ప్రధాన మంత్రి కార్యాలయం
దీపావళి పండుగను దేశ సరిహద్దు ప్రాంతాల్లో జరుపుకున్న - ప్రధానమంత్రి
సైనికులతో గడపకుండా నా దీపావళి పండుగ పూర్తికాదు : లోంగేవాలా పోస్ట్ వద్ద ప్రధానమంత్రి
‘విస్తరణ శక్తులకు వ్యతిరేకంగా శక్తివంతమైన గొంతుగా భారతదేశం అవతరించింది’
‘మమ్మల్ని పరీక్షిస్తే, ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుంది’
‘ఈ రోజు స్వదేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించేవారిని భారతదేశం దెబ్బ కొట్టింది’
Posted On:
14 NOV 2020 1:54PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, సాయుధ దళాలతో దీపావళిని గడిపే తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, భారతీయ సరిహద్దు స్థావరమైన లోంగెవాలా వద్ద సైనికులను కలుసుకుని, వారి నుద్దేశించి ప్రసంగించారు. మంచుతో కప్పబడిన పర్వతాలలో లేదా ఎడారిలో ఉన్న సైనికులతో గడిపిన తర్వాత మాత్రమే తన దీపావళి పండుగ పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి భారతీయుని తరఫున, సరిహద్దులోని సాయుధ దళ సిబ్బందికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు, ఆశీర్వాదాలను అందజేశారు. ధైర్యవంతులైన తల్లులు మరియు సోదరీమణులను అభినందిస్తూ, వారి త్యాగానికి ప్రధానమంత్రి నివాళులర్పించారు. దేశ ప్రజల తరఫున సాయుధ దళాలకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేస్తూ, 130 కోట్ల మంది భారతీయులు సాయుధ బలగాలకు మద్దతుగా నిలిచి ఉన్నారని పేర్కొన్నారు.
దాడి చేసేవారినీ, చొరబాటుదారులనూ ఎదుర్కొనే సామర్ధ్యం ఉన్న దేశం మాత్రమే సురక్షితంగా ఉంటుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. అంతర్జాతీయ పరస్పర సహకారంలో పురోగతి, సమీకరణాలలో మార్పులతో సంబంధం లేకుండా, అప్రమత్తతే భద్రతకు కీలకమనీ, అప్రమత్తతే ఆనందానికి ఆధారమనీ, మన బలమే మన విజయం యొక్క విశ్వాసమనీ మనం ఎప్పుడూ మరచిపోలేమని ఆయన వ్యాఖ్యానించారు.
భారతదేశ విధానం చాలా స్పష్టంగా ఉందని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. నేటి భారతదేశం అర్థం చేసుకోవడంపైన, అర్ధాన్ని వివరించడంపైన విశ్వాశం ఉంచుతుందనీ, అయితే, మమ్మల్ని పరీక్షించే ప్రయత్నం చేస్తే, ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుందని, ఆయన హెచ్చరించారు.
ఈ రోజు, ఈ దేశం తన జాతీయ ప్రయోజనాలపై రాజీపడదన్న విషయం, ప్రపంచానికి స్పష్టంగా తెలుసని ఆయన ప్రకటించారు. భారతదేశం యొక్క ఈ స్థితి దాని శౌర్యం మరియు సామర్ధ్యాల కారణంగా ఏర్పడింది. సాయుధ దళాలు అందించే భద్రత కారణంగా భారతదేశం అంతర్జాతీయ వేదికలపై బలవంతంగా నిలబడగలిగింది. భారతదేశం యొక్క సైనిక శక్తి దాని చర్చల శక్తిని పెంచిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ రోజు భారతదేశం స్వదేశంలో ఉగ్రవాదం పై తగిన చర్యలు తీసుకుంది.
విస్తరణవాద భావజాలాన్ని భారతదేశం ఇప్పుడు శక్తివంతంగా ఎదుర్కొంటోందనీ, 18వ శతాబ్దపు ఆలోచనను ప్రతిబింబించే మానసిక వక్రబుద్ధితో కూడిన విస్తరణవాద శక్తుల వల్ల మొత్తం ప్రపంచం బాధపడుతోందనీ, ప్రధానమంత్రి పేర్కొన్నారు.
"ఆత్మ నిర్భరత" మరియు ‘వోకల్ ఫర్ లోకల్" ప్రాధాన్యతల గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, 100 కి పైగా ఆయుధాలు మరియు ఉపకరణాలను ఇకపై దిగుమతి చేసుకోకూడదని, సాయుధ బలగాలు ఇటీవల నిర్ణయించిన విషయాన్ని తెలియజేశారు. ‘వోకల్ ఫర్ లోకల్" ఉద్యమానికి మద్దతుగా ముందుకు సాగుతున్నందుకు సాయుధ దళాలను ఆయన అభినందించారు.
దళాల అవసరాలను తీర్చడానికి అనేక అంకుర సంస్థలు ముందుకు వస్తున్నందున సాయుధ దళాల కోసం ఉత్పత్తి చేయాలని దేశంలోని యువతకు శ్రీ మోదీ పిలుపునిచ్చారు. రక్షణ రంగంలో యువత నేతృత్వంలో నెలకొల్పిన అంకురసంస్థలు దేశాన్ని స్వావలంబన దిశగా ముందుకు తీసుకువెళతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సాయుధ దళాల స్ఫూర్తితో, మహమ్మారి కాలంలో ప్రతి పౌరుడినీ రక్షించడానికి దేశం ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పౌరులకు ఆహారాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు, దేశం ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి దేశం తీవ్రంగా శ్రమిస్తోందని ఆయన తెలియజేశారు.
సైనికులను మూడు విషయాలు చేయవలసిందిగా ప్రధానమంత్రి కోరారు. మొదట, ఆవిష్కరణను వారి రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోమనీ; రెండవది, యోగాను వారి జీవితంలో భాగంగా చేసుకోమనీ; చివరగా, వారి మాతృభాష హిందీ మరియు ఇంగ్లీష్ కాకుండా కనీసం మరొక భాషను నేర్చుకోమనీ, ఇది మీ జీవితాన్ని కొత్త శక్తితో నింపుతుందనీ, ప్రధానమంత్రి వివరించారు.
లోంగెవాలా యొక్క అద్భుతమైన యుద్ధాన్ని ప్రధాని గుర్తుచేసుకుంటూ, వ్యూహాత్మక ప్రణాళిక, సైనిక శౌర్యం యొక్క వార్షికోత్సవాలలో ఈ యుద్ధం ఎల్లప్పుడూ గుర్తుంచుకోబడుతుందని పేర్కొన్నారు. పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ అమాయక పౌరులను భయపెట్టి, మన కుమార్తెలు, సోదరీమణులపై దారుణాలకు పాల్పడిన సమయంలో, పాకిస్తాన్ వికృత స్వరూపం బహిర్గతమయ్యిందని ఆయన తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దృష్టిని మళ్లించడానికి పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దు అంశాన్ని తెరపైకి తెచ్చిందనీ, అయితే, మన భద్రతా దళాలు వారికి తగిన సమాధానం ఇచ్చాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
*****
(Release ID: 1672933)
Visitor Counter : 266
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam