా నొక్కి చెప్పింది.

దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో -  స్కానియా; ఎఫ్.ఎల్.స్మిత్; ఎల్.కె.ఏ.బి;  లాఫార్జ్ హోల్సిమ్, ఎస్.ఎస్.ఎ.బి; వట్టెన్ ఫాల్ వంటి అంతర్జాతీయ సంస్థల అధిపతులతో పాటు,  దాల్మియా; మహీంద్రా గ్రూప్ వంటి భారతీయ సంస్థల అధిపతులు కూడా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో యు.కె; లక్సెంబర్గ్; ఈ.యు; జర్మనీ వంటి దేశాల మంత్రులు, ప్రతినిధులతో పాటు పలువురు అంతర్జాతీయ నిపుణులు, మేధావులు కూడా పాల్గొన్నారు.

*****


(Release ID: 1677557) Visitor Counter : 217