మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కొత్త విద్యావిధానంలో రిజర్వేషన్లకు ఢోకా లేదు

రిజర్వేషన్లను, ఎన్.ఇ.పి.2020 సమర్థిస్తోందన్న కేంద్రమంత్రి పోఖ్రియాల్

Posted On: 01 DEC 2020 3:45PM by PIB Hyderabad

భారత రాజ్యాంగంలో ప్రాధాన్యమిచ్చిన రిజర్వేషన్ల విధానాన్ని నూతన విద్యా విధానం (ఎన్.ఇ.పి.-2020) గట్టిగా సమర్థిస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ఈ రోజు స్పష్టం చేశారు. నూతన విద్యావిధానంపై వివరాలతో కేంద్రమంత్రి రాసిన లేఖ పూర్తి పాఠం ఈ కింది విధంగా ఉంది.:

 

  “రాజ్యాంగంలో పేర్కొన్న రిజర్వేషన్ విధానాన్ని నూతన విద్యావిధానం సమర్తిస్తున్నట్టేనా.. అనే సందేహాలతో, నవంబరు 24 ప్రాంతంలో పి.టి.ఐ. పేరిట మీడియాలో వెలువడిన వార్తలకు సంబంధించి ఈ వివరణ ఇస్తున్నాను. మీడియాలో వచ్చిన వార్తావ్యాసం నేపథ్యంలో నా రాజకీయ మిత్రులు నూతన విద్యావిధానంపై పలు సందేహాలు వ్యక్తం చేశారు.. దేశ విద్యావ్యవస్థలో రిజర్వేషన్ల నిబంధనల స్థాయిని నూతన విద్యా విధానం తగ్గిస్తుందేమో అన్న సందేహాలను వారు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నా అధికార పరిధిలో నేను వివరణ ఇవ్వదలుచుకున్నాను. విద్యావ్యవస్థలో రిజర్వేషన్లను పలుచన చేసే ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదు. కొత్త విద్యావిధానం కూడా ఇదే అంశాన్ని ప్రతిబింబిస్తోంది. భారతీయ రాజ్యాంగంలోని 15,16 అధికరణాల్లో పొందుపరిచిన రిజర్వేషన్లను నూతన విద్యా విధానం కూడా గట్టిగా ధ్రువీకరిస్తోంది. రిజర్వేషన్ నిబంధనలను గురించి కొత్తవిధానంలో ప్రత్యేకంగా పునరుద్ఘాటించవలసిన అవసరం లేదని నేను భావిస్తున్నాను.

  నూతన విద్యావిధానంపై ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా అనేక ప్రవేశ పరీక్షలు జరిగాయి. జె.ఇ.ఇ., నీట్ (ఎన్.ఇ.ఇ.టి.),, యు.జి.సి.నెట్ వంటి ప్రవేశ పరీక్షలు, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష వంటి ఎన్నో పరీక్షలు జరిగాయి. వివిధ విద్యాసంస్థల్లో పలురకాల నియామకాలను కూడా చేపట్టారు. అయితే, ఎక్కడా రిజర్వేషన్ల నిబంధనలను నీరుగార్చారనిగానీ, రిజర్వేషన్ల స్థాయిని తగ్గించారనిగానీ ఇప్పటిదాకా ఒక్క ఫిర్యాదూ అందలేదు. కొత్త విద్యావిధానాన్ని ప్రకటించిన నాలుగైదు నెలల తర్వాత, ఎలాంటి వాస్తవిక ఆధారాలు లేకుండా ఇపుడు ఇలా అనుమానాలు లేవనెత్తడం ఏమిటో నాకు అర్థం కావడంలేదు. విజయవంతంగా సాగుతున్న పథకాలు, కార్యక్రమాలు, విధానాలు ఎప్పటిలాగే ముందుకు సాగుతాయి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలవారికి, ఇతర వెనుకబడిన తరగతులకు, దివ్యాంగులకు, సామాజికంగా, ఆర్థికంగా అవకాశాలకు నోచుకోని గ్రూపులకు విద్యావ్యవస్థలో ప్రాతినిధ్యం కల్పించే కృషి గతంలోవలే కొనసాగి తీరుతుందని, ఇందుకోసం కొత్తగా మరిన్ని చర్యలు కూడా తీసుకుంటామని నేను నొక్కి చెబుతున్నాను. ఇందుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా పరిష్కారంకోసం నా మంత్రిత్వ శాఖ అన్ని చర్యలూ తీసుకుంటుందని స్పష్టం చేయదలుచుకున్నాను.

   ఎన్.ఇ.పి.-2020 రూపకల్పనలో బహుముఖంగా ఎంతో కృషి జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థల పరిపాలనా నిపుణులు, విద్యా వేత్తలు, బోధనేతర సిబ్బందితో పాటు పలు భాగస్వామ్య వర్గాలను, సమాజంలోని అన్ని వర్గాలను సంప్రదించిన మీదటే కొత్త విద్యావిధానం రూపుదిద్దుకుంది. అట్టడుగున ఉన్న గ్రామాలనుంచి రాష్ట్రస్థాయివరకూ, జోనల్ స్థాయినుంచి జాతీయ స్థాయివరకూ సంప్రదింపుల ప్రక్రియ సాగింది. పలు అధ్యయన అంశాల నిపుణులతో కూడా సంప్రదింపులు జరిగాయి. ఎన్.ఇ.పి. మధింపు కమిటీ, ఎన్.ఇ.పి. ముసాయిదా తయారీ కమిటీ తదితర కమిటీలతో సంప్రదింపులు, MyGov.in వెబ్ సైట్ వేదికగా ఆన్ లైన్ ద్వారా సంప్రదింపులు నిర్వహించిన తర్వాతనే విద్యావిధానం తయారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అన్న సూత్రం మార్గదర్శకంగా ఒక ప్రజా పత్రంగా ఎన్.ఇ.పి.-2020 రూపుదాల్చింది. అందువల్లనే, సమాజంలోని అన్ని వర్గాలను, గ్రూపులను కలపుకునిపోయే దృఢ నిర్ణయంతో కొత్త విధానం మన ముందుకు వచ్చింది.

  సమాజంలోని వివిధ వర్గాలకు, గ్రూపులకు విద్యాపరంగా తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు కొత్త విద్యావిధానం ప్రత్యేక పంథాను అనుసరించింది. ఎస్.సి.లు, ఎస్.టి.లు, ఒ.బి.సిలు, దివ్యాంగులు, బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, మైనారిటీలు, భౌగోళికంగా అల్పసంఖ్యాకులు, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికపరంగా అవకాశాలకు నోచుకోనివారు,..ఇలా వీరందరినీఒక ప్రత్యేక సమూహంగా నూతన విద్యావిధానం గుర్తించింది. వీరికోసం ‘సామాజికంగా, ఆర్థికంగా అవకాశాలు లేని గ్రూపుల సమూహం’ (ఎస్.ఇ.డి.జి.ల క్లస్టర్) అంటూ ఒక సమూహాన్ని ఏర్పాటు చేసింది. ఎస్.ఇ.డి.జి.ల క్లస్టర్.కు సంబంధించిన సమస్యలను పరిష్కారంకోసం వివిధ రకాల ప్రత్యేక విద్యా మండలుల (ఎస్.ఇ.జెడ్.ల) రూపకల్పనకు కొత్త విద్యావిధానం చర్యలు తీసుకుంది. విద్యాపరంగా ఎవరెవరు అవకాశాలకు నోచుకోలేదన్న ప్రాతపదికతో ఈ మండళ్లను ఏర్పాటు చేశారు. ఎస్.సి.లు, ఎస్.టి.లు, ఒ.బి.సి.లు, దివ్యాంగులతో సహా వివిధ వర్గాలకు విద్యా పథకాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకే వీటి రూపకల్పన జరిగింది. సామాజికంగా, ఆర్థికంగా అవకాశాలకు నోచుకోని గ్రూపులనుంచి విద్యాపరంగా బలమైన బలగం రూపకల్పనకు ఇది ఎంతో వినూత్నమైన, విభిన్నమైన కార్యక్రమం. ఆయా గ్రూపులనుంచి విద్యాపరంగా బలమైన బలగంగా తయారయ్యే వారికి కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా ఈ పథకం కల్పిస్తుంది. ఉపకార వేతనాలు, సైకిళ్ల పంపిణీ, ప్రత్యక్ష నగదు బదిలీ వంటి ప్రభుత్వ పథకాల ద్వారా, ఆయా గ్రూపులకు విద్యావకాశాల్లో భాగస్వామ్యం, ప్రాతినిధ్యం కల్పించేందుకు వీలు కలుగుతుంది.

  ఆడపిల్లలకు, మహిళలకు విద్యావకాశాలు కల్పించే లక్ష్య సాధనకు ‘జెండర్-వన్ సమ్మిళిత నిధి’ పేరిట ప్రత్యేక పథకానికి నూతన విద్యావిధానం అవకాశం కల్పించింది. లైంగిక ప్రాతిపదికన సామాజికపరంగా, శారీరక దౌర్బల్యం కారణంగా అవకాశాలకు నోచుకోని వారికోసం వివిధ పథకాలను అమలు చేసేందుకు ఈ నిధి ఎంతో దోహదపడుతుంది. ఇక మైనారిటీలకోసం, విద్యాపరంగా వారి అవసరాలకోసం, విద్యావ్యవస్థలో వారికి తగిన ప్రాతినిధ్యంకోసం నూతన విద్యావిధానం అనేక నిబంధనలను పొందుపరిచింది. కొత్త విద్యావిధానం ప్రకారం మైనారిటీల పాఠశాలలు, కళాశాలను ప్రారంభించేందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. వారికోసం ప్రత్యామ్నాయ రూపంలో పాఠశాలలకు కూడా మద్దతు అందిస్తారు. మైనారిటీ విద్యార్థులకు అవసరమైన ప్రత్యేక ఉపకార వేతనాలకు కూడా  విద్యావిధానంలో ఏర్పాట్లు ఉన్నాయి.

  నూతన విద్యావిధానం పరిధిలోని పథకాలన్నింటినీ మన విధాన నిర్ణయ కర్తలు ఎంతో సృజనాత్మకంగా రూపుదిద్దారు. విద్యావస్థలో ఎన్నో పెనుమార్పులు తేగలిగే ఈ కొత్త  విధానం,.. అన్ని వర్గాల ప్రాతినిధ్యంతో భారతీయ విద్యా చరిత్రలో ఎంతో ప్రముఖ పరిణామంగా నిలిచిపోయే అవకాశం ఉంది.

  షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వేషన్లను పదేళ్లు పొడిగిస్తూ లోక్.సభలో, వివిధ రాష్ట్రాల శాసనసభల్లో  తీర్మానం ఆమోదించడంద్వారా. ఆయా సామాజికవర్గాల రిజర్వేషన్లకు ప్రభుత్వం ఎంతో కట్టుబడి ఉందని నేను మరోసారి స్పష్టం చేస్తున్నాను.  

  చారిత్రాత్మకమైన కొత్త విద్యావిధానంపై సందేహాలను నివృత్తి చేస్తూ, దురభిప్రాయాలను తొలగిస్తూ నేను వ్యక్తం చేసిన ఈ అభిప్రాయాలు తప్పక ప్రచురితమవుతాయని, తద్వారా కొత్త విద్యావిధానంపై  దేశ ప్రజలకు నిజానిజాలు తెలిసివస్తాయని నేను ఆశిస్తున్నాను.”

 

రమేశ్ పోఖ్రియాల్ ‘నిషాంక్’

******


(Release ID: 1677550) Visitor Counter : 200