ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్ లకు ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపిన - కేంద్ర ప్రభుత్వం

కంటైన్మెంట్, నిఘా, పరీక్ష, సంక్రమణ నివారణ, మరియు సమర్థవంతమైన వైద్య చికిత్స నిర్వహణలకు సహాయపడనున్న - కేంద్ర బృందాలు

Posted On: 19 NOV 2020 3:08PM by PIB Hyderabad

హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్ రాష్ట్రాలకు, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను నియమించింది.  కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో రోజువారీ కొత్త కేసుల పెరుగుదల మరియు రోజువారీ మరణాల పెరుగుదలతో, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఎన్.‌సి.ఆర్. ప్రాంతాలలో వైరస్ వ్యాప్తి ప్రభావం ఎక్కువగా ఎక్కువగా ఉంది, ఈ ప్రాంతాల్లో కోవిడ్ పాజిటివ్ రోగుల సంఖ్య పెరుగుతోంది.

హర్యానా కు బయలుదేరిన ముగ్గురు సభ్యుల బృందానికి న్యూఢిల్లీ లోని ఎయిమ్స్ కు డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నాయకత్వం వహిస్తున్నారు.  నీతీ ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు, డాక్టర్ వి.కె.పాల్, రాజస్థాన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. కాగా, గుజరాత్ జట్టుకు ఎన్‌.సి.డి.సి. సభ్యుడు  డాక్టర్ ఎస్. కె. సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. డి.హెచ్.జి.ఎస్. అదనపు డి.డి.జి.  డాక్టర్ ఎల్. స్వస్తి చరణ్ మణిపూర్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు.

అధిక సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్న జిల్లాలలో ఈ బృందాలు పర్యటిస్తాయి. వ్యాధి వ్యాప్తి నియంత్రణ, నిఘా, పరీక్ష, సంక్రమణ నివారణ వంటి నియంత్రణ చర్యలతో పాటు పాజిటివ్ కేసుల సమర్థవంతమైన వ్యాధి చికిత్స నిర్వహణను బలోపేతం చేయడానికి వీలుగా ఈ బృందాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రయత్నాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తాయి.

సకాలంలో రోగ నిర్ధారణకు సంబంధించిన సవాళ్లను సమర్థవంతంగా నిర్వహించడంలో కేంద్ర బృందాలు మార్గనిర్దేశం చేస్తాయి.

 

 

‘సహకార సమాఖ్య విధానం’ అనే ప్రధాన వ్యూహం కింద ‘మొత్తం ప్రభుత్వం’ మరియు ‘మొత్తం సమాజం’ అనే విధానంతో, ప్రపంచ వ్యాప్త మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి కేంద్ర ప్రభుత్వం నాయకత్వం వహిస్తోంది.  కోవిడ్ నిర్వహణ కోసం వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల ప్రయత్నాలను బలోపేతం చేయడానికి కొనసాగుతున్న కృషిలో భాగంగా, కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలను సందర్శించడానికి వీలుగా, ఎప్పటికప్పుడు, కేంద్ర బృందాలను నియమిస్తోంది.  ఈ బృందాలు ఆయా రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సంబంధిత అధికారులతో చర్చలు జరిపి, వారు ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటాయి. తద్వారా వారు చేపట్టిన కార్యకలాపాలను బలోపేతం చేయడానికీ, ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగించడానికి ఈ బృందాలు సహాయం చేస్తాయి.

*****


(Release ID: 1674075) Visitor Counter : 220