ప్రధాన మంత్రి కార్యాలయం
జి20 నేతల పదిహేనో శిఖర సమ్మేళనం
Posted On:
21 NOV 2020 10:35PM by PIB Hyderabad
1. సౌదీ అరేబియా ఈ నెల 21-22 తేదీల లో ఏర్పాటు చేసిన జి20 తాలూకు పదిహేనో శిఖర సమ్మేళనం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. 19 సభ్యత్వ దేశాల ప్రభుత్వాలు/ దేశాధిపతులు, ఇయు, ఆహ్వానాలు అందుకొన్న ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థలు పాలుపంచుకొన్న ఈ శిఖర సమ్మేళనాన్ని కొవిడ్- 19 మహమ్మారి నేపథ్యం లో వర్చువల్ పద్ధతి లో నిర్వహించారు.
2. ఈ సంవత్సరం లో జి20 కి విజయవంతంగా అధ్యక్షత వహించిన సౌదీ అరేబియా కు, సౌదీ అరేబియా నాయకత్వానికి ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. అలాగే, కొవిడ్-19 మహమ్మారి రువ్విన సవాళ్ళు రువ్వి, అవరోధాలను కల్పించినా వాటికి ఎదురీది వర్చువల్ మాధ్యమం ద్వారా జి20 రెండో శిఖర సమ్మేళనాన్ని ఈ సంవత్సరం లో నిర్వహిస్తున్నందుకు కూడా ఆయన అభినందనలు తెలిపారు.
3. సౌదీ అరేబియా అధ్యక్షతన సాగిన ఈ శిఖర సమ్మేళనం ‘‘అందరి కోసం 21వ శతాబ్ధి తాలూకు అవకాశాలను దక్కించుకోవడం’’ అనే ఇతివృత్తం ప్రధానం గా జరిగింది. వర్తమాన కొవిడ్-19 మహమ్మారి నేపథ్యం లో ఈ శిఖర సమ్మేళనానికి మరింత ప్రాముఖ్యం ఏర్పడింది. ఈ శిఖర సమ్మేళనం కార్యక్రమాల పట్టిక రెండు సదస్సులతో రెండు రోజుల పాటు కొనసాగింది. చేపట్టిన చర్చనీయాంశాల లో మహమ్మారి ని అధిగమించడం, ఆర్థిక వ్యవస్థలను మళ్ళీ గాడిన పెట్టడం, ఉద్యోగాల పునఃకల్పన, అన్ని వర్గాలను కలుపుకొనిపోయే, స్థిరమైన ప్రాతిపదిక కలిగిన, శక్తియుత భవిష్యత్తు నిర్మించడం వంటి అంశాలపై దృష్టి ని కేంద్రీకరించడం జరిగింది. మహమ్మారి ని ఎదుర్కోవడం పట్ల సన్నద్ధత, భూ గ్రహాన్ని పరిరక్షించడం అనే అంశాలపై కూడా కొన్ని కార్యక్రమాలను చేపట్టడం కూడా ఈ రెండు రోజుల సమ్మేళనం లో భాగం గా ఉంది.
4. కొవిడ్-19 మహమ్మారి మానవ జాతి చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. ఇది రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి చూసినట్లయితే ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు అని ఆయన అన్నారు. జి20 సభ్యత్వ దేశాలు ఆర్థిక వ్యవస్థలను , ఉద్యోగాలను, వ్యాపారాలను మళ్లీ గాడి న పెట్టడానికే పరిమితం కాకుండా మనం అందరమూ మానవాళి భవిష్యత్తు కు ధర్మకర్తలం అనే సంగతిని గుర్తు పెట్టుకొని భూ గ్రహాన్ని సంరక్షించడం పట్ల శ్రద్ధ తీసుకోవాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
5. కరోనా అనంతర ప్రపంచం లో ఒక కొత్త గ్లోబల్ ఇండెక్స్ అవసరమంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. దీనిలో నాలుగు కీలక అంశాలు ఉండాలని ఆయన చెప్పారు. అవి ఏమిటంటే - ప్రతిభావంతుల తో కూడిన ఒక పెద్ద సమూహాన్ని రూపొందించడం, సాంకేతిక విజ్ఞానం సమాజంలో అన్ని వర్గాల చెంతకు చేరేటట్లుగా పూచీ పడటం, ప్రభుత్వ వ్యవస్థలలో పారదర్శకత్వానికి పెద్ద పీట ను వేయడం, భూమాత కు సంబంధించిన విషయాలలో ధర్మకర్తృత్వ భావన తో మెలగడం - అన్నారు. ఈ అంశాలతో జి20 సభ్యత్వ దేశాలు ఒక నూతన ప్రపంచానికి పునాది ని వేయగలుగుతాయి అని ఆయన అన్నారు.
6. గత కొన్ని దశాబ్దాలలో మూలధనానికి, ఆర్థిక సహాయానికి ప్రత్యేక ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగగా, ఒక భారీ మానవ ప్రతిభా రాశిని సృష్టించేందుకు బహుళ నైపుణ్యాల సాధన, కొత్త నైపుణ్యాలను సంపాదించుకోవడం అనే అంశాలపై శ్రద్ధ వహించవలసిన కాలం ఆసన్నం అయిందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఇది పౌరుల గౌరవాన్ని ఇనుమడింపచేయడమొక్కటే కాకుండా మన పౌరులను సంక్షోభాలను తట్టుకొని నిలచేటట్లు మరింత శక్తివంతులుగా కూడా మార్చగలుగుతుందని ఆయన చెప్పారు. నూతన సాంకేతిక విజ్ఞానం తాలూకు ఎలాంటి మదింపు అయినా సరే అది ‘జీవించడం లో సౌలభ్యాన్ని’, అలాగే ‘జీవిత నాణ్యత పై ప్రసరింపచేసే ప్రభావం’ ఆధారంగా సాగాలి అని ఆయన అన్నారు.
7. పరిపాలన వ్యవస్థలలో మరింత ఎక్కువ పారదర్శకత్వం అవసరమని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ఇది మన పౌరులు ఉమ్మడి సవాళ్ళను ఎదురొడ్డి నిలచేందుకు వారికి ప్రేరణను అందించడంతో పాటు, వారి విశ్వాసాన్ని పెంపొందింప చేస్తుందని ఆయన చెప్పారు. ప్రకృతి తోను, పర్యావరణం తోను ధర్మకర్తల మాదిరి గా నడచుకోవడం మంచిదని, ఇది ఒక సమగ్రమైన ఆరోగ్యప్రమైన జీవన శైలి దిశ లో మనలను ప్రేరేపిస్తుందని, ఈ సిద్ధాంతానికి తలసరి కర్బన పాదముద్ర ఒక గీటురాయి కాగలుగుతుందని ఆయన అన్నారు.
8. కొవిడ్ అనంతర ప్రపంచం లో ‘ఎక్కడి నుంచి అయినా పని చేయడం’ అనేది ఒక కొత్త సాధారణ నియమం గా వ్యవహారంలోకి వచ్చిందని ప్రధాన మంత్రి పేర్కొంటూ, దీనికి తరువాయి గా జి20 వర్చువల్ సెక్రటేరియట్ ను ఏర్పాటు చేయాలని, అందులో దస్తావేజు పత్రాలను దాచి ఉంచవచ్చని సూచించారు.
9. జి20 నేతల పదిహేనో శిఖరాగ్ర సమావేశం ఈ నెల 22 వరకు కొనసాగుతుంది. ముగింపు రోజు న నేత ల ప్రకటన పాఠాన్ని విడుదల చేస్తారు. అలాగే సౌదీ అరేబియా జి 20 కూటమి అధ్యక్ష పీఠాన్ని ఇటలీ కి అప్పగిస్తుంది.
***
(Release ID: 1675232)
Visitor Counter : 269
Read this release in:
English
,
Hindi
,
Punjabi
,
Assamese
,
Manipuri
,
Urdu
,
Marathi
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam