ప్రధాన మంత్రి కార్యాలయం
జైన ఆచార్య శ్రీ విజయ్ వల్లభ్ సురీశ్వర్ జీ మహారాజ్ 151 వ జయంతి సూచకం గా ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ ను ఆవిష్కరించిన ప్రధాన మంత్రి
స్థానిక ఉత్పత్తులవైపు మొగ్గు చూపడం ద్వారా ఆత్మనిర్భరత ను ప్రోత్సహించవలసిందిగా ఆధ్యాత్మిక నాయకులను ప్రధాన మంత్రి అభ్యర్థించారు
Posted On:
16 NOV 2020 1:35PM by PIB Hyderabad
జైన ఆచార్యుడు శ్రీ విజయ్ వల్లభ్ సురీశ్వర్ జీ మహారాజ్ 151 వ జయంతి ఉత్సవాలకు గుర్తు గా ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ (శాంతి విగ్రహం)ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న ఆవిష్కరించారు. జైన ఆచార్య గౌరవార్థం ఆవిష్కరించిన ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ అని పేరు పెట్టడమైంది. 151 అంగుళాల ఎత్తయిన ఈ విగ్రహాన్ని అష్టధాతువుల తో, అంటే 8 లోహాలతో, నిర్మించడం జరిగింది. దీనిలో రాగి ప్రధాన ధాతువు గా ఉంది. దీనిని రాజస్థాన్ లోని పాలీ లో గల జేత్ పుర లో నెలకొల్పారు.
ఈ సందర్భం లో జైన ఆచార్య కు, అలాగే ఆధ్యాత్మిక నాయకులకు ప్రధాన మంత్రి నమస్సులు అర్పించారు. ఇద్దరు ‘వల్లభుల’ను.. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, అలాగే జైన ఆచార్య శ్రీ విజయ్ వల్లభ్ సురీశ్వర్ జీ మహారాజ్ లను.. గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ప్రపంచంలో కెల్లా అతి ఎత్తయిన సర్ దార్ పటేల్ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ని ప్రపంచ ప్రజలకు అంకితం చేసిన తరువాత, ఇప్పుడు జైన ఆచార్య శ్రీ విజయ్ వల్లభ్ కు చెందిన ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ ను కూడా ఆవిష్కరించే అవకాశం తనకు దక్కినందుకు తాను ఎంతో అదృష్టవంతునిగా భావిస్తున్నానన్నారు.
‘స్థానిక ఉత్పత్తులనే కొందాం’ (వోకల్ ఫార్ లోకల్) అన్న తన పిలుపు ను శ్రీ మోదీ పునరుద్ఘాటిస్తూ, స్వాతంత్య్ర పోరాట కాలంలో జరిగిన విధంగానే ఆధ్యాత్మిక నాయకులంతా ఆత్మనిర్భరత సందేశాన్ని విరివిగా ప్రచారంలోకి తీసుకురావాలని, ‘స్థానిక ఉత్పత్తుల’ వైపే మొగ్గు చూపడం తాలూకు ప్రయోజనాలను గురించి ప్రజలకు బోధించవలసిందంటూ అభ్యర్ధించారు. దీపావళి పండుగ సందర్భం లో దేశంలో స్థానిక వస్తువులకు మద్దతిచ్చిన తీరు ఉత్తేజకరమైన భావన ను రేకెత్తించిందని కూడా ఆయన అన్నారు.
భారతదేశం ప్రపంచానికి అన్ని వేళల్లో శాంతి, అహింస, స్నేహం లతో కూడిన మార్గాన్ని చూపిందని ప్రధాన మంత్రి అన్నారు. వర్తమాన కాలం లో ఇదే విధమైన మార్గదర్శకత్వం కోసం భారతదేశానికేసి ప్రపంచం తన దృష్టిని సారిస్తోందని ఆయన అన్నారు. మీరు భారతదేశ చరిత్ర ను పరిశీలించారంటే గనక అవసరపడినపుడల్లా ఎవరో ఒక సాధువు సమాజానికి మార్గనిర్దేశం చేసేందుకు అవతరించారు, ఆ కోవకు చెందిన సాధువుల లో ఆచార్య విజయ్ వల్లభ్ ఒకరు అని ప్రధాన మంత్రి అన్నారు. జైన ఆచార్యులు ఏర్పాటుచేసిన విద్య సంస్థలను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో భారతీయ విలువలను పుణికి పుచ్చుకొన్న అనేక విద్య సంస్థలను స్థాపించి విద్యా రంగంలో దేశాన్ని స్వయంసమృద్ధియుతంగా తీర్చిదిద్దే దిశలో ఆయన కృషి చేశారంటూ ప్రశంసించారు. ఈ విద్య సంస్థలు దేశ ప్రజలకు ఎనలేని సేవ చేసిన ఎంతో మంది పారిశ్రామికవేత్తలను, న్యాయమూర్తులను, వైద్యులను, ఇంజినీర్ లను అందించాయి అని ఆయన వివరించారు.
మహిళల విద్య రంగం లో ఈ సంస్థలు చేసిన కృషికి గాను వాటికి దేశం రుణపడిపోయిందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ విద్య సంస్థలు ఆనాటి కష్టకాలాల లో బాలికల విద్య జ్యోతి ప్రకాశిస్తూ ఉండేటట్టు చూశాయని ఆయన చెప్పారు. బాలికల కోసం అనేక సంస్థలను జైన ఆచార్య నెలకొల్పి, మహిళలను ప్రధాన స్రవంతి లోకి తీసుకు వచ్చారని ఆయన అన్నారు. ఆచార్య విజయ్ వల్లభ్ గారిలో ప్రతి ఒక్కరి పట్ల దయాళుత్వం, కరుణ, వాత్సల్యం నిండి ఉండేవి అని ఆయన అన్నారు. దేశం లో ప్రస్తుతం అనేక గోశాలలతో పాటు, బర్డ్ హాస్పిటల్ నడుస్తున్నాయి అంటే అందుకు ఆయన ఆశీర్వాదాలు కారణమన్నారు. ఇవి సాధారణ సంస్థలేం కాదు, ఇవి భారతీయ స్ఫూర్తి మూర్తీభవించిన సంస్థలు, భారతదేశానికి, భారతీయ విలువలకు ప్రమాణ చిహ్నాలు అని ప్రధాన మంత్రి అన్నారు.
***
(Release ID: 1673195)
Visitor Counter : 216
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam