ప్రధాన మంత్రి కార్యాలయం

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్య‌క్షుని గా ఎన్నికైన శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ తో టెలిఫోన్ లో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

ఉపాధ్య‌క్ష పదవికి ఎన్నికైన సెనేటర్ క‌మ‌లా హ్యారిస్ కు కూడా ప్ర‌ధాన మంత్రి హార్దిక అభినందనలను, శుభాకాంక్ష‌లను తెలిపారు

ఉమ్మడి విలువ‌లు, ఉమ్మ‌డి హితాల పై నిర్మిత‌మైన‌ ఇండియా-యు.ఎస్. సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం కోసం క‌లిసిక‌ట్టుగా కృషి చేయాల‌ని అంగీక‌రించిన నేత‌లు

Posted On: 17 NOV 2020 11:50PM by PIB Hyderabad

అమెరికా అధ్య‌క్ష పదవి కి ఎన్నికయిన శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, అమెరికా అధ్య‌క్షుని గా ఎన్నికైనందుకు శ్రీ బైడెన్ కు ఆత్మీయ అభినందనలు తెలిపారు. ఈ ఎన్నిక‌ యునైటెడ్ స్టేట్స్ ప్ర‌జాస్వామ్య సంప్ర‌దాయాల ప‌టిష్ట‌త‌కు, శక్తి కి ఒక నిద‌ర్శ‌న‌ం అని శ్రీ మోదీ అభివర్ణించారు.

అమెరికా ఉపాధ్య‌క్ష పదవికి ఎన్నికయిన సెనేట‌ర్ క‌మ‌లా హ్యారిస్ కు కూడా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌న హృద‌యపూర్వ‌క అభినందనలను, శుభాకాంక్ష‌లను వ్యక్తం చేశారు.

2014వ సంవత్సరంలో, 2016వ సంవత్సరం లో యునైటెడ్ స్టేట్స్ లో తన ఆధికారిక సందర్శన లు సహా ఇంతకు ముందు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ తో తాను జ‌రిపిన సంభాష‌ణ‌లను గురించి ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భం లో ఆప్యాయంగా గుర్తుకు తెచ్చారు.  2016 వ సంవత్సరం లో జరిగిన యు.ఎస్. కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించినప్పుడు ఆ స‌మావేశానికి శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ అధ్యక్షత వహించారు.
 
ఉభయ దేశాల మ‌ధ్య‌ ఉమ్మడి విలువ‌లు, ఉమ్మ‌డి ప్రాధాన్య‌ాలు పునాదులుగా  రూపు దిద్దుకొన్న ‘ఇండియా-యు.ఎస్. కాంప్రిహెన్సివ్ గ్లోబల్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్’ ను మ‌రింత ముందుకు తీసుకుపోవడానికి క‌లిసిక‌ట్టుగా ప‌ని చేయాల‌ని నేత‌లు అంగీక‌రించారు.  నేతలు కోవిడ్- 19 మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి, తక్కువ ఖర్చు లో టీకామందులను అంద‌రికీ అందుబాటు లోకి తీసుకురావడానికి వీలుగా తగిన ప్రచారాన్ని చేయడం, జల వాయు పరివర్తన సమస్యల‌ను ప‌రిష్క‌రించ‌డం, ఇండో- ప‌సిఫిక్ ప్రాంతంలో స‌హ‌కారం సహా వారి ప్రాధాన్య‌త‌లను గురించి కూడా చర్చించారు.


 

***


(Release ID: 1673655) Visitor Counter : 209